కేసీఆర్ అవినీతికి అధికారుల వత్తాసు!.. కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ పాలనలో అవినీతికి పాల్పడిన అధికారులపై దర్యాప్తు జరిపిస్తామని కాంగ్రెస్ నేత బక్కా జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ పాలనలో అవినీతికి పాల్పడిన అధికారులపై దర్యాప్తు జరిపిస్తామని కాంగ్రెస్ నేత బక్కా జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ కుటుంబంతో పాటు కొంత మంది అధికారుల ప్రమేయం ఉందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని 3 ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి జరిగిన అవినీతిపై తాను సీబీఐకి ఫిర్యాదు చేశానన్నారు. కాంట్రాక్టర్లు, సహకరించిన అధికారులందరిపై ఈ ఫిర్యాదు చేశానన్నారు. తాను ఈ నెల 5వ తేదీనే సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయంపై సీబీఐ సీరియస్ గా పని చేస్తోందని రాష్ట్ర ప్రజల దృష్టికి ఈ విషయాన్ని తాను తీసుకువస్తున్నట్లు మంగళవారం బక్క జడ్సన్ ట్వీట్ చేశారు.
కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను అప్పుల పాలు చేసిందన్నారు. ప్రభుత్వ పెద్దల అవినీతి వెనుక అధికారుల పాత్రకు సంబంధించి ఆధారాలతో సహా తాను సీబీఐకి ఫిర్యాదు చేశానని తానిచ్చిన అధారాలను చూసి అధికారులే విస్తుపోయారని చెప్పారు. బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకోవడంలో బీజేపీ విఫలమైందని ధ్వజమెత్తారు. తన వద్ద ఇంకా 7 డిపార్ట్ మెంట్ల అవినీతికి సంబంధించిన వివరాలు ఉన్నాయని రోజుకో డిపార్ట్మెంట్ గురించి బయటకు తీసుకువస్తానన్నారు. ఈ ఆధారాలన్ని ఓ పెద్ద ఆఫీసర్ తనకు అందజేసినట్లు తెలిపారు.