CM Revanth Reddy: టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ: సీఎం రేవంత్ రెడ్డి

‘స్పీడ్‌’ ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

Update: 2024-08-30 09:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ తేవాలని, దీనికి గాను ఇతర రాష్ట్రాల్లోని బెస్ట్‌ పాలసీలను అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అవసరమైన చోట పీపీపీ విధానం అవలంబించాలని సూచించారు. హైదరాబాద్‌ బయట మరో జూపార్క్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, కార్యక్రమాలను వేగవంతం చేయడానికి స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ(స్పీడ్) 19 ప్రాజెక్టులపై రూపొందించిన కార్యాచరణపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఇవాళ రాష్ట్ర సచివాలయంలో ‘స్పీడ్’ ప్రాజెక్టులో భాగమైన అంశాలపై అధికారులతో చర్చించారు. సమావేశానికి సీఎస్ శాంతికుమారితోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ రమేశ్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై సీఎం ఈ సందర్భంగా వారితో చర్చించారు.

సీఎంకు ‘వేములవాడ’ అర్చకుల ఆశీర్వచనం..

వేములవాడ రాజన్న ఆలయ విస్తరణకు బడ్జెట్‌లో రూ. 50 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అర్చకలు సీఎంకు ఆశీర్వచనం అందించారు. ఆలయ విస్తరణ ప్రణాళికలు, నమూనాపై శృంగేరి పీఠం అనుమతి తీసుకోవలసి ఉందని వివరించగా, వెంటనే అనుమతి తీసుకుని అందుకు సంబంధించిన పనులను చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు. భేటీలో వేములవాడ రాజన్న ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేశ్, డీఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేశ్ శర్మ తదితరులు ఉన్నారు.


Similar News