RS ప్రవీణ్‌కుమార్‌కు CM రేవంత్ రెడ్డి రిప్లై
బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు సీఎం రేవంత్ స్వీట్ రిప్లై ఇచ్చారు. ఒక విద్యాధికులుగా, పొలిటీషియన్‌గా ఆర్ఎస్పీ చేసిన సూచనలు, సలహాలను ప్రభుత్వం స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని, ప్రజా ప్రభుత్వం ఇలాంటి వాటినే కోరుకుంటున్నదని పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు సీఎం రేవంత్ స్వీట్ రిప్లై ఇచ్చారు. ఒక విద్యాధికులుగా, పొలిటీషియన్‌గా ఆర్ఎస్పీ చేసిన సూచనలు, సలహాలను ప్రభుత్వం స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని, ప్రజా ప్రభుత్వం ఇలాంటి వాటినే కోరుకుంటున్నదని పేర్కొన్నారు. తెలంగాణ యువతకు సంబంధించిన సమస్యను ప్రజాప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ప్రయత్నానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం.. ఈ సూచనలను నిశితంగా పరిశీలించి, సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తామని స్పష్టం చేశారు. గురుకుల టీచర్ల రిక్రూట్‌మెంట్ అంశానికి సంబంధించి ఆర్ఎస్పీ ఇటీవల ట్వీట్‌లో సీఎంకు చేసిన సలహాలకు శనివారం రిప్లై ఇచ్చారు.
గడిచిన పదేళ్లలో తెలంగాణ యువత ఎంత దగాపడిందో, వారి భవిష్యత్తు మీద గత ప్రభుత్వం ఏ విధంగా కోలుకోలేని దెబ్బ తీసిందో మనందరం చూసామంటూ ఆర్ఎస్పీకి ఇచ్చిన ట్వీట్‌లో సీఎం రేవంత్ ఉదహరించారు. ఆ దశాబ్ద కాల విషాదాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, మన తెలంగాణ యువత భవితను పునర్నిర్మించాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్విరామంగా పని చేస్తున్నదన్నారు. గురుకుల టీచర్ల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి లేవనెత్తిన విషయాలను సంబంధిత అధికారులకు పంపి కచ్చితంగా గమనంలోకి తీసుకుని నిరుద్యోగ అభ్యర్థులు ఇబ్బందుల్లో పడకుండా, గందరగోళానికి తావు ఇవ్వకుండా చేపట్టేలా ఆదేశిస్తామని సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు.
పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా తెలంగాణ పునర్నిర్మాణానికై ఎవరు కలిసొచ్చినా వారి విలువైన సూచనలను, సహకారాన్ని తీసుకోవడానికి, వారితో కలిసి పనిచేయడానికి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని నొక్కిచెప్పారు. కాంగ్రెస్ ప్రయత్నమూ, తాపత్రయమూ అంతా తెలంగాణ ప్రజల మంచి కోసమేనని, మెపు కోసమో లేక గుర్తింపు కోసమో కాదని సవినయంగా మనవి చేస్తున్నానని వివరించారు. మున్ముందు కూడా ప్రజా సమస్యలేమైనా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అంటూ ఆర్ఎస్పీకి స్పష్టత ఇచ్చారు.