ఇవాళే సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి సభ.. గుడ్ న్యూస్ చెప్పే ఛాన్స్!

ఇంద్రవెల్లి సభావేదిక సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం మరో రెండు గ్యారంటీలను ప్రకటించే ఛాన్స్ ఉన్నది.

Update: 2024-02-02 02:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంద్రవెల్లి సభావేదిక సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం మరో రెండు గ్యారంటీలను ప్రకటించే ఛాన్స్ ఉన్నది. రూ.500 కే వంట గ్యాస్, 200 యూనిట్ల ప్రీ కరెంట్ లను అమలుపై వెల్లడించనున్నారు. మహాలక్ష్మీ గ్యారంటీలో మూడు అంశాల్లో ఒకటైన రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ను, గృహజ్యోతిలోని ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ను అందజేస్తామని సీఎం అధికారికంగా చెప్పే అవకాశం ఉన్నది. ఇప్పటికే సర్కార్ ఆదేశాలతో సివిల్ సప్లై శాఖ, విద్యుత్ శాఖలు ఈ రెండు హామీల అమలుకు ప్రణాళికలు తయారు చేసినట్లు తెలిసింది. బడ్జెట్ సమకూర్పును కూడా ఫైనల్ చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో మరో రెండు గ్యారంటీలను ప్రకటిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

వీటిని నేడు సీఎం హోదాలో అధికారికంగా ప్రజల ముందు అనౌన్స్ చేయనున్నట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది. ఇంద్రవెల్లి సెంటిమెంట్ తో నే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోన్నది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటికిపైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు తెలుస్తోన్నది. వీటిలో అర్హులను ఎంపిక చేసి స్కీమ్ లను అందజేయనున్నారు. దీంతో పాటు ప్రత్యేక సాప్ట్ వేర్, మానిటరింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి 200 యూనిట్లు ఉచిత పవర్ ను ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నది. తద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి మరింత మద్ధతు లభిస్తుందనేది సీఎం ఆలోచన అని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇందిరమ్మ ఇళ్లు పై కూడా ఆలోచన...?

గత ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ స్కీమ్ అంటూ గొప్పలు చెప్పినప్పటికీ, ఇళ్ల స్కీమ్ సమర్ధవంతంగా అమలు కాలేదు. దీంతో పదేళ్ల పాలనలో పేదలకు ఇళ్లు అందలేదు. కేవలం మొక్కుబడిగా కొన్ని ఇళ్లు అందజేసి బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసింది. ఇప్పటికీ చాలా ఇళ్లు నిర్మాణ దశలోనే పెండింగ్ పడ్డాయి. దీంతో పేద వర్గాల నుంచి గత ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ లోనే లక్ష ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అమలు కాలేదు. గతంలో ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా నే బీఆర్ఎస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్న అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఔటర్ రిండ్ రోడ్డు పరిధిలోని కొన్ని ఇళ్లు చూపించి, ఛాలెంజ్ పూర్తి కాకుండానే వెనకడుగు వేశారు. ఇది గతంలో పెద్ద ఇష్యూ అయింది. ప్రజలందరికీ ఇక్కడ్నుంచే వ్యతిరేకత రావడం మొదలైంది. దీంతో అలాంటి తప్పిదాలు చేయకుండా ప్రజల మద్ధతు పొందాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. గ్యాస్, ఉచిత విద్యుత్ లతో పాటు పరిస్థితిని బట్టి ఇందిరమ్మ ఇళ్లను ఇంప్లిమెంట్ చేసే ఆలోచన కూడా ఉన్నదని ఓ అధికారి తెలిపారు.

ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో లో కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మీ, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయుత పేరిట ఆరు గ్యారంటీలను ప్రకటించింది. డిసెంబరు 7 న అధికార బాధ్యతలు స్వీకరించిన కాంగ్రెస్ ..ఆ నెల 9న మహాలక్ష్మీలోని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, చేయూత గ్యారంటీలోని రూ. 10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ భీమాను ప్రారంభించగా, ఇప్పుడు మరో రెండు స్కీమ్ లను ప్రకటించనున్నది. మార్చి నెల పూర్తయ్యే లోపు ఆరు గ్యారంటీలను సంపూర్ణంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ముందుకు కొనసాగుతున్నది.ప్రజాపాలన లో సుమారు కోటికి పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిని ఫిల్టర్ చేసి అర్హులను ఎంపిక చేయనున్నారు. గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ రెండూ హామీలూ మహిళల పేర్ల మీదనే ఇవ్వనున్నారు. ఇందుకు తగిన విధంగా ప్రభుత్వం ప్రణాళికను తయారు చేసింది.

Tags:    

Similar News