కాంగ్రెస్ పీఏసీ మీటింగ్.. హాజరుకానున్న సీఎం సహా కీలక నేతలు
స్థానిక సంస్థల ఎన్నికలు, ఏడాది పాలనపై చర్చించడానికి బుధవారం కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ గాంధీ భవన్ లో సమావేశం కానుంది
దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలు, ఏడాది పాలనపై చర్చించడానికి బుధవారం కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ గాంధీ భవన్ లో సమావేశం కానుంది. ఈ మీటింగుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇన్ చార్జి దీపా దాస్ మున్షీ తో సహా 23 మంది పీఏసీ సభ్యులు హాజరు కానున్నారు. ఇచ్చిన, నెరవేర్చిన హామీలు, స్థానిక సంస్థల్లో పార్టీ విజయానికి కృషి చేసే విధంగా పార్టీ కీలక నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకుపోవడం, పార్టీ కార్యక్రమాలు, పార్టీ కేడర్కు ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉండే విధంగా సూచనలు ఇవ్వనున్నారు. త్వరలో ప్రారంభించనున్న రైతు భరోసా, భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్స్ ను ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా చూడనున్నారు.
పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదైనా కూడా కొందరు ప్రజాప్రతినిధుల తీరు ఇంకా ఆశాజనకంగా లేదని గుర్తించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రిపరేషన్లో కూడా నాయకులు చురుగ్గా వ్యవహరించడం లేదని, వీటన్నింటిపై అధిష్ఠానానికి నివేదికలు అందాయని, వారందరికీ హెచ్చరిక ఉండే విధంగా సమావేశంలో కేసీ వేణుగోపాల్ ప్రసంగించే అవకాశం ఉందని సమాచారం. కొందరు మంత్రుల తీరు వల్ల పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కరంగా మారాయని, కొందరు మంత్రులు సీరియస్ గా పనిచేయకపోవడం, స్పందించకపోవడం లాంటి వాటితో ప్రజల్లో పలుచన అవుతున్నామని, ప్రతిపక్షాలకు ఆస్త్రాలు ఇచ్చినట్లుగా అవుతుందని ప్రభుత్వానికి నివేదికలు అందాయి. వీటన్నింటి నేపథ్యంలో బుధవారం సాయంత్రం జరగనున్న పీఏసీ సమావేశం ఆసక్తికరంగా మారింది. వీటితోపాటు ప్రభుత్వంపై ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం లాంటి వాటిపై స్పందించే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.