ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. కేబినెట్ విస్తరణపై చర్చ

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు.

Update: 2024-09-12 16:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీ సంస్థాగత అంశాలపై ఇద్దరితో చర్చించారు. వీలైనంత తొందరగా కేబినెట్ విస్తరణను చేయాలని భావిస్తున్న అంశాన్ని వారికి వివరించి ఎవరెవరికి చోటు కల్పించనున్నదీ చర్చించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆరుగురిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునే అంశాన్ని వివరించి గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను గుర్తుచేసినట్లు తెలిసింది. పీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్ గౌడ్ ఖరారు కావడంతో దానికి కొనసాగింపుగా కేబినెట్‌లో చోటు కల్పించేందుకు జిల్లాలు, సామాజికవర్గాల ఈక్వేషన్స్ పై అభిప్రాయాన్ని పంచుకున్నట్లు తెలిసింది.

గత సమావేశాల్లో ఆశావహులతో పాటు పీసీసీ, మంత్రులు, సీనియర్ లీడర్ల అభిప్రాయాలకు అనుగుణంగా కేబినెట్‌లోకి ఎంపిక చేసుకునేవారి వివరాలను ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో చర్చించినట్లు తెలిసింది. కొన్ని కీలకమైన కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టుల్ని సైతం భర్తీ చేయాల్సి ఉన్నందున కేబినెట్‌లోకి రావాలని కోరుకున్నా స్థానం దక్కనివారికి ఈ పదవులతో సంతృప్తిపర్చే అంశాలను వెల్లడించినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశమై రాష్ట్రానికి వరద సాయాన్ని అందించే విషయాన్ని చర్చించనున్నట్లు వార్తలు వచ్చినా ఆశించినట్లుగా అవి సాకారం కాలేదు. పీసీసీ చీఫ్‌గా ఇటీవల నియమితులైన మహేశ్‌కుమార్ గౌడ్ సైతం ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్ నుంచి బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్.. గురువారం రాత్రికి రిటన్ అయ్యారు.


Similar News