కవిత బెయిల్‌పై సీఎం రేవంత్ స్పందన.. కేజ్రీవాల్ ప్రస్తావన తీసుకొచ్చి షాకింగ్ కామెంట్స్

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

Update: 2024-08-28 09:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బుధవారం ఆయన సచివాలయంలో మీడియాత ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ తమ ఓటు బ్యాంకును బీజేపీకి బదిలీ చేసిందని.. ఆ కారణంగానే కవితకు ఐదు నెలల్లోనే బెయిల్ వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ చాలా ఆలస్యంగా వచ్చిందని గుర్తుచేశారు. దాదాపు ఆయన ఏడాదికి పైగా జైల్లో ఉన్నారని అన్నారు. స్వయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సైతం ఇంకా జైల్లోనే ఉన్నారని తెలిపారు.

తప్పకుండా కవితకు ఇంత త్వరగా బెయిల్ రావడం వెనుక బీజేపీ మద్దతు ఉందనే అనుమానం కలుగుతోందని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ పని చేసింది. 8 సీట్లలో బీజేపీ గెలవడానికి హరీష్ రావు పనిచేశారు. ఆ ఒప్పందం ప్రకారమే కవితకు బెయిల్ వచ్చిందని ఆరోపించారు. కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో మంగళవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఐదున్నర నెలల తర్వాత కవితకు ఉపశమనం లభించింది. మంగళవారం రాత్రే జైలు నుంచి విడుదలైన కవిత.. ఇప్పటికే తెలంగాణకు బయలుదేరారు. కాసేపట్లో ఆమె శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రానున్నారు. కవితకు స్వాగతం పలికేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు భారీగా విమానాశ్రయానికి చేరుకున్నారు.


Similar News