CPI : కుల గణనలో అవసరమైన వివరాల సేకరణ.. సీపీఐ కూనంనేని సాంబశివరావు

కుల గణన ఇంటింటి (Survey) సర్వేలో భాగంగా సేకరిస్తున్న సమాచారంతో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.

Update: 2024-11-10 11:36 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కుల గణన ఇంటింటి (Survey) సర్వేలో భాగంగా సేకరిస్తున్న సమాచారంతో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ మేరకు (Kunamneni Sambasiva Rao) ఆయన ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కుల గణన సర్వే మంచిదే అయినప్పటికీ కేవలం అందుకు సంబంధించిన అంశాలకే పరిమితమవ్వాలని సూచించారు. ఇటీవల సైబర్‌ నేరాలు హెచ్చుమీరి కోట్ల రూపాయలను సైబర్‌ నేరస్థులు గల్లంతు చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కులగణన సందర్భంగా సేకరిస్తున్న సెల్‌ నెంబర్లు, బ్యాంక్‌ ఖాతాలు, ఆధార్‌ కార్డు తదితర వివరాలు సైబర్‌ నేరగాళ్ళ చేతికి చిక్కితే ఇబ్బంది అవుతున్నదన్నారు.

అలా జరగకుండా పకడ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. అవసరం లేని వివరాలను ఈ సర్వేలో సేకరిస్తున్నారని, కొన్ని చోట్ల ఏ పార్టీ అని కూడా అడుగుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. వ్యక్తిగత గోప్యత పాఠించాలని, వాటిని బహిర్గత పర్చాల్సిన అవసరం లేదని కోర్టులు చెప్పిన విషయాన్ని కూనంనేని గుర్తు చేశారు. కుల గణనలో సేకరిస్తున్న ప్రశ్నలకు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నదని, అవసరం లేని వాటిని ఉపసంహరించుకోవాలని సూచించారు. తక్షణమే ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించి స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News