‘బీజేపీ రైతు హామీల సాధన దీక్ష’ డేట్ ఫిక్స్

రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని నిర్ణయించుకున్న కాషాయ పార్టీ రైతు దీక్షకు పిలుపునిచ్చింది.

Update: 2024-09-24 20:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని నిర్ణయించుకున్న కాషాయ పార్టీ రైతు దీక్షకు పిలుపునిచ్చింది. ఈ దీక్షను ఈనెల 20వ తేదీనే చేపట్టాలని భావించింది. కానీ సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతుండటంతో పాటు ఇతర అనివార్య కారణాల వల్ల ఈ దీక్ష ఆలస్యమైంది. ఎట్టకేలకు రైతు దీక్ష డేట్ ను బీజేపీ ఫిక్స్ చేసుకుంది. ఈనెల 30వ తేదీన ‘బీజేపీ రైతు హామీల సాధన దీక్ష’ పేరిట ధర్నాకు సిద్ధమైంది. బీజేఎల్పీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వేదికగా ఈ ధర్నాను చేపట్టనున్నారు. 24 గంటల పాటు ఈ దీక్ష కొనసాగనుంది. ఈనెల 30వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మరుసటి రోజు అంటే అక్టోబర్ 1వ తేదీ ఉదయం 11 గంటల వరకు ధర్నా చేపట్టనున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా ఈ కార్యక్రమానికి హాజరవ్వనున్నారు. వారితో పాటు బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు సైతం ధర్నాలో పాల్గొంటారు. అన్నదాతలకు అండగా ఉండటంతో తామున్నామనే భరోసా కల్పించేందుకు ఈ దీక్షను బీజేపీ చేపడుతోంది. అన్నదాతలకు అండగా 24 గంటలు దీక్షకు చేపట్టనుంది.

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రధానంగా రైతు సమస్యలపైనే బీజేపీ రైతు హామీల సాధన దీక్షలో పోరాడనుంది. రైతు రుణమాఫీతో పాటు, రైతు భరోసా కింద రైతులకు ఇస్తామన్న రూ.15 వేలు, కౌలు రైతులకు ఇస్తామన్న రూ.12 వేలు, వరికి బోనస్ తో పాటు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఫెయిల్ అయిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ చూస్తోంది. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తానని సీఎం చెప్పి అసెంబ్లీలో కనీసం చర్చ కూడా పెట్టలేదని కాషాయ పార్టీ విమర్శలు చేస్తోంది. రైతు భరోసా ఊసే లేదని, దీన్ని కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానాలను బీజేపీ వ్యక్తంచేస్తోంది. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు అన్నదాతలకు అండగా బీజేపీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందనే మెసేజ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కమలం పార్టీ భావిస్తోంది.


Similar News