‘టార్గెట్ మావోయిస్ట్’.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు CM రేవంత్ స్పెషల్ రిక్వెస్ట్

మావోయిస్టు కార్యకలాపాల అణచివేతపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో పోలీసు క్యాంపుల్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నది.

Update: 2024-07-04 15:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మావోయిస్టు కార్యకలాపాల అణచివేతపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో పోలీసు క్యాంపుల్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలనే కొనసాగించాలనుకుంటున్నది. ఇందుకోసం కొన్ని జిల్లాల్లో సీఆర్పీఎఫ్ క్యాంపుల్ని, మరికొన్నిచోట్ల జాయింట్ టాస్క్ ఫోర్స్ క్యాంపుల్ని నెలకొల్పాలని భావిస్తున్నది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరింది. గతంలో తెలంగాణలోని మూడు జిల్లాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయని, వీటికి ఇకపైన కూడా ఆ స్టేటస్‌కు కొనసాగించాలని రిక్వెస్టు చేసింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రిని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర భద్రతకు సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు చేశారు. పోలీస్ ఇన్‌ఫార్మర్ వ్యవస్థ కోసం గతంలో రూపొందించిన నిబంధనల్లో కొన్ని సవరించాలని కోరారు.

తెలంగాణలో వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి గ్రామం, ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామ పరిధిలో సీఆర్ఫీఎఫ్ జేటీఎఫ్ (జాయింట్ టాస్క్ ఫోర్స్) క్యాంపులను ఏర్పాటు చేయాల‌ని కేంద్ర హోం మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ, ఛత్తీస్‌గ‌ఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల కొండ‌ల్లో ఉన్న అనుకూల‌ పరిస్థితులను ఆస‌రాగా చేసుకొని సీపీఐ మావోయిస్టు కమిటీ ఒక ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసి త‌మ విస్తర‌ణ‌కు ప్రయ‌త్నిస్తున్నద‌ని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం రేవంత్ తీసుకెళ్లారు. మావోయిస్టు ప్రత్యేక దళం కద‌లికల నియంత్రణ‌తో పాటు నిర్మూల‌న‌కు కొత్తగా ఏర్పాటు కానున్న జేటీఎఫ్ క్యాంపులు ఉపయోగపడ‌తాయ‌ని వివరించారు.

తెలంగాణకు సరిహద్దుగా ఉన్న ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మ‌హారాష్ట్రల్లో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపులను ఏర్పాటు చేసుకున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వివరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఇదే తరహా క్యాంపులను ఏర్పాటు చేయాలని కోరారు. సరిహద్దు రాష్ట్రాలతో విశాల‌మైన సరిహద్దు ఉండటంతో తెలంగాణ భద్రతపైన మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలుగా గ‌తంలో ఉండి తొల‌గించిన మూడు జిల్లాల‌ను ఎస్ఆర్ఈ కింద‌ (సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్ పెండిచర్) స్టేటస్‌ను తిరిగి కొన‌సాగించాల‌ని కోరారు.

మావోయిస్టుల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ఇన్‌ఫార్మర్ నెట్‌వర్కులో ఎస్పీవో (స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్)లో మాజీ సైనికులు, మాజీ పోలీసులను మాత్రమే చేర్చుకోవాలనే నిబంధన గతంలో ఉండేదని, కానీ తెలంగాణలోని ప్రత్యేక పరిస్థితుల్లో మావోయిస్టులకు సంబంధించిన స‌మాచారాన్ని చేర‌వేయడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. నిబంధనల ప్రకారం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సైనికులు, మాజీ పోలీసులను మాత్రమే ఎస్పీవోలుగా నియమించాల్సి ఉంటుందని, కానీ రాష్ట్రంలో అలాంటివారు అందుబాటులో లేనందున రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా 1,065 మందిని ఎస్పీవోలుగా చేర్చుకోవడానికి ఇప్పుడున్న నిబంధనలు స‌డ‌లించాలని కేంద్ర హోం మంత్రిని కోరారు.

ఎస్పీవోల‌కు చెల్లించాల్సిన నిధుల్లో కేంద్రం నుంచి విడుదల కావాల్సిన 60% వాటా నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్నద‌ని, మొత్తం రూ.18.31 కోట్లు విడుదల చేయాల‌ని కోరారు. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ఐపీఎస్ కేడర్ సమీక్ష చేయడం తప్పనిసరి అని, తెలంగాణ‌కు సంబంధించి 2016లో మొదటిసారి సమీక్ష జరిగిందని, అప్పటి నుంచి స‌మీక్ష చేయ‌నుందున వెంట‌నే కేడర్ రివ్యూ ప్రక్రియను పైనల్ చేయాలని కేంద్ర హోం మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు 61 ఐపీఎస్ పోస్టులు కేటాయించార‌ని, కొత్త రాష్ట్ర అవసరాలకు ఐపీఎస్‌ల సంఖ్య సరిపోనందున‌, తెలంగాణ‌కు అద‌నంగా మరో 29 ఐపీఎస్‌ పోస్టులను కేటాయించాల‌ని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర స్థాయి అత్యున్నత నిఘా విభాగాలైన తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (టీజీ-న్యాబ్‌), తెలంగాణ సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ-సీఎస్‌బీ) ఆధునీక‌ర‌ణ‌కు అవ‌స‌ర‌మైన నిధులను మంజూరు చేయాల‌ని కేంద్ర హోం మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సుమారు గంట‌పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య కొన‌సాగిన భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు వివిధ అంశాల‌పై చర్చ జరిగింది. డ్రగ్స్, సైబర్ నేరాల‌ నియంత్రణ‌తో పాటు అరికట్టడానికి కావాల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్జానం, ప‌రిక‌రాల‌ కొనుగోలు కోసం టీజీ-న్యాబ్‌కు రూ. 88 కోట్లు, టీజీ-సీఎస్‌బీకి రూ. 90 కోట్లు కేటాయించాల‌ని కోరారు.

పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం పెండింగ్ అంశాలపై:

పదేండ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పునర్విభజన సమస్యల పరిష్కారానికి నోడల్ ఏజెన్సీగా కేంద్ర హోంశాఖ తన సహాయ సహకారాలను అందించి చొరవ తీసుకోవాలని హోం మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. చట్టంలోని షెడ్యూల్-9 లోని ప్రభుత్వ భవనాలు, కార్పొరేషన్ల పంపిణీ, పదవ షెడ్యూల్ ప‌రిధిలోని సంస్థల వివాదాలను సామ‌ర‌స్యపూర్వకంగా ప‌రిష్కారమయ్యేలా కృషి చేయాల‌ని కోరారు. చట్టంలో ఎక్కడా ప్రస్తావించని ఆస్తులు, సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకుంటున్నందున‌, అందులో తెలంగాణ‌కు న్యాయం జ‌రిగేలా చొర‌వ చూపాల‌ని అమిత్ షాను సీఎం రేవంత్ కోరారు.


Similar News