Congress: నువ్వు మాట్లాడేది నీ ఫాంహౌజ్ గురించేనా..? బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బల్మూర్ వెంకట్ కౌంటర్

సుధీర్ రెడ్డి.. నీ ఫాంహౌజ్ గురించే మాట్లాడుతున్నావా అని, పదవి కోసం పార్టీ మారిన నువ్వు.. వేదాలు వల్లిస్తున్నావా అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్నారు.

Update: 2024-09-30 13:36 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సుధీర్ రెడ్డి.. నీ ఫాంహౌజ్ గురించే మాట్లాడుతున్నావా అని, పదవి కోసం పార్టీ మారిన నువ్వు.. వేదాలు వల్లిస్తున్నావా అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్నారు. ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మూసీ బాధితుల పక్షాన మాట్లాడుతూ.. ఇంటిపైకి బుల్డోజర్ వెళ్లాలంటే ముందు నన్ను దాటాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చిన వెంకట్.. సుధీర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా.. నువ్వు అక్రమంగా కట్టిన నీ ఫామ్ హౌజ్ పైకి వెళ్లే బుల్డోజర్ గురించే మాట్లాడుతున్నావా సుధీర్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. అలాగే 2018 లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ పైన గెలిచి మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కోసం కక్కుర్తి పడి గులాబీ కండువా కప్పిన దౌర్భాగ్యపు చరిత్ర నీదని, అలాంటి నువ్వు వేదాలు వల్లిస్తున్నావా? అని మండిపడ్డారు.

మూసి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏం ఒరగబెట్టావ్? ఏనాడైనా బాధ్యతాయుతంగా నువ్వు నీ పదవిని చేపట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? అని ప్రశ్నించారు. అంతేగాక కేవలం నీ ఫామ్‌హౌస్ కాపాడుకోవడానికి ఎన్నడూ గుర్తు రాని ప్రజలను వాడుకుంటున్నావని, నీ అద్దాల మేడ కోసం పేదోడి పేరు వాడుకోవడం సిగ్గుగా లేదా అని నిలదీశారు. ఇక మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అనేది ఉజ్జ్వల భవిష్యత్తు కోసమని, దాని వల్ల ఇంటిని కోల్పోయే పేదలకు అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్రూం ఇల్లు సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నారని స్పష్టం చేశారు. అలాగే అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ నువ్వు చేసిన బండారాలన్ని త్వరలోనే బయటకు వస్తాయని, అప్పటి వరకు రెచ్చగొట్టే వైఖరి మానుకొని సంయమనంగా ఉండాలని సుధీర్ రెడ్డిని, బల్మూరి వెంకట్ హెచ్చరించారు.


Similar News