కేటీఆర్.. సోయి లేకుండా మాట్లాడితే ఊరుకోం

కేటీఆర్.. జాబ్ క్యాలెండర్ పై చర్చకు మేం సిద్దం.. మీరు సిద్ధమా? అంటూ గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ సవాల్ విసిరారు.

Update: 2024-08-03 16:20 GMT

దిశ, వెబ్ డెస్క్ : కేటీఆర్.. జాబ్ క్యాలెండర్ పై చర్చకు మేం సిద్దం.. మీరు సిద్ధమా? అంటూ గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ సవాల్ విసిరారు. శనివారం గాంధీభవన్ లో స్పోక్స్ పర్లన్లు దయాకర్, లింగం యాదవ్ లతో కలసి మీడియా సమావేశం నిర్వహించిన డాక్టర్ రియాజ్.. నిరుద్యోగులకు మేలు జరిగేలా ఉద్యోగాల భర్తీ కోసమే జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశామన్నారు. బీఆర్ఎస్ దీన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు. కేటీఆర్ కు అనుమానాలు ఉంటే సెంట్రల్ లైబ్రరికి రావాలని, విద్యార్ధులే సమాధానం చెప్తారన్నారు. తమ ప్రభుత్వం యూపీఎస్సీ తరహాలో రిక్రూట్ మెంట్లు పూర్తి చేయాలని ముందుకు వెళ్తుంటే.. కేటీఆర్ సోయి లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం హయంలో నీళ్లు, నిధులు, నియామకాల అంశాన్ని తుంగలో తొక్కిన బీఆర్ఎస్, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ పై తప్పుడు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా, నిరుద్యోగుల అంశాన్ని పక్కకు పెట్టేశారని, కానీ తమ ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే 30 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.

గ్రూప్1 పేపర్ లీకేజీ పైన కేటీఆర్ ఎందుకు నోరు మూసుకున్నాడో అందరికీ అర్థం అవుతుందన్నారు. నిరుద్యోగులు గత పదేళ్ల కాలంలో తీవ్ర నిరాశకు గురయ్యారని, కాంగ్రెస్ వచ్చాకే ఉద్యోగం వస్తుందన్న నమ్మకంతో ప్రిపరేషన్ లో నిమగ్నమయ్యారన్నారు. త్వరలోనే టీజీపీఎస్సీ ఖాళీల వివరాలను ప్రకటిస్తుందన్నారు. ఇక స్కిల్ యూనివర్సిటీతో తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. స్పోక్స్ పర్సన్ లింగం యాదవ్ మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్ తో ఉద్యోగాలు భర్తీ పారదర్శకంగా జరుగుతాయన్నారు. ప్రజాప్రభుత్వానికి అండగా అందరూ నిలబడలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లు నిరుద్యోగులకు అన్యాయం, ద్రోహం చేశాయన్నారు.


Similar News