రైతుల చేతిలోనే కాంగ్రెస్ కౌంట్ డౌన్ స్టార్ట్.. కేటీఆర్ ఫైరింగ్ ట్వీట్
కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
దిశ, వెబ్డెస్క్: కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వరిపంటకు 500 బోనస్ అని ప్రకటించి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతారా అని ప్రశ్నించారు. ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా అని సీరియస్ అయ్యారు. ఇది ప్రజాపాలన కాదని రైతు వ్యతిరేక పాలన అని దుయ్యబట్టారు. నిన్నటిదాకా సాగు నీరు ఇవ్వక సావగొట్టారని.. కరెంట్ కోతలతో పంటను ఎండగొట్టారని.. కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాల పాలు చేసి ఆగం చేశారని మండిపడ్డారు. ప్రతి ఏటా రైతుల, కౌలు రైతులకు రూ.15 వేలు రైతు భరోసా అని హామీ ఇచ్చి ఇవ్వలేదన్నారు. వ్యవసాయ కూలీలకు రూ.12వేలు రైతు భరోసా అన్నారు ఇవ్వలేదని తెలిపారు.
ప్రతి రైతుకు డిసెంబర్ 9నే రెండు లక్షల రుణమాఫీ అని చేయలేదని, నేడు బోనస్ విషయంలో కూడా ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల నాడు ఒకమాట.. నాట్లనాడు మరో మాట చెప్పడమే కాంగ్రెస్ నైజమని.. అసెంబ్లీ ఎన్నికల్లో గాలి మాటలతో కాంగ్రెస్ గారడీ చేసిందని సీరియస్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే నాలుగు కోట్ల ప్రజల సాక్షిగా తన నిజస్వరూపాన్ని కాంగ్రెస్ బయటపెట్టిందన్నారు. ఎద్దేడ్సిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం నిలబడదన్నారు. నమ్మి ఓటేసినందుకు.. రైతుల గొంతు కోసిన కాంగ్రెస్ సర్కారును అన్నదాతలు ఇక వదిలిపెట్టరన్నారు. పల్లెపల్లెనా ప్రశ్నిస్తారు.. తెలంగాణ వ్యాప్తంగా నిలదీస్తారు.. కపట కాంగ్రెస్ పై సమర శంఖం పూర్తిస్తారని వార్నింగ్ ఇచ్చారు. నేటి నుంచి రైతన్నల చేతిలోనే కాంగ్రెస్ సర్కారుకు కౌంట్ డౌన్ షురూ అని ట్వీట్ చేశారు.