కేసీఆర్ నాటిన గంజాయి మొక్కలు పీకేస్తున్నా.. మీట్ ది ప్రెస్‌లో సీఎం సంచలన కామెంట్స్
వంద రోజుల్లో ప్రజా పాలన అందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం బషీర్ బాగ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
దిశ, డైనమిక్ బ్యూరో: వంద రోజుల్లో ప్రజా పాలన అందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం బషీర్ బాగ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనలో తెలంగాణ నిర్భంధానికి గురైందని ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమం పేరుతో కేసీఆర్ రాచరిక పాలన కోరుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం రాచరిక పాలన అంతమైందని, 2023 డిసెంబర్ 3న కేసీఆర్ పాలన అంతమైందని సెటైర్లు వేశారు. తమ వారసులే అధికారంలో ఉండాలని నిజాం నవాబు కోరుకున్నారని, నిజాం లాగే కేసీఆర్ కూడా రాచరికాన్ని తేవాలని చేశారని తెలిపారు. వారసత్వాన్ని తలపై రుద్దాలని చూసినప్పుడు తెలంగాణ సమాజం ఏకమైందని పేర్కొన్నారు. ప్రజలు నిరసనలు తెలియజేయకుండా కేసీఆర్ వ్యవహరించారని, తన ఆలోచనలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేశారని విమర్శించారు. దీంతో ప్రజలు స్వేచ్ఛ కోరుకుని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని తెలిపారు.
తెలంగాణ సంస్కృతిపై దాడి
తెలంగాణ కవులు, కళాకారులు గడిల్లో నిర్భంధానికి గురైనారని, తెలంగాణ సంస్కృతిపై దాడి జరిగిందని, వాటన్నింటినీ సరిచేసి ప్రజాస్వామిక స్ఫూర్తితో ముందుకెళ్లామన్నారు. తెలంగాణ ఆకాంక్షలను గుర్తుపెట్టుకున్న ప్రభుత్వం టీఎస్ నుంచి టీజీగా మార్చామని తెలిపారు. జయ జయహే తెలంగాణ గానం నిషేదానికి లోనైతే.. రాష్ట్ర గీతంగా చేశామన్నారు. తెలంగాణ తల్లి విషయం, అధికార చిహ్నాం లో కవులు, కళాకారులను సంప్రదించి మార్పులు చేశామని తెలిపారు.
కేసీఆర్ గంజాయి మొక్కలు..
కేసీఆర్ ఆనవాళ్లు ఇంకా ఉన్నాయని, కొన్ని కేసీఆర్ గంజాయి మొక్కలు ఇంకా వాసనలు వెదజల్లుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికే కొన్ని గంజాయి మొక్కలు పీకాను.. ఇంకా పీకాల్సినవి ఉన్నాయి.. రోజుకు 18 గంటల పని చేస్తా.. గంజాయి మొక్క అనేది లేకుండా చేస్తానని తేల్చిచెప్పారు. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నిన్న తమకు నోటీసులు ఇచ్చిందన్నారు. ముందుగా డబ్బులు కట్టాకే జీరో విద్యుత్ బిల్లు ఇవ్వాలని నోటీసు ఇచ్చిందన్నారు. ముందుగా సబ్సిడీ చెల్లించాకే జీరో బిల్లు ఇవ్వాలని చెబుతున్నారన్నారు. ఆ మేధావికి చెప్పదలచుకున్నది ఏమిటంటే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినప్పుడు ఈ ఆదేశం ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. నీ ఇంటి పేరు తన్నీరు ఉన్నంత మాత్రాన నువ్వు పన్నీరు కాలేదు.. ఈ తెలివితేటలు మానాలని చెబుతున్నానని మండిపడ్డారు. తన్నీరు గారు.. గుర్తు పెట్టుకోండి.. నువ్వు కూడా ఆ కుర్చీలో ఎక్కువ సేపు ఉండవని హెచ్చరించారు.
మేం పాలకులం కాదు.. సేవకులం
పరిపాలనకు సంబంధించి గత ప్రభుత్వంలో నిషేధిత ప్రాంతాలైనా ప్రగతి భవన్, సచివాలయం లోకి ప్రజలు స్వేచ్ఛగా రావాలని ప్రగతి భవన్ ముందు ఉన్న ముళ్ల కంచెను బద్దలు కొట్టించి ప్రజలకు ప్రవేశం కల్పించమని తెలిపారు. నేడు జ్యోతి రావు పూలే ప్రజా భవన్ ప్రజలకు ఓ వేదిక అయ్యింది. మీడియాకు, ప్రజలకు సచివాలయంలో అనుమతి కల్పించామని తెలిపారు. మేం పాలకులం కాదు.. సేవకులం అని నిరూపించడానికి విజ్ఞప్తులు వినే వేదిక కల్పిస్తున్నామని, ప్రజల సమస్యల పరిష్కారం చేస్తున్నామని తెలిపారు.
సంక్షేమానికి సంబంధించి దివంగత నేత వైఎస్ఆర్ నిర్ణయాలను కొనసాగిస్తూనే కొత్తగా ఆరు గ్యారెంటీలు తీసుకోచ్చామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించామని గుర్తుచేశారు. వంద రోజుల్లో దాదాపు 26 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. వైద్యం విషయంలో రూ.10 లక్షల రూపాయాలతో ఉచిత కార్పొరేట్ వైద్యం, ఇతర అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు.
కేంద్రంతో వివాదాలు కోరుకోవడం లేదు
తాము అధికారంలోకి వచ్చినప్పటికి ఏడాదికి చెల్లించాల్సిన అప్పు రూ. 64 వేల కోట్లు అని తెలిపారు. కేంద్రంతో చిల్లర తగాదాలకు పోకుండా ముందుకెళ్తున్నామన్నారు. గవర్నర్ వ్యవస్థతో కూడా వివాదాలు కోరుకోవడం లేదన్నారు.