కమ్యూనిస్టు పార్టీలో చోటా డాన్.. పోలీసులకు తలనొప్పిగా మారిన వ్యవహారం

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల అనంతరం ప్రతి నియోజకవర్గంలోనూ అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి.

Update: 2024-03-19 02:05 GMT

దిశ, ప్రతినిధి, కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల అనంతరం ప్రతి నియోజకవర్గంలోనూ అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఉన్నపలంగా పదవులు, పలుకుబడులు చేజారి కొంతమంది నాయకులు మూలకి కూర్చుంటే పట్టుమని పది ఓట్లు పడని మరికొంత మంది చోటా మోటా నాయకులకు కొమ్ములు పెరిగాయని చెప్పవచ్చు. ప్రత్యేకించి రాష్ట్రవ్యాప్తంగా పట్టుబట్టి కొట్లాడి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన ఏకైక స్థానం కొత్తగూడెం నియోజకవర్గం. రాష్ట్రవ్యాప్తంగా కేవలం కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీపీఐ పార్టీ కాంగ్రెస్ మద్దతుతో గెలిచింది. కాంగ్రెస్ మద్దతు ఉంది కదా.. కొత్తగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మి ఓటేసిన ప్రజలకు ద్వితీయ స్థాయి నాయకులు చుక్కలు చూపిస్తున్నారని చెప్పవచ్చు.

ఎమ్మెల్యేకు తలవంపులు తెచ్చేలా..

గత పాలకుల వైఖరితో అలసి సొలసిన నియోజకవర్గ ప్రజలు నిజాయితీ కలిగిన నాయకుల కోసం ఎదురుచూసి కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఒక సీటు అందుకున్న సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావును గెలిపించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా నిన్న మొన్నటి వరకు కనబడని సెకండ్ కేడర్ కొంతమంది పశుపతిలా వ్యవహరిస్తున్నారు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి గెలుపొందిన కూనంనేని సాంబశివరావు ఈ సారి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడుతూనే కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఎవరూ ఊహించినంత అభివృద్ధి చేసి చెరగని ముద్ర వేసుకోవాలని నిజాయితీగా ప్రయత్నిస్తున్న క్రమంలో సెకండ్ క్యాడర్ చేసే చికాకులు సాంబశివరావుకు తలనొప్పి తెచ్చి పెడుతున్నాయని పార్టీ వర్గాలే బాహటంగా చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు నిమురుగప్పిన నిప్పులా ఉన్న వీరు పార్టీ, ఎమ్మెల్యేకు తలవంపులు తెచ్చేలా వ్యవహరిస్తున్న తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

చుంచుపల్లి మండలంలో చోటా డాన్..

చుంచుపల్లి మండలంలో గత కొంతకాలంగా సాధారణ లీడర్‌గా వ్యవహరించిన ఈ చోట డాన్ భారీ సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని నియోజకవర్గంగా చర్చ సాగుతోంది. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం చుంచుపల్లి మండలంలో గిరిజన చట్టాలు అమలులో ఉండేసరికి రొట్టె విరిగి నీతిలో పడింది అన్న చందంగా తయారయింది ఇతగాడి పరిస్థితి. మండలంలో ఏ ఇల్లు కట్టాలన్న, కట్టిన ఇంటికి ఇంటి నెంబర్ కరెంటు రావాలన్నా అతని అనుమతి తప్పనిసరి. ఈ చోటా డాన్ ప్రసన్నం చేసుకుంటే తప్ప మండలంలో ఉన్న ప్రజలు అనుకున్న పని సిద్ధించదని జోరుగా ప్రచారం లేకపోలేదు. తాజాగా గిరిజన చట్ట పరిధిలో ఉన్న స్థలంలో అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్న క్రమంలో విషయం తెలుసుకున్న విలేకరులు అక్కడికి వెళ్లి వివరణ కోరగా, మీకు చాతనయింది చేసుకోండి భవంతులో ఒక్క ఇటుక కూడా పీకలేరు అంటూ సవాలు విసిరిన ఉద్దండుడు ఈతగాడు.

ఈ చోట డాన్ ఇంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్లో సైతం చెరగని ముద్ర వేసుకుంటున్నాడు. ఎంత తప్పు చేసినా పర్వవా లేదు తన వద్దకు వస్తే చాలట తప్పు చేసిన వారిని సైతం చంటి బిడ్డల కాపాడుతారని డాన్ దగ్గరికి వెళ్లి క్యూలు కడుతున్నారు. చుంచుపల్లి మండలంలో ఏ స్థలం కొనాలన్నా.. అమ్మాలన్నా లేదా లీగల్ గా కబ్జా చేయాలన్న ఈ చోటా డాన్ పర్మిషన్ ఒక్కటి ఉంటే సరిపోతుంది. ఎవరైనా ఎదురు తిరిగితే వారు గంటలు లెక్క పెట్టుకోవాల్సిందే అంటూ తన అనుచర గణం గర్వంగా చెప్పుకు తిరుగుతుంది.

పోలీసులకు తలనొప్పి తెప్పించేలా ఆయన వ్యవహార శైలి

ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడని చెప్పుకు తిరిగే ఆయన వ్యవహార శైలి పోలీసులకు సైతం తలనొప్పిగా మారింది. అతను చెప్పిన పని కాదంటే ఎమ్మెల్యే ఎక్కడ ఫోన్ చేసి తమపై అలుగుతాడో అన్న భయాన్ని పోలీసుల్లో క్రియేట్ చేశాడు ఈ చోటాడాన్. చుంచుపల్లి మండలంలోనే గాక కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ పంచాయతీ అయినా తన వద్దకు వస్తే ఆయన చెప్పింది పోలీసులు వినాల్సిందే. లేదంటే ఎమ్మెల్యే సీరియస్ అవుతారు అని ఇన్ డైరెక్ట్ గా దంకీలు సైతం విడుదల చేస్తున్నారు.. రోజురోజుకూ ఆయన పంచాయితీలు అరాచకాలు ఏకం దాటి అనేకమవుతున్నాయి. పొత్తులో భాగంగా కొట్లాడి సాధించుకున్న ఏకైక స్థానం కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న కూనంనేని సాంబశివరావు పార్టీ సిద్ధాంతాలకు లోబడి నమ్మి ఓటు వేసిన నియోజకవర్గం ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతుంటే.. కొంతమంది ద్వితీయ స్థాయి నాయకులు మాత్రం తమ స్వలాభాల కోసం ఎమ్మెల్యేను అడ్డుపెట్టుకొని దందాలు నడిపించడం పార్టీకి మచ్చ తేవడమే కాక నియోజకవర్గ ప్రజల మనసు విరుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News