తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం

ధాన్యం కొనుగోళ్లు(Grain Purchases), డీఎస్సీ అభ్యర్థుల(DSC Candidates) సర్టిఫికెట్ల పరిశీలనపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు.

Update: 2024-10-03 12:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: ధాన్యం కొనుగోళ్లు(Grain Purchases), డీఎస్సీ అభ్యర్థుల(DSC Candidates) సర్టిఫికెట్ల పరిశీలనపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం సేకరణకు రాష్ట్రవ్యాప్తంగా 7 వేల ఐకేపీ(IKP) సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. సన్న వడ్లను ప్రత్యేకంగా కొనుగోలు చేస్తామని అన్నారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. ప్రతి రోజూ కలెక్టర్లు రెండు గంటల పాటు ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష జరపాలని ఆదేశించారు. అంతేకాదు.. ధాన్యం కొనుగోళ్లపై కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. మరీ ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టొద్దని స్పష్టం చేశారు. నిత్యం అప్రమత్తంగా ఉండాలని.. రైతులను మోసం చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించారు. రైతులంతా సన్నబియ్యం పండించేలా ప్రొత్సహించాలని ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ఐకేపీ కేంద్రాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శనివారం(05-10-2024) లోపు డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి కావాలని ఆదేశించారు. అక్టోబర్ 9వ తేదీన ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు. ఈ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు.


Similar News