‘మూసీ’పై కాంగ్రెస్ కొత్త ప్లాన్

మూసీ పునరుజ్జీవనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతున్నది.

Update: 2024-10-26 02:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ పునరుజ్జీవనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతున్నది. ఈ ప్రాజెక్టుతో జరిగే ప్రయోజనాలను ప్రజల ముందు ఉంచనున్నది. దీనిలో భాగంగా తొలి సభ ఈ నెల 27న ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి అడ్డగూడురు లో నిర్వహించనున్నారు. చివరి సభను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల ఫస్ట్ వీక్ లో ‘లక్ష ’మందితో భారీ సభ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మీటింగ్ కు సీఎం, పీసీసీ చీఫ్, కేబినెట్ మంత్రులు హాజరు కానున్నారు. అధికారులు, ముఖ్య నేతలు, పర్యావరణ వేత్తలు, స్వచ్ఛంధ సంస్థలు సైతం వేదికను పంచుకోనున్నారు. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్సీలతోపాటు ప్రజలు హాజరు కానున్నారు. మూసీ పునరుజ్జీవనంపై ఎక్స్ పర్ట్స్ తో అవగాహన కల్పించడమే కాకుండా, ప్రభుత్వం తన యాక్షన్ ప్లాన్ ను కూడా ప్రజలకు వివరించనున్నది. దీని వలన ప్రజల్లో కన్ ఫ్యూజన్ పోతుందని ప్రభుత్వం అనుకుంటున్నది. ఈ ద్వారా మూసీ పరివాహక ప్రాంతాలు, అనుసంధాన ఏరియాల్లోని ప్రజలకు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమంపై స్పష్టత వస్తుందని భావిస్తున్నది.

ప్రజల ఆందోళనకు చెక్

దాదాపు 57 కి.మీ మూసీ నదీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నడుం బిగించింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు డీపీఆర్ కోసం ఐదు బడా కంపెనీలకు దాదాపు రూ.141 కోట్ల టెండర్లు కూడా ఇచ్చింది. ప్రభుత్వ తరపున ఓ బృందం సియోల్ పర్యటించి వచ్చింది. అయితే ప్రతిపక్షాలు పదే పదే రాద్దాంతం చేస్తున్న నేపథ్యంలో సాధారణ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దీని వలన ప్రభుత్వానికి మైనస్ అయ్యే ప్రమాదం ఉన్నదని గుర్తించిన కాంగ్రెస్, ప్రజాప్రతినిధులు, ఎక్స్ పర్ట్స్ తో కలిసి సభలు, యాత్రలు, సదస్సులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది. మురికి కూపంగా ఉన్న మూసీని ఎలా తయారు చేస్తాం? ఇక్కడి నుంచి తరలించిన ప్రజలకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వనున్నది? ఎలాంటి ఉపాధి ఇవ్వనున్నది? ఈ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తులో మూసీ ఎలా మారబోతున్నది? అనే అంశాలపై కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నది. మూసీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటున్న తీరు, నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వంటి అంశాలను తెలియజేయనున్నారు. మూసీని కాపాడుకోకపోతే భవిష్యత్ పరిణామాలను వివరించనున్నారు. వరదల కారణంగా బెంగళూరు, చెన్నయ్, ప్రకృతి వైపరీత్యాలతో విలవిల్లాడిన వయనాడ్ వంటి నగరాల పరిస్థితులను బోర్డుల రూపంలో ప్రదర్శించనున్నారు. మూసీ ప్రక్షాళనకు మద్దతుగా నేటి నుంచి ప్రారంభించనున్న పిల్లాయిపల్లి అవగాహన యాత్రకు రైతులు, కులవృత్తిదారులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు.

మూసీ పునరుజ్జీవంపై అవగాహన యాత్ర -ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

‘మూసీ పునరుజ్జీవానికి మద్దతు తెలపాలని శనివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పిల్లాయిపల్లి చౌరస్తా నుంచి అవగాహన యాత్ర చేపడుతున్నాం. మక్త అనంతారం గ్రామాల మధ్య మూసీ బ్రిడ్జి పై మూసీ పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు, కులవృత్తిదారులు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని అడ్డగూడూరు మండలం మానాయకుంట గ్రామంలో నియోజకవర్గ స్థాయి లో మీటింగ్ నిర్వహించబోతున్నాం. ఆ తర్వాత ఈ మీటింగ్ లను హైదరాబాద్ వరకు తీసుకువెళ్తాం. చివరి సభ గ్రేటర్ పరిధిలో భారీగా నిర్వహిస్తాం. కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, రైతులు, కుల వృత్తుల వారు అధిక సంఖ్యలో పాల్గొనాలి.


Similar News