ప్రతిపక్షాలకు కౌంటర్ ప్లాన్.. ప్రజా భవన్ లో మొదలైన పీసీసీ కార్యవర్గ భేటీ

అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళిక రచిస్తున్నది.

Update: 2024-07-17 10:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రైతు రుణమాఫీపై జనంలోకి వెళ్లాలని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ ప్రజా‌భవన్‌లో సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన పీసీసీ కార్యవర్గం భేటీ అయింది. సమావేశానికి మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, పార్టీ సీనియర్ నేతలు అటెండ్ అయ్యారు. రేపు సాయంత్రం రైతుల ఖాతాల్లో లక్ష వరకు రుణమాఫీ నగదు జమ చేయబోతున్నందున రుణమాఫీ సంబురాలపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. తొలిసారి ప్రభుత్వం, పార్టీ సమన్వయంపై పార్టీ నేతలతో సీఎం సమావేశం అయిన నేపథ్యంలో ఎలాంటి సూచనలు చేయనున్నారు అనేది ఆసక్తిగా మారింది.

ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చేలా ప్లాన్..

ప్రభుత్వ నిర్ణయాలపై ప్రతిపక్షాలు చేస్తున్న దాడిని పార్టీ నుంచి సరైన రీతిలో తిప్పికొట్టడం లేదనే వాదన వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలకు సమర్థవంతంగా కౌంటర్ ఇచ్చేలా ముఖ్యమంత్రి నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తున్నది. అలాగే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీపై నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల సంఖ్య మెరుగుపడినా ఆశించిన సీట్లు దక్కకపోవడంపై పార్టీలో చర్చ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేలా ప్రణాళికలు రచిస్తున్నది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

నిరుద్యోగుల ఇష్యూపైనా..

ఉద్యోగాల భర్తీ విషయంలోనూ ఎన్నికల్లో పార్టీ కీలక హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలో 30 వేల పోస్టులకు నియామకపత్రాలు అందజేసింది. ఆ తర్వాత నోటిఫికేషన్‌లు ఇచ్చి పరీక్షలకు ముందుకు వెళ్తున్న క్రమంలో నిరుద్యోగుల నుంచి కొంత అసంతృప్తి వ్యక్తం అవుతున్నతది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు భరోసా కల్పించేలా వారిని సముదాయించే విషయంలో పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Similar News