కేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం బలైంది: రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైందని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైందని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డ సందర్శనకు పార్టీలకు అతీతంగా శాసనసభ్యులందరూ రావాలని అసెంబ్లీలో కోరారు. సందర్శనతో పాటు దీనిపైన జరుగుతున్న చర్చలో కేసీఆర్ పాల్గొనాలని డిమాండ్ చేశారు. ప్రజల కష్టార్జితాన్ని కేసీఆర్ కాళేశ్వరం రూపంలో బుగ్గిపాలు చేశారని ఆరోపించారు. రూ.97 వేల కోట్లు చేసి 97 వేల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. డిజైన్ నుంచి నిర్మాణం వరకు అన్నీ తానై కట్టానని గతంలో కేసీఆర్ చెప్పినట్లు గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి మేడిగడ్డ కుంగి నెలలు గడిచినా స్పందిచకపోవడం దారుణమని అన్నారు.
లోపాలను గుర్తించి మేడిగడ్డను మళ్లీ నిర్మించాలని నేషనల్ డ్యామ్ సెఫ్టీ అథారిటీ చెప్పిందని అన్నారు. అయినా నిర్లక్ష్యం వహించారని సీరియస్ అయ్యారు. ప్రజలకు నిజాలు చెప్పాలనే ప్రజాప్రతినిధులకు మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్నామని వెల్లడించారు. కేసీఆర్ సహా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించామని తెలిపారు. బీఆర్ఎస్ చీకటి మిత్రులైన బీజేపీ సభ్యులను కూడా ఆహ్వానించినట్లు గుర్తుచేశారు. చీకటి ఒప్పందాన్ని దాటి వారు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. మేడిగడ్డలో ఏం జరిగిందో ప్రజలకు తెలియాలన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక వచ్చిందని తెలిపారు. సందర్శన అనంతరం సాయంత్రం 5-6 గంటల మధ్య పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఆ తర్వాత సీఎం రేవంత్, మంత్రుల మీడియా సమావేశం ఉండనున్నాయి.