మల్కారం చెరువు లీచెట్ శుద్ధీకరణ ఏడాదిలోపు పూర్తి చేయండి: మంత్రి కేటీఆర్

జవహర్ నగర్ డంప్ యార్డ్ నుంచి ఉత్పత్తి అయ్యే లీచెట్ కారణంగా మల్కారం చెరువు కలుషితం అవుతుందని, ఈ నేపథ్యంలో మల్కారం చెరువుతో పాటు డంప్ యార్డు చుట్టుపక్కన చెరువుల్లో ఉన్న లీచెట్ శుద్ధీకరణ ప్రక్రియను ఏడాదిలోపు పూర్తి చేయాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

Update: 2023-04-15 14:55 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్ /జవహర్ నగర్: జవహర్ నగర్ డంప్ యార్డ్ నుంచి ఉత్పత్తి అయ్యే లీచెట్ కారణంగా మల్కారం చెరువు కలుషితం అవుతుందని, ఈ నేపథ్యంలో మల్కారం చెరువుతో పాటు డంప్ యార్డు చుట్టుపక్కన చెరువుల్లో ఉన్న లీచెట్ శుద్ధీకరణ ప్రక్రియను ఏడాదిలోపు పూర్తి చేయాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. శనివారం జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ లో రూ. 251 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 2000 కేఎల్ డీ సామర్థ్యం గల లీచెట్ ప్లాంట్ ను రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, శాసన మండలి ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ లోకేష్ కుమార్, రాంకీ సంస్థ చైర్మన్, రాజ్య సభ సభ్యుడు అయోద్య రెడ్డి, కలెక్టర్ అమోయ్ కుమార్ లతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో జీవో 58 కింద మంజూరైన 3,619 మంది లబ్దిదారులకు పట్టాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. జవహర్ నగర్ లో చెత్తకుప్పను గత ప్రభుత్వాలు తమకు వారతస్వంగా ఇచ్చి వెళ్లాయన్నారు. ఈ డంపింగ్ యార్డు గత ప్రభుత్వాల శాపమని పేర్కొంటూ.. సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ సర్కారు రూ. 2 వేల కోట్లను వెచ్చిస్తుందని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా చేయొచ్చని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. 50 ఏళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయలేదని, అలాంటిది ఇప్పుడు అవకాశం ఇస్తే ఎలా చేస్తారని ప్రశ్నించారు. వాళ్లను అసలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు పరిసర ప్రాంత ప్రజలకు కాలుష్యం లేని వాతావరణం కల్పించేందుకు మల్కారం చెరువు శుద్ధి ప్లాంట్ ను త్వరలో పూర్తి చేయాలని సంస్థ ప్రతినిధులను మంత్రి ఆదేశించారు. మల్కారం చెరువు శుద్ధిని సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని మంత్రికి హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంస్థ నిర్వాహకులు కేటీఆర్ కు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జూన్ 5న పర్యావరణ దినోత్సవం మల్కారం చెరువును శుద్ధి చేయాలని, అప్పుడు మళ్లీ వచ్చి పరిశీలించడం జరుగుతుందన్నారు. మొత్తం డంపింగ్ యార్డ్ లో లీచెట్ ట్రీట్మెంట్ వచ్చే ఏడాది లోపు పూర్తి చేయాలని మంత్రి వారిని ఆదేశించారు. అంతలోపు పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించేందుకు మరోసారి వస్తానని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌ మహానగరంలో రోజుకు దాదాపు 2 వేల ఎంఎల్‌డీ ( 2వేల మిలియన్‌ లీటర్ల ) మురికినీరు ఉత్పత్తి అవుతుంది. 100 శాతం ఎస్టీపీలతో ఈ జూలై నెలఖారుకల్లా హైదరాబాద్‌ భారతదేశంలోనే మొట్టమొదటి నగరం కాబోతున్నదని అన్నారు.

చెత్త సమస్యకు చెక్..

జపాన్‌ ప్రపంచంలోనే అత్యున్నత జీవన ప్రమాణాలతో ఉండే నగరమని అక్కడ వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌ దగ్గరికి పోయినప్పడు అక్కడ పైన పార్క్‌ ఉండగా ప్లాంట్‌ ఏమో కింద ఉందన్నారు. అక్కడ ఏ మాత్రం వాసన లేదన్నారు. ఇప్పడు కాకపోయిన ఏడాదికో, 18 నెలలకో జవహర్‌నగర్‌లో, దమ్మాయిగూడలో, నాగారంగూడలో కూడా అదేవిధంగా చేస్తామని కేటీఆర్ తెలిపారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు సామర్థ్యం 3 వేల టన్నులు మాత్రమే కానీ ప్రస్తుతం 8 వేల టన్నుల చెత్త వస్తుంది.

దీంతో దుండిగల్‌ దగ్గర 1500 టన్నుల చెత్తను అక్కడికి తరలించే ప్రయత్నం చేస్తున్నామని, మరో 1500 టన్నుల చెత్తను ఇంకో ప్లేస్‌కు తరలిస్తామని తెలిపారు. జవహర్‌నగర్‌లో 15 ఎకరాల్లో వైకుంఠధామాలు, పదిహేను ఎకరాల్లో అందమైన పార్కును నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాంకీ ప్రతినిధులు గౌతమ్ రెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, జవహర్ నగర్ మేయర్, డిప్యూటీ మేయర్ మేకల కావ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News