Telangana Congress: కిషన్ రెడ్డి ముందు ఆ పని చేస్తే బాగుంటుంది
కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy)పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్(Adluri Laxman) తీవ్ర విమర్శలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy)పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్(Adluri Laxman) తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఆపేసి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారని తమను ప్రశ్నిస్తే బాగుంటుందని కౌంటర్ ఇచ్చారు. ఇచ్చిన గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేశామని.. నిత్యం తమ పార్టీ ప్రజాప్రతినిధులంతా ప్రజల్లోనే ఉన్నామని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడానికి బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. అంతకుముందు కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని అన్నారు. గతంలో పదేళ్ల పాటు రాష్ట్రాన్ని బీఆర్ఎస్(BRS) దోచుకుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను పక్కనబెట్టి వ్యక్తిగత కక్షలను కాంగ్రెస్ నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారని సీరియస్ అయ్యారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనేక హామీలు గుప్పించి రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తోందని అన్నారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నేతల్లో మార్పు వచ్చింది తప్ప.. తెలంగాణ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో రెచ్చిపోగా.. తాజాగా కిషన్ రెడ్డికి అడ్లూరి కౌంటర్ ఇచ్చారు.