CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవన సంకల్ప పాదయాత్ర ప్రారంభం
సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవన సంకల్ప పాదయాత్ర యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెం నుంచి ప్రారంభమైంది...
దిశ, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) మూసీ పునరుజ్జీవన సంకల్ప పాదయాత్ర(Musi Punarujjivana Sankalpa Padayatra) యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెం నుంచి ప్రారంభమైంది. సంగెం-భీమలింగం-ధర్మారెడ్డిపల్లి కెనాల్ నుంచి నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకూ ఆయన పాదయాత్ర చేయనున్నారు. సంగెంలోని మూసీ నది ఒడ్డునున్న భీమలింగంకు ఆయన పూజలు చేసి పాదయాత్ర కొనసాగించారు. సుమారు 2.5 కిలో మీటర్ల మేర కాలినడకన నడవనున్నారు. మూసీ కాలుష్యాన్ని పరిశీలించనున్నారు.సాయంత్రం నాగిరెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. సీఎం పాదయాత్రలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
కాగా మూసీ నది కాలుష్యంతో నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలతో పాటు మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రమాదం పొంచివుందని పలు పరిశోధనల్లో తేలింది. దీంతో మూసీని సుందరీకరణ చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా మూసీ కాలుష్యాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు మూసీ నది వెంట ఉన్న అక్రమ కట్టడాలపై సైతం ఉక్కుపాదం మోపాల్సి వచ్చింది. అక్రమ నిర్మాణాలను కొంత మేర తొలగించింది.
అటు పేదలకు నష్టం జరగకుండా బాధితులకు న్యాయం చేస్తోంది. వారి జీవనాన్ని దృష్టిలో పెట్టుకుని ఇతర ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాట్లు చేస్తోంది అయితే రేవంత్ రెడ్డి నిర్ణయాలపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీంతో మూసీ నది వెంట ఉండాలని, తెలిస్తే అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు అర్ధమవుతాయని విమర్శకులకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కనీసం రెండు రోజులైనా మూసీ నది వెంట ఉండాలని ఛాలెంజ్ చేశారు. అయితే రేవంత్ రెడ్డినే ఉండాలని ప్రతిపక్షాలు కౌంటర్ ఇస్తున్నాయి. దీంతో మూసీ నది వెంట పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తన పుట్టిన రోజు సందర్భంగా మూసీ నది వెంట సంగెం నుంచి నాగిరెడ్డిపల్లి వరకూ 2.5 కిలోమీటర్ల మేరకు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మూసీ నది వెంట ఆయన పాదయాత్ర చేస్తున్నారు.