ల్యాండ్ కబ్జా వివాదం : వెంచర్‌లో ఇనామ్ భూములు మాయం

గూపన్ పల్లి, మాణిక్ భండార్ గ్రామాల మధ్య కొత్తగా ఏర్పాటు చేసిన వెంచర్‌లో మొన్న శివారు భూములు మాయమైన విషయం తెలిసిందే.

Update: 2023-03-13 13:54 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగర శివారులోని గూపన్ పల్లి, మాణిక్ భండార్ గ్రామాల మధ్య కొత్తగా ఏర్పాటు చేసిన వెంచర్‌లో మొన్న శివారు భూములు మాయమైన విషయం తెలిసిందే. తాజాగా అందులో ఉన్న ఇనామ్ భూములు సైతం గయబ్ కావడం విశేషం. ఆర్మూర్ రోడ్డులో నిజామాబాద్ ఆనుకుని ఉన్న వ్యవసాయ భూములను మొత్తానికి ఖాళీ చేసి రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఇప్పటికే రెండు గ్రామాలకు చెందిన రైతులకు సంబంధించిన భూముల్లో కబ్జాలో ఉన్న భూములపై రియల్ వెంచర్ నిర్వాహకులు కన్నేశారు. సంబంధిత భూమి తాలుకు పత్రాలలో ఉన్న భూమికి కబ్జా ఉన్న భూమికి ఖరీదు కట్టకుండానే అందులో కలిపేసుకున్న విషయం తెల్సిందే. రెండు గ్రామాలకు చెందిన రైతులు ఈ విషయంలో ఆందోళనకు దిగారు. ఆ వివాదం ఇంకా సద్దుమనుగలేదు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కలిసి చేస్తున్న వెంచర్‌లో మొన్నటి వరకు కబ్జా భూములను పొతం చేసిన నిర్వాహకులు అందులోని ఇనామ్ భూములను సైతం తెలివిగా వెంచర్‌లో కలిపేసుకున్నారు.

నిజామాబాద్ నగర శివారులోని సర్వే నంబర్ 532 నుంచి 599 వరకు 600 నుంచి 650 వరకు, 491 నుంచి 493 వరకు ఉన్న సర్వే నంబర్‌లలోని భూములలో రియల్ వెంచర్‌లు ఏర్పాటు చేశారు. అందులో గూపన్ పల్లికి చెందిన 77 సర్వే నంబర్లు, మాణిక్ భండార్‌కు చెందిన 45 సర్వే నంబర్లు ఉన్నాయి. అందులో గతంలో ఉన్న చెరువు శిఖం భూమి మాయం అయింది. పంటలు పండించడానికి ఏర్పాటు చేసిన పూలాంగ్ వాగు కాలువ సైతం కనుమరుగైంది.

తాజాగా అందులో ఇనామ్ భూములు కూడా గయబ్ అయినట్లు తెలిసింది. 4 సర్వే నంబర్లలోని 39 గుంటలు, 14 గుంటలు, 30 గుంటలు, 29 గుంటల చొప్పున భూములను కలిపేసుకున్నారు. మొత్తంగా నాలుగు ఎకరాల 7 గుంటల ఇనామ్ భూములను పట్టా భూములు మాదిరిగానే కలిపేశారు. ఇనామ్ భూములను వారసత్వంగా అనుభవించడానికి మినహా క్రయవిక్రయాలకు ఆస్కారం ఉండదు. కానీ ఇనామ్ భూములను సైతం వెంచర్‌లో కలిపేసుకుని ప్లాట్లుగా తయారు చేస్తున్న రెవెన్యూ అధికార యంత్రాంగానికి చీమకుట్టినట్లయిన లేదు.

నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వెళ్లే రహదారిని సమీపంలో వందల ఎకరాల్లో ఏర్పాటు చేసిన వెంచర్‌లో ఇప్పటికే ప్రైవేట్ వ్యవసాయ భూములు కాస్తా వెంచర్ ఏర్పాటుతో వ్యవసాయం కరువైపోయింది. వ్యవసాయ భూములుగా పంటలు పండే ప్రాంతంలో నాలా కన్వర్షన్‌తో పాటు లేఅవుట్ పర్మిషన్ ఇవ్వడం గమనార్హం. అందులో ప్రభుత్వ భూములు, నీటి పారుదల శాఖ భూములు, కాలువలు ఉన్నకనీసం పట్టించుకునే వారే లేరు. గతంలో పాలకులు కుల వృత్తులు చేసిన వారికి ఇనామ్ కింద భూములు ఇచ్చేవారు. వాటిని ఆర్డీవో ఇచ్చే ఓఆర్సీ ద్వారా విక్రయించుకునే వీలుంది.

కానీ కిద్మత్, వక్ఫ్, దేవాదాయ ఇనామ్ భూములను అనుభవించడం మినహా క్రయవిక్రయాలకు అనుమతులు ఉండవు. కానీ సంబంధిత వెంచర్‌లో కిద్మత్ ఇనామ్‌గా ఉన్న భూములను వెంచర్‌లో కలిపేసుకుని ప్లాట్లను తయారు చేసిన అధికారులు పట్టించుకునే వారే కరువయ్యారు. నాలుగు సర్వే నంబర్‌లలో కోట్ల విలువ చేసే నాలుగున్నర ఎకరాల భూమిని వెంచర్ నిర్వాహకులు కలిపేసుకుని రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నా కిమ్మనకపోవడం విశేషం. ఇలాంటి వ్యవహరంలో జిల్లా అధికార యంత్రాంగానికి అనుమతివ్వాల్సిన చోట రెండు సంవత్సరాలుగా రియల్ వెంచర్ పనులు జరుగుతున్నా పట్టించుకునే వారే లేరు. రియల్ దందాలో రెవెన్యూ అధికారుల పాత్రపై విమర్శలున్నాయి.

Tags:    

Similar News