సీఎం రేవంత్ రెడ్డి వరుస రివ్యూలు.. ఆఫీసర్లలో హైటెన్షన్!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస మీటింగులు నిర్వహిస్తుండడంతో ఆఫీసర్లకు గుబులు పట్టు కుంది.

Update: 2024-07-13 01:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస మీటింగులు నిర్వహిస్తుండడంతో ఆఫీసర్లకు గుబులు పట్టు కుంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి సీఎం నిత్యం రివ్యూలు, సమీక్షలు నిర్వహిస్తుండడంతో అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. పక్షం రోజుల క్రితమే కలెక్టర్లతో రివ్యూ నిర్వహించిన ముఖ్యమంత్రి.. ఈ నెల 16 న మరోసారి వారితో సెక్రెటేరియట్‌లో సమావేశం కాబోతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ఫీల్ట్ విజిట్ ప్రోగ్రెస్‌పై ఈ సమీక్షలో ఆరా తీయనున్నారు. రెండు రోజుల క్రితం రెవెన్యూ మొబలైజేషన్‌లో భాగంగా ఎక్సయిజ్, మైనింగ్, రిజిస్ట్రేషన్, ట్రాన్స్‌పోర్ట్, కమర్షియల్ టాక్స్ శాఖల సెక్రెటరీలతో మీటింగ్ నిర్వహించారు. అంతకంటే ముందు అన్ని శాఖల సెక్రెటరీలతో సమావేశం నిర్వహించి, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. అయితే.. గత ప్రభుత్వం కంటే భిన్నంగా సీఎం రేవంత్ రివ్యూలు, మీటింగ్స్ నిర్వహిస్తుండడంతో ఎప్పుడు ఎవరిని పిలుస్తారా అనే పరేషాన్ ఆఫీసర్లలో కనిపిస్తోంది.

ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సీఎం

సీఎం రేవంత్ రెడ్డి పనితీరులో, ఆయన నిర్వహిస్తున్న సమీక్షలు, సమావేశాల తీరుతో పాలనాపరంగా పెద్ద మార్పు కనిపిస్తున్నదని ఐఏఎస్ వర్గాల్లో టాక్ నడుస్తున్నది. మొన్నటివరకు ఆఫీసర్లు చెప్పే అంశాలను మాత్రమే వినే సీఎం.. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతున్న ది. ఈ మధ్య సెక్రెటేరియట్‌లో రెవెన్యూ మొబలైజేషన్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్‌కు హాజరైన ఐఏఎస్ అధికారు లు చెప్పిందంతా విన్న తరువాత ‘లాస్ట్ మీటింగులో చెప్పిందే ఇప్పుడు చెప్తున్నారు. కొత్త విషయాలు ఏం ఉన్నాయి? మీ శాఖలో లాస్ట్ మంత్‌కు ఇప్పటికి ప్రోగ్రెస్ ఏంటి? మీటింగుకు వచ్చే ముందు స్టడీ చేసి రావాలి’ అని సీరియస్ అయినట్టు సమాచారం. కొందరు అధికారులు అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినప్పుడు ‘నేను అడిగిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వండి’ అని సదరు అధికారులకు సూటిగా చెప్పినట్లు సమాచారం.

కమర్షియల్ టాక్స్, మైనింగ్ శాఖలపై అసంతృప్తి

కమర్షియల్ టాక్స్, మైనింగ్ శాఖల పనితీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆ రెండు శాఖలకు చెందిన హెచ్ఓడీల పనితీరు సరిగా లేదనే అభిప్రాయంలో సీఎం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ‘పన్నుల వసూళ్లలో ప్రోగ్రెస్ ఎంత ఉంది? అందుకోసం ఏం చేశారు? పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? క్షేత్ర స్థాయిలో శాఖను బలోపేతం చేసేందుకు జోనల్స్‌లో మార్పులు, చేర్చులు చేయాలని మీరు పెట్టిన ప్రపోజల్ ఏం అయ్యాయి? ఇంతవరకు ఆ ఫైల్ ఎందుకు నా వద్దకు రాలేదు? అని కమర్షియల్ టాక్స్ కమిషనర్ శ్రీదేవిని ప్రశ్నించి పనితీరు మార్చుకోవాలని సూచించినట్లు తెలిసింది. అలాగే మైనింగ్ శాఖ పనితీరుపై కూడా రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు టాక్ ఉంది. ‘లాస్ట్ ఇయర్ ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏప్రిల్‌లో మైనింగ్ ఆదాయం ఎందుకు తగ్గింది? అక్రమ ఇసుక రవాణా అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారు?’ అని మైనింగ్ శాఖ డైరెక్టర్ సుశీల్ కుమార్‌ను క్వశ్చన్ చేసినట్టు సమాచారం.

మంత్లీ ప్రోగ్రెస్ కావాల్సిందే..

గత ప్రభుత్వంలో శాఖల వారీగా రివ్యూలు నిర్వహించిన సందర్భాలు అరుదు. ఒకవేళ నిర్వహించినా ఎప్పుడో ఒకప్పుడు. కానీ.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రతీ శాఖల పనితీరుపై ప్రతీనెల ప్రోగ్రెస్ రిపోర్టు కావాలని, అది సెక్రెటరీ స్థాయి నుంచి మొదలుకుని కలెక్టర్ వరకు అందించాలని ఆదేశించినట్టు తెలిసింది. దానికితోడు అధికారులకు పూర్తి స్చేచ్ఛ ఇస్తున్నామని, పనిచేయకుండా గాలి కబుర్లు చెబితే సహించబోమనే క్లారిటీ ఇచ్చినట్టు అధికార వర్గాల్లో టాక్ ఉంది. ఈ నెల 2న జిల్లా కలెక్టర్లతో సమావేశమైన సీఎం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఫీల్డ్ విజిట్ చేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. దీనితో కలెక్టర్లు గ్రామాల్లో పర్యటిస్తూ పథకాల అమలుపై ప్రత్యేకంగా రిపోర్టు తయారు చేస్తున్నారు. ఈ రిపోర్టులపై 16న నిర్వహించే సమావేశంలో సీఎం సమీక్షించనున్నారు.


Similar News