బడ్జెట్ వేళ బీజేపీని ఇరుకున పెట్టేలా సీఎం రేవంత్ భారీ స్కెచ్
2024-2025 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకుండా మోడీ సర్కార్ తీవ్ర అన్యాయం చేసిందని సీఎం
దిశ, వెబ్‌డెస్క్: 2024-2025 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకుండా మోడీ సర్కార్ తీవ్ర అన్యాయం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. బడ్జెట్‌లో తెలంగాణపై కేంద్రం చూపెట్టిన వివక్షకు నిరసనగా రాష్ట్ర అసెంబ్లీలో రేపు (బుధవారం) తీర్మానం ప్రవేశపెడతామని తెలిపారు. సభ ఆమోదం తర్వాత ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వ నిరసనను ప్రధాని మోడీకి తెలియజేసేందుకే ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇందుకు బీజేపీ, ఎంఐఎం సభ్యులు కలిసి వచ్చే తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత వైఖరి పట్ల నిరసనలు చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ పట్ల కేంద్రానికి వివక్ష అనుకున్నామని.. కానీ మోడీ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు.
తెలంగాణ పట్ల మోడీ చూపించే వివక్ష మంచిది కాదని.. గతంలో ఇలాంటి వివక్ష వలనే ఉద్యమాలు జరిగాయని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల ఇలాగే కక్షపూరితంగా వ్యవహరిస్తే భవిష్యత్‌లో మరోసారి ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. బడ్జెట్‌లో తెలంగాణ అనే పదాన్నే నిషేదించారని.. తెలంగాణ అనే పదాన్ని పలకడానికే కేంద్రం ఇష్టపడట్లేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదటి నుండి రాష్ట్రం పట్ల మోడీ కక్ష చూపిస్తున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఐటీఐఆఱ్ కారిడార్ చేపట్టాలని విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదని నిప్పులు చెరిగారు. వికసిత్ భారత్‌లో తెలంగాణ భాగం కాదని ప్రధాని మోడీ అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం మరోసారి బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేసిందని అసెంబ్లీలోనే తీర్మానం ప్రవేశపెట్టి కాషాయ పార్టీని ఇరుకున పెట్టేలా రేవంత్ వేసిన మాస్టర్ స్కెచ్ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.