రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. రైతుభరోసాపై కీలక ప్రకటన
ఆరు గ్యారంటీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ లీడర్స్ సమావేశం నిర్వహించారు.
దిశ, వెబ్‌డెస్క్: ఆరు గ్యారంటీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ లీడర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే రెండు గ్యారంటీలు అమలు చేశామని గుర్తుచేశారు. ఫిబ్రవరి రెండో వారంలో మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించారు. అంతేకాదు.. ఫిబ్రవరి నెలఖరు వరకు రైతుభరోసా ద్వారా నగదు అందిస్తామని హామీ ఇచ్చారు. పదే పదే బీఆర్ఎస్ నేతలు చేస్తున్న మేస్త్రీ కామెంట్స్‌పై రేవంత్ రెడ్డి స్పందించారు.
‘అవును నేను మేస్త్రీనే. తెలంగాణను పునర్:నిర్మించే మేస్త్రీని’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు. 18 ఏళ్లకే ఓటు, యువతకు కంప్యూటర్లు పరిచయం చేసింది రాజీవ్ గాంధీనే అన్నారు. కాంగ్రెస్ దేశం కోసం పోరాడినప్పుడు.. ఈ బీజేపీ పార్టీ ఎక్కడ ఉందన్నారు. మీ నాయకులు ఎవరైనా దేశం కోసం ప్రాణాలు ఇచ్చారా? అని సీఎం ప్రశ్నించారు. ఈ దేశం కోసం బీజేపీ చేసిన త్యాగాలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.