బీఆర్ఎస్‌కు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న టీ సర్కార్..!

Update: 2024-10-06 02:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ నగర శివారులో ఔటర్‌ రింగ్ రోడ్డుకు అవతలివైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణ సంబంధిత పనులు వేగంగా సాగుతున్నాయి. అయితే, ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు సరైన రీతిలో కౌంటర్ ఇవ్వకలేకపోతున్నామనే అంచనాలో రాష్ట్ర సర్కారు ఉన్నది. కనీసంగా స్పష్టమైన సమాధానం చెప్పడంలోనూ వెనకబడ్డామని అభిప్రాయపడుతున్నది. అసలు ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నాం? అందుకు గల కారణాలేంటనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం అన్వేషిస్తున్నది. ఇటీవల ఆర్ అండ్ బీ ఆఫీసర్లకు రీజినల్ రింగు రోడ్డుకు సంబంధించిన డీటెయిల్డ్ డ్రాఫ్టుతో కూడిన పాయింట్స్ తయారుచేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్టు తెలిసింది.

కౌంటర్ అటాక్‌కు ప్రణాళికలు

రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులు రీజినల్ రింగు రోడ్డు మీద సమగ్రంగా నోట్ తయారుచేసిన తర్వాత పార్టీ లీడర్లతో కౌంటర్ అటాక్ చేయించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. ఈ డ్రాఫ్టు తయారైన తర్వాత రీజినల్ రింగు రోడ్డు వెళ్తున్న జిల్లాల నాయకులకు ఇవ్వాలని సర్కారు భావిస్తున్నది. వారికి, గాంధీ భవన్ నేతలకు ఈ సబ్జెక్టుపై అవగాహన కల్పించి.. బీఆర్ఎస్ నేతల విమర్శలకు గట్టి కౌంటర్ ఇప్పించాలని యోచన చేస్తున్నది. దీంతో ట్రిపుల్ ఆర్ మీద వ్యతిరేకత తగ్గే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నది. ఆర్ఆర్ఆర్‌పై డ్రాఫ్ట్ రూపకల్పన ప్రక్రియ కూడా దాదాపు పూర్తయిందని తెలిసింది. దీనిని తొందర్లోనే ప్రభుత్వం పార్టీ నేతలు, ఆయా జిల్లాల నేతలకు పంపించే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది.

ట్రిపుల్ ఆర్ సౌత్‌పైనే సమరం

రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టులో ప్రధానంగా ప్రభుత్వం, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్యన సౌత్ పార్ట్ మీదనే సమరం సాగుతున్నది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్ఏఐ) ప్రణాళిక ప్రకారం సౌత్ పార్ట్ రింగ్ రోడ్డు విస్తీర్ణం 189.25 కి.మీ.గా నిర్ధారించింది. రాష్ట్ర సర్కారు తాజా ప్రతిపాదన ప్రకారం దాని విస్తీర్ణం 194 కి.మీ.కు పెరిగిందని బీఆర్ఎస్ లీడర్లు విమర్శిస్తున్నారు. మాజీ మంత్రి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి దీనిపై తీవ్ర ఆరోపణలు లేవనెత్తుతుండగా, వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం సరైన రీతిలో కౌంటర్ ఇవ్వలేకపోతున్నది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం (సంగారెడ్డి-తూప్రాన్-చౌటుప్పల్) విస్తీర్ణం 158.2 కి.మీ.కాగా, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూపొందించిన అలైన్‌మెంట్ ప్రకారం 194 కి.మీ. వరకు పెరిగింది.

సీఎం రేవంత్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లాను కూడా కలుపుతూ దక్షిణ భాగం అలైన్‌మెంట్ రూపొందించారని బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నది. ఆ పెంపు రాజకీయ ప్రభావితమని ఆరోపిస్తున్నది. అయితే, అది అధికారులు సూచించినదేనన్న విషయం చెప్పాలని సర్కారు భావిస్తున్నది. అందుకు సంబంధించిన సాంకేతిక అంశాలను వెతికే పనిలో ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నది. రీజినల్ రింగు రోడ్డు నిర్మాణ పరిధిలోకి మరిన్ని ప్రాంతాలు, వాటికి సంబంధించిన గ్రామాలు కలపవడం వల్ల తాజా అలైన్‌మెంట్‌లో దాని కన్‌స్ట్రక్షన్ ఏరియా పెరిగినట్టు వెల్లడిస్తున్నది. సౌత్ పార్ట్‌కు ఫీల్డ్ సర్వే కూడా పూర్తయినట్టు చెబుతున్నది. ఇందుకు సంబంధించిన స్పష్టమైన సమాచారంతోనే ముందుకెళ్లాలని సర్కారు భావిస్తున్నది.


Similar News