కేసీఆర్ రాజకీయ వ్యూహంపై సస్పెన్స్

కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నా, విమర్శిస్తున్నా, అవినీతి ఆరోపణలు చేస్తున్నా ఆ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం సైలెంట్‌గానే ఉన్నారు.

Update: 2024-09-24 21:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నా, విమర్శిస్తున్నా, అవినీతి ఆరోపణలు చేస్తున్నా ఆ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం సైలెంట్‌గానే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఎక్కువ సమయం ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌కే పరిమతమయ్యారు. తొలుత కొన్ని రోజులు అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఒక్క రోజు మాత్రం బడ్జెట్ సమావేశానికి హాజరయ్యారు. అక్కడే ఉంటూ అవసరమైనప్పుడు లీడర్లను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. సమీప గ్రామాల్లోని కార్యకర్తలనూ అప్పడప్పుడు కలుస్తున్నారు. కానీ పార్టీ హెడ్ క్వార్టర్‌ తెలంగాణ భవన్‌కు రాకపోకలు పరిమితమయ్యాయి. రివ్యూ మీటింగులు, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం, పార్టీ కొత్త కమిటీల కూర్పు... ఇలాంటివి చాలా ఉంటాయని పార్టీ వర్గాలు చెప్తున్నా అవేవీ కార్యరూపం దాల్చలేదు. అధికారం కోల్పోయినప్పటి నుంచి రెగ్యులర్ యాక్టివిటీస్‌ తగ్గిపోయాయని, నాయకత్వం నుంచి ప్లానింగ్ కూడా ఉండడంలేదని పార్టీ శ్రేణులే అసంతృప్తితో ఉన్నాయి.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు నియోజకవర్గాల స్థాయిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో సుడిగాలి పర్యటన చేసిన కేసీఆర్... మరోసారి అధికారంలోకి రావడం ఖాయమనే ధీమాను అభ్యర్థుల్లో కల్పించారు. ఓడిపోతున్నామన్న సంగతిని ఆయన రెండు వారాల ముందుగానే గ్రహించారని సన్నిహితులు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఆ అనుమానమే కేసీఆర్ ప్రసంగాల్లోనూ రిఫ్లెక్ట్ అయిందని గుర్తుచేశారు. అందులో భాగమే 2023 అక్టోబరు 26న అచ్చంపేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రజలకు నేరుగానే అప్పీల్ చేశారు. గెలిపించాల్సిన బాధ్యత ప్రజలదేనని, వారే ఓడగొడితే చేయగలిగిందేమీ లేదని పై వ్యాఖ్యలతో స్పష్టమవుతున్నది. అచ్చంపేట సభలో ఆయన ఏం చెప్పారో పది నెలలుగా ఆ ప్రాక్టీసునే కొనసాగిస్తున్నారు. ఓడగొడితే రెస్టు తీసుకుంట.. అని చెప్పినట్లుగానే ఇప్పుడు ఆయన విశ్రాంతిలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తూర్పారపడతారని రెండు పార్టీల నేతల్లో అప్పట్లో చర్చ జరిగింది. కానీ ఒక్క రోజు మినహా ఆ సెషన్ మొత్తానికే గైర్హాజరయ్యారు.

ఇటీవల ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినా, వరదలు వచ్చి వేలాది కుటుంబాలు ఇబ్బంది పడినా ఫామ్ హౌజ్ గడప దాటలేదన్న విమర్శలూ కేసీఆర్‌పై వచ్చాయి. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చేసిన ‘ఆంధ్ర’ కామెంట్లతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో, ఆ రాష్ట్ర స్థానికత ఉన్న ఓటర్లలో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వచ్చినా కేసీఆర్ సైలెంట్‌గానే ఉండిపోయారు. కౌశిక్‌రెడ్డి కామెంట్లపై ఏ రూపంలోనూ కేసీఆర్ స్పందించలేదు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు కవిత అరెస్టు సందర్భంగా ‘కూతుర్ని చూడడానికి కూడా కేసీఆర్‌కు మనసు రాలేదు..’ అంటూ విమర్శించారు. అప్పుడు కూడా ఆయన పెద్దగా స్పందించలేదు. పదిమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరినప్పుడూ మౌనంగానే ఉండిపోయారు. దాదాపు 11 నెలలుగా ఫామ్‌హౌజ్‌లో రెస్టు తీసుకుంటున్న కేసీఆర్ ఆ రోజు అచ్చంపేట సభలో ఏం చెప్పారో అదే చేస్తున్నారని ఆ పార్టీ కేడర్ మధ్యనే గుసగుసలు మొదలయ్యాయి. హైడ్రా విషయంలోనూ ఎలాంటి ప్రకటన చేయకుండా పట్టీ పట్టనట్లుగానే ఉన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలు కూడా ఉంటదో... ఉండదో.. అంటూ తొలుత కామెంట్ చేసిన కేసీఆర్... పార్లమెంటు ఎన్నికల్లోనూ ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొనలేదు. గతంకంటే ఒక సీటు ఎక్కువే వస్తుందని, బీజేపీకి గుండు సున్నా అని కామెంట్ చేశారు. ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేసినా దానికి రివర్సుగా ఫలితాలు రావడంతో జనం ముందుకు రాకుండా జాగ్రత్తలు పడ్డారు. రెండు లక్షల రుణమాఫీ అమలుపైనా ‘నో కామెంట్’ అనే తీరులోనే ఉన్నారు. ఖరీఫ్ సీజన్ నాట్లు పడినా, పంట పనులు మొదలైనా రైతుభరోసా నిధులు అందలేదంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నా పార్టీ తరఫున అధికారికంగా కేసీఆర్ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఇటీవల పలువురు మాజీ మంత్రులు ఫామ్ హౌజ్ వెళ్ళి కేసీఆర్‌ను కలిసినప్పుడు ప్రజల్లో వ్యతిరేకత పెరిగి రోడ్డెక్కినప్పుడు చూద్దాం... ఇప్పుడే మనంతట మనం బట్టలు చింపుకోవాల్సిన అవసరం లేదు.. అంటూ వ్యాఖ్యానించినట్లు ఆ పార్టీ నేతల ద్వారా తెలిసింది. ప్రజల్లో కదలిక లేనప్పుడు మనం ఏం చేసినా వృథాయేనని వారికి అర్థం చేయించినట్లు తెలిసింది.

కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలతో మరికొంత కాలం ఆయన ఫామ్ హౌజ్‌లోనే ఉంటారనే అభిప్రాయం కేడర్‌కు ఏర్పడింది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వైఖరేంటో, వచ్చే ఏడాది జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారోననే ఆసక్తిని శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. కానీ కేసీఆర్ స్పందిస్తారా?... క్షేత్రస్థాయిలో పార్టీని విడిచిపెట్టి వెళ్తున్నవారిని కన్విన్స్ చేస్తారా?.. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల వరకూ ఫామ్ హౌజ్‌కే పరిమితమవుతారా?.. ఇలాంటివి వినిపిస్తున్నాయి. కేసీఆర్ మాటల్ని వినాలనుకునే శ్రేణులు ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాయి. కేసీఆర్ నుంచి వచ్చే సమాధానం, స్పందనే ఇప్పుడు ఆసక్తిగా మారింది.


Similar News