మూసీ కార్పోరేషన్ బాధితులకు అండగా కామ్రెడ్లు

Update: 2024-09-28 12:08 GMT

దిశ, వెబ్ డెస్క్ : మూసీ ప్రక్షాళన ఆపరేషన్ తో నిర్వాసితులుగా మారుతున్న వారికి.. నది పరివాహకం వెంట నివాసాలను, వ్యాపారాలను ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న ప్రజలకు అండగా కామ్రెడ్లు పోరాటంలోకి దిగారు. ఎర్రజెండాకు రాజకీయంగా చట్టసభలలో ప్రాతినిధ్యం..అధికార పార్టీలతో మిత్రధర్మాల కంటే పేదల పక్షాన పోరాటాలే ముఖ్యమని మరోసారి చాటుకున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలోని పేదలు, మధ్యతరగతి ప్రజల ఇండ్లను, ఇతర నిర్మాణాలకు కూల్చడాన్ని ఖండిస్తూ సీపీఎం పార్టీ బాధితుల పక్షాన ఆందోళనకు దిగింది. ప్రజాభావన్ ముందు బాధితులతో కల్సి సీపీఎం పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతోే హోరెత్తించారు.

ఈ సందర్భంగా సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎండి. అబ్బాస్ మాట్లాడుతూ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో పరివాహక ప్రజల ఇండ్లపై ఆక్రమ నిర్మాణాలని రెడ్ మార్కింగ్ వేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. పేద ప్రజలు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇండ్లను కూల్చి వారికి డబుల్ బెడ్ రూం ఇస్తామనడం సరికాదన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్మెంట్ కార్పోరేషన్ పేరుతో లక్షన్నర కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తామంటున్న ప్రభుత్వం ముందుగా మూసీ నిర్వాసితులకు సహాయ, పునరావాస చర్యలు చేపట్టాకనే నది సుందరీకరణ పనులు, నిర్మాణాల తొలగింపు పనులు చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేస్తుందన్నారు. సీపీఎం పార్టీకి రాజకీయాల కంటే పేదల పక్షాన పోరాటాలే ముఖ్యమని స్పష్టం చేశారు. 


Similar News