CM Revanth: ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా పని పూర్తి చేయండి

రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డును ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం... ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో అక్టోబరు 2 నుంచి ఐదు రోజుల పాటు అధ్యయనం చేయనున్నది.

Update: 2024-09-30 14:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డును ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం... ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో అక్టోబరు 2 నుంచి ఐదు రోజుల పాటు అధ్యయనం చేయనున్నది. గ్రామీణ నియోజకవర్గాల్లో రెండు గ్రామాలను, పట్టణ నియోజకవర్గాల్లో రెండు వార్డులు/డివిజన్లను ఎంపిక చేసినట్లు ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు.. ఆ జాబితాను అందజేశారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా సమాచారాన్ని పకడ్బందీగా సేకరించాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మొత్తం ఐదు రోజుల్లోనే కుటుంబాల నిర్ధారణ ప్రక్రియను పూర్తిచేస్తామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని మొత్తం 238 గ్రామాలు/పట్టణాలు/వార్డులు/డివిజన్లను ఎంపిక చేసినందున అధ్యయనం, సమాచార సేకరణ పూర్తి చేసిన తర్వాత అనుకూల, ప్రతికూల అంశాలపై ప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు.

ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సచివాలయంలో సోమవారం జరిగిన సమీక్ష సందర్భంగా సంబంధిత అధికారుల నుంచి ఆచరణాత్మక అంశాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్ర‌భుత్వం దగ్గర ఇప్పటికే రేష‌న్ కార్డు, పింఛ‌న్లు, స్వ‌యం స‌హాయ‌క సంఘాలు, రైతుభ‌రోసా, రుణ‌మాఫీ, రైతుబీమా, ఆరోగ్యశ్రీ‌, కంటివెలుగు త‌దిత‌ర పథకాల లబ్ధిదారుల, కుటుంబాల డేటా ఉన్నదని సీఎంకు అధికారులు వివరించారు. కుటుంబాల‌ గుర్తింపున‌కు సంబంధించిన ప్ర‌క్రియ పూర్త‌యింద‌ని, ఇప్పుడు ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి చేపట్టనున్న పైలెట్ ప్రాజెక్టులో ఆ వివరాలను నిర్ధారించుకోవ‌డంతో పాటు కొత్త స‌భ్యులను చేర్చడం, మృతిచెందిన వారిని తొల‌గించ‌డం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కుటుంబ స‌భ్యుల వివ‌రాల న‌మోదు, మార్పులు చేర్పుల విష‌యంలో అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకోవాల‌ని అధికారుల‌కు ముఖ్య‌మంత్రి సూచించారు. ఎటువంటి పొర‌పాట్ల‌కు తావివ్వ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు.

పట్టణ ప్రాంతాల్లో జన సాంద్రత ఎక్కువగా ఉంటున్నందున వార్డులు, డివిజన్లలో కుటుంబాల నిర్ధారణ పరిశీలన జరిపే సమయంలో ఎక్కువ మంది ప్రభుత్వ సిబ్బంది అవసరం పడొచ్చని, దానికి తగినట్లుగా ప్లానింగ్ చేసుకోవాలని సంబంధిత అధికారులకు సీఎం సూచించారు. ఈ పరిశీలనలో ప్రజల నుంచి సేకరించే వివరాలను అధికారులు వివరించారు. కుటుంబ స‌భ్యులు స‌మ్మ‌తిస్తేనే ఫ్యామిలీ ఫొటో తీసుకోవాల‌ని, దాన్ని అప్ష‌న‌ల్‌గా మాత్రమే పరిగణించాలని, అభ్యంతరాలు వ్యక్తమైతే ఫొటో తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టంచేశారు. ఈ ప్రక్రియపై ఉమ్మ‌డి జిల్లాల‌ నోడ‌ల్ అధికారులు ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు మార్గ‌నిర్దేశం చేయాల‌ని, అప్పుడే ప‌క‌డ్బందీగా జరుగుతుంద‌ని ముఖ్య‌మంత్రి అభిప్రాయ‌ప‌డ్డారు. పైలెట్ ప్రాజెక్టుగా వివరాలను సేకరించే సమయంలో ఎదురయ్యే సానుకూల‌త‌, ఇబ్బందుల‌ను నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పించాలని ముఖ్య‌మంత్రి సూచించారు.

ఆ నివేదిక‌లోని అంశాలను లోతుగా చ‌ర్చించి, విశ్లేషించి, ఆ లోపాల‌ను సరిదిద్దిన తర్వాతే పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి ప‌రిశీల‌న‌ చేప‌ట్టాల్సి ఉంటుందని ముఖ్య‌మంత్రి తెలిపారు. పైలట్ ప్రాజెక్టు అనుభవాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఫైనల్ పరిశీలన జరగనున్నది. రేషన్, ఆరోగ్యం, సంక్షేమం తదితరాలన్నీ ఫ్యామిలీ హెల్త్ కార్డులో (స్మార్ట్ కార్డ్) నిక్షిప్తం కానున్నాయి. ఈ స‌మీక్ష‌లో మంత్రులు కొండా సురేఖ‌, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శేషాద్రి, ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శులు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, అజిత్ రెడ్డి, ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శులు సంగీత స‌త్య‌నారాయ‌ణ‌, మాణిక్ రాజ్‌, వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.


Similar News