అక్కడ పీకే.. ఇక్కడ సునీల్.. టీ కాంగ్రెస్‌లో కన్‌ఫ్యూజన్ పాలిటిక్స్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. జాతీయ స్థాయిలో ప్రశాంత్ కిషోర్ వ్యవహారంపై
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. జాతీయ స్థాయిలో ప్రశాంత్ కిషోర్ వ్యవహారంపై రాష్ట్రంలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్లో ఉత్కంఠ చర్చ సాగుతోంది. అధికార టీఆర్ఎస్లో ఎలా ఉన్నా.. కాంగ్రెస్‌లో మాత్రం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు మొదలయ్యాయి. దీంతో ఆ పార్టీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కానీ అంతర్గతంగా మాత్రం వ్యూహకర్తల అంశం తెలియని ఆందోళన రేకెత్తిస్తోంది. ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్ మరోసారి సోనియాతో భేటీ అయ్యారు. మంగళవారం ప్రత్యేకంగా సమావేశమై.. దాదాపు 3 గంటలు చర్చించారు. ఇదే సమయంలో మరో వ్యూహకర్త సునీల్ కనుగోలు రాష్ట్రంలోని పరిస్థితులను అంచనా వేస్తున్నారు. సునీల్ టీం ప్రస్తుతం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వివరాలు సేకరిస్తోంది.
ఇటు నుంచి అటు
మొన్నటిదాకా టీఆర్ఎస్ వ్యూహకర్తగా నియమించుకున్నట్లు ముద్రపడిన ప్రశాంత్ కిషోర్ ఒక్కసారిగా సోనియా శిబిరంలో కనిపించారు. గతంలో వ్యూహకర్తల అంశాన్ని ఈజీగా కొట్టిపారేసే సీఎం కేసీఆర్.. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో మాత్రం పీకేను ఆకాశానికెత్తారు. ఆయన టీఆర్ఎస్కు పని చేస్తే తప్పేంటని అన్నట్లుగా మాట్లాడారు. యాంటీ బీజేపీ టీంకు పీకే వ్యూహకర్తగా వ్యవహరిస్తాడనే సంకేతాలిచ్చారు. దీంతో కేంద్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నా.. రాష్ట్రంలో మాత్రం టీఆర్ఎస్ తో ప్రశాంత్ కిషోర్‌కు ఒప్పందం కుదిరిందని టీఆర్ఎస్ వర్గాలు కూడా చెప్పుకొచ్చాయి. ఒకదశలో మూడోసారి కూడా మాదే గెలుపు అనే ధీమా కూడా మొదలైంది.
మరోవైపు ఇటీవల రాష్ట్ర నేతలతో ఢిల్లీలో సమావేశమైన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ.. సునీల్ కనుగోలును పరిచయం చేశారు. అంతేకాదు.. రాష్ట్రంలో అప్పటికే ఆయన చేసిన సర్వే నివేదికలను పార్టీ ముందుంచారు. కాంగ్రెస్ బలపడుతుందని, పార్టీ నేతలు సమన్వయంతో ఉండాలని, అంతర్గత కుమ్ములాటలు వీడితో కలిసి వస్తుందంటూ సునీల్ రిపోర్ట్‌లో సూచించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. తెలంగాణతో పాటుగా కర్ణాటకకు కూడా ఎస్కే వ్యూహకర్తగా వ్యవహరించనున్నట్లు ఏకంగా రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో కూడా కొంత ఊపు వచ్చింది.
వాస్తవానికి ప్రశాంత్ కిషోర్, సునీల్ కనుగోలు ఇద్దరూ గురుశిష్యులే. పీకే నేతృత్వంలో సునీల్ పని చేశారు. సోషల్ మీడియా వింగ్‌ను తానే నిర్వహించారు. ఆ తర్వాత వీడిపోయి సునీల్ సొంతంగా సంస్థను ఏర్పాటు చేసుకుని, పలు పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా గతంలోనూ టీఆర్ఎస్కు కూడా సునీల్ పని చేసినట్లు తెలిసిందే.
అక్కడ గురువు.. ఇక్కడ శిష్యుడు
రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉంటే.. ఆయన దగ్గర పని చేసిన శిష్యుడు సునీల్ కనుగోలు కాంగ్రెస్ పక్షాన ఒప్పందం కుదిరించుకున్నారు. దీంతో రెండు పార్టీలు కూడా వ్యూహకర్తలపై ఆశలు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో పీకే ఒక్కసారిగా కాంగ్రెస్ శిబిరంలో కనిపించడంతో దేశస్థాయిలో ఎలా ఉన్నా.. రాష్ట్రంలో మాత్రం చర్చకు దారి తీసింది. అల్రెడీ టీఆర్ఎస్కు పని చేస్తున్నట్లుగా గులాబీ బాస్ ప్రకటించిన పది రోజులకే పీకే కాంగ్రెస్‌తో మంతనాలు మొదలుపెట్టడం ఆశ్యర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికే కేంద్రంలో మూడో ఫ్రంట్ తరహాలో ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టేందుకు కేసీఆర్ రాష్ట్రాల పర్యటన చేస్తున్నారు. ఎక్కడా కూడా ఆశించిన స్థాయిలో సమాధానం రాలేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అంతేకాకుండా దేశంలో కాంగ్రెస్ లేని కూటమి సాధ్యం కాదంటూ ఆయా పార్టీల అధినేతలు ప్రకటించారు. ఇలాంటి సమయంలోనే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధినేత్రి నివాసంలో చర్చలు జరుపడం ప్రాధాన్యతగా మారింది.
ఇక, ఇప్పటికే కాంగ్రెస్ పక్షాన రెండు రాష్ట్రాలకు వ్యూహకర్తగా ఒప్పందం చేసుకున్న సునీల్ కనుగోలు రాష్ట్రంలో పరిశీలన మొదలుపెట్టారు. సునీల్ టీం వారం ముందు నుంచే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తోంది. స్థానిక పరిస్థితులపై నివేదికను సిద్ధం చేస్తోంది. వచ్చేనెల 6న రాష్ట్రానికి రాహుల్ గాంధీ రానున్న నేపథ్యంలో ఆయన పర్యటనపై గ్రౌండ్ రిపోర్ట్ సిద్ధం చేస్తోంది. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా ఎలాంటి అంశాలను ఫోకస్ చేయాలి, ఏ వర్గాన్ని టార్గెట్ చేయాలనే అంశాలపై వివరాలు సేకరిస్తోంది. రైతులు, యూత్, మహిళల సమస్యలు, నిరుద్యోగత మీద చాలా మేరకు రిపోర్ట్ సిద్ధం చేసింది. రైతు సంఘర్షణ సభ పేరిట కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో ఈ సభను నిర్వహిస్తున్నా.. ప్రధాన టార్గెట్ మాత్రం రైతులు, నిరుద్యోగ యువత, మహిళలపైనే ఫోకస్ చేస్తున్నారు. ఇదే అంశాన్ని సునీల్ టీం కూడా ఏఐసీసీకి చేరవేసింది. ప్రాథమికంగా ఒక నివేదికను సైతం పంపించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో రాష్ట్రానికి వచ్చే రాహుల్ గాంధీ ఏ అంశాలను మాట్లాడాలనే దానిపై స్క్రిప్ట్ రెడీ చేయనున్నారు.