CM Revanth Reddy: పేదలకు మేలు జరిగితే ఓరుస్తలేరు: సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నిరుపేదలకు మేలు జరిగితే కొందరు ఓరుస్తలేరని సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: నిరుపేదలకు మేలు జరిగితే కొందరు ఓరుస్తలేరని సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గీతారెడ్డికి సద్భావనా అవార్టును ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 1990లో భారత్ సద్భావనా యాత్రను రాజీవ్ గాంధీ ప్రారంభించారని గుర్తు చేశారు. గీతారెడ్డికి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. గాంధీ కుటుంబం ఉంటే నిరుపేదలకు న్యాయం జరుగుతుందని తెలిపారు.
దేశం కోసం ఆస్తులు, సంపదను గాంధీ కుటుంబం త్యాగం చేసిందని గుర్తు చేశారు. అత్యున్నత పదవులను సైతం త్యాగం చేసిన ఘటన కేవలం ఆ కుటుంబానికే దక్కుతుందని పేర్కొన్నారు. అలాంటి రాహుల్ గాంధీ కుటుంబం గురించి మాట్లాడే కనీస అర్హత కేటీఆర్‌కు లేదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబానికి పక్కా దోపిడీ చరిత్ర ఉందన్నారు. నేడు నాలాలు, చెరువులు, ఆక్రమించుకున్న వారే ‘హైడ్రా’ను చూసి భయపడుతున్నారని ధ్వజమెత్తారు. ఇదే హైడ్రాను బూచిగా చూపి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కుదేలు చేసేందుకు కొంతమంది చూస్తున్నారని ఆరోపించారు. కావాలనే కొంతమంది నేతలు హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతిసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇక నుంచి ప్రభుత్వం అలాంటి వారి భరతం పడుతుందని హెచ్చరించారు. అజీజ్‌నగర్‌లో ఇదే హరీశ్‌రావుకు ఫాంహౌస్ లేదా అని ప్రశ్నించారు. ‘హైడ్రా’ అనగానే కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్ బయటకు వచ్చారని.. పేదలు ఎవరైనా ఫామ్ హౌస్‌లు కట్టుకోగలరా అని రేవంత్ ప్రశ్నించారు.
మూసీ మురికిలో ఉన్న పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని క్లారిటీ ఇచ్చారు. కానీ, ఆ పేదలకు మేలు జరుగుతుంటే ఓరుస్తలేరని ఫైర్ అయ్యారు. ఇప్పటికే బుల్డోజర్లను సిద్ధం చేశా.. ఎవరు అడ్డొస్తారో రండి అంటూ సీఎం సవాల్ విసిరారు. వాళ్ల ఫాంహౌస్‌లపై బోల్డోజర్లు వస్తాయనే భయంతోనే నేడు కేటీఆర్, హరీశ్‌రావు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తన ఇంటి ముందుకు వచ్చి చేతులు కట్టుకున్న రోజులను హరీశ్‌రావు మర్చిపోయినట్లున్నారని కౌంటర్ ఇచ్చారు. మూసీ పునరుజ్జీవం వేరు.. ‘హైడ్రా’ వేరు అని రేవంత్‌రెడ్డి అన్నారు.