రుణమాఫీపై రైతుల్లో కన్‌ప్యూజన్.. ఈ సారి లేనట్లే..!

బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ స్కీమ్

Update: 2023-10-24 03:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ స్కీమ్ అమలవుతుందా? లేదా? ఉంటే.. ఎంత వరకు మాఫీ పరిమితి ఉంటుంది? ఎన్ని దశల్లో అమలవుతుంది? తాజా మేనిఫెస్టోలో ఈ హామీ లేకపోవడంతో ఈ అంశంపై రైతాంగంలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. మొత్తం పది హామీలను కేసీఆర్ తాజా మేనిఫెస్టోలో ప్రకటించినా, అందులో రుణమాఫీ గురించి ప్రస్తావించపోవడం సరికొత్త సందేహాలకు తావిస్తున్నది. రైతుబంధును దశలవారీగా రూ. 16 వేలకు (ఒక్కో ఎకరానికి) పెంచుతామని హామీ ఇచ్చిన కేసీఆర్.. రుణమాఫీని మేనిఫెస్టోలో చేర్చకపోవడంతో రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాత పాలసీలన్నీ యథావిధిగా కొనసాగుతాయని మేనిఫెస్టోలో ప్రారంభంలోనే చెప్పినా, అగ్రికల్చరల్ పాలసీలో రుణమాఫీ కూడా కేసీఆర్ దృష్టిలో భాగమా?.. కాదా?.. అనేది రైతులను గందరగోళంలోకి నెట్టింది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో 2014 ఎన్నికల మేనిఫెస్టోలో రూ. లక్ష వరకు రుణమాఫీ గురించి హామీ (పేజీ-9) ఆ పార్టీ హామీ ఇచ్చింది. గత ఎన్నికల సమయంలోనూ ఇదే హామీని (6వ ప్రామిస్) కంటిన్యూ చేసింది. ఫస్ట్ టర్ములో నాలుగు విడతల్లో అమలు చేసినట్లుగానే రెండో టర్ములో కూడా సంపూర్ణం చేస్తామని అసెంబ్లీ వేదికగానే కేసీఆర్ స్పష్టం చేశారు. కానీ నాలుగున్నరేండ్లు పూర్తయ్యి ఎన్నికలకు వెళ్తున్నా ఇంకా బకాయిలు ఉండిపోయాయి.

ఈసారి రుణమాఫీపై డైలమా

గడిచిన రెండు ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోల్లో రుణమాఫీ గురించి స్పష్టమైన హామీ ఇచ్చిన కేసీఆర్.. ఈసారి అలాంటిది మేనిఫెస్టోలో రాతపూర్వకంగా, కనీసం నోటి మాటగా కూడా చెప్పకపోవడంతో రైతుల్లో సందేహాలు మొదలయ్యాయి. 2014 మేనిఫెస్టోలో హామీ ఇచ్చినా 2018 ఎన్నికల మేనిఫెస్టోలో సైతం దాన్ని చేర్చారని, ఇప్పుడు మూడోసారి మేనిఫెస్టోలో లేకపోవడంతో ఈ అనుమానం వచ్చిందనేది రైతుల నుంచి వినిపిస్తున్న మాటలు. రుణమాఫీ ఈసారి కూడా కొనసాగుతున్నట్లయితే రుణ పరిమితి ఎంత?.. ఎన్ని విడతలుగా అమలవుతుందనే ప్రశ్నలకు గులాబీ నేతల నుంచి కూడా సమాధానం రావడం లేదు. గత ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినా ఐదేండ్ల కాలంలో అది సంపూర్ణంగా అమలు కాకపోవడంతో ఈసారి ఆ హామీపైనే రైతుల్లో అయోమయం నెలకొన్నది.

రైతుబంధుతోనే సరిపెట్టే ఆలోచనా?

ప్రస్తుతం కొనసాగుతున్న అగ్రికల్చర్ పాలసీ యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్న కేసీఆర్.. మేనిఫెస్టోలో రుణమాఫీ అంశాన్ని ప్రస్తావించకపోవడం యాధృచ్ఛికంగా జరిగిన పొరపాటా?.. లేక ఉద్దేశపూర్వకంగానే రుణమాఫీ ఇవ్వకూడదనే విధానమా?.. ఈ సందేహమే రైతులకు ఇప్పుడు అన్నింటికంటే ప్రధానమైనదిగా మారింది. రైతుబంధు సాయాన్ని ఇప్పుడున్న రూ. 10 వేల నుంచి వచ్చే ఏడాది రూ. 12 వేలకు పెంచి ఐదేండ్లలో దశలవారీగా రూ. 16 వేల వరకు తీసుకెళ్తామని హామీ ఇచ్చి రుణమాఫీని అటకెక్కించారేమో అనే అనుమానం రైతుల్ని డైలమాలోకి నెట్టింది. రుణమాఫీ అంశం ఈసారి ఓటింగ్ సమయానికి నిర్ణయాత్మకంగా మారనున్నదనే అభిప్రాయం వారి నుంచి వ్యక్తమవుతున్నది. రైతుబంధుకు మాత్రమే పరిమితమై రుణమాఫీని చేయరేమోననే సందేహం వారిలో నెలకొన్నది.

ఇప్పటికే హామీ ఇచ్చిన కాంగ్రెస్

రైతులకు రూ. రెండు లక్షల వరకు ఏక కాలంలో రుణాన్ని మాఫీ చేస్తామంటూ చేస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ గతేడాది మే 6న వరంగల్‌లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో రుణమాఫీ అంశాన్ని ప్రకటించారు. రైతు రుణమాఫీతో పాటు పంట పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ. 15 వేల చొప్పున భూమి ఉన్న రైతులకు, కౌలు రైతులకు ఇస్తామని కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇదే అంశాన్ని సెప్టెంబరు 17న తుక్కుగూడలో జరిగిన బహిరంగసభలో సిక్స్ గ్యారెంటీస్ లో భాగంగా సోనియాగాంధీ ప్రకటించారు.

రుణమాఫీపైనే రైతుల ఆశలన్నీ..

రైతుబంధు సాయాన్ని అందుకుంటున్నప్పటికీ రైతులకు రుణం సమస్య కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణానికి, దానిమీద వడ్డీకి రైతుబంధు సాయాన్ని జమ చేసుకుంటుండడం రైతులకు రిలీఫ్ లేకుండా చేసింది. స్వయంగా ప్రభుత్వమే జోక్యం చేసుకుని రైతుబంధు సాయం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నందున దాన్ని పాత అప్పులు, వడ్డీకింద మినహాయించుకోవద్దని స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీకి విజ్ఞప్తి చేసింది. వరుసగా రెండున్నరేండ్ల పాటు ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో వడ్డీ పెరిగిపోయింది. ఇటీవల రుణమాఫీ నిధులు విడుదలైనా వడ్డీకి జమ చేసుకోవడంతో పెద్దగా ప్రయోజనం లేదని రైతులు వాపోయారు.

ఇప్పుడు రైతుబంధు స్కీమ్‌కు మాత్రమే పరిమితమై రుణమాఫీ ఈసారి ఉండదేమో అనే రైతుల సందేహాలను నివృత్తి చేయాల్సింది బీఆర్ఎస్ అగ్రనేతలే. స్థానిక గులాబీ లీడర్లకు రుణమాఫీ విషయమై స్పష్టత లేకపోవడంతో ప్రజలకు ఏం క్లారిటీ ఇవ్వాలనేది గందరగోళంగా మారింది.

Tags:    

Similar News