CM Revanth: కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సీఎం రేవంత్.. వర్షాలపై ఉన్నత స్థాయి సమీక్ష షురూ

రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తం అవుతోంది.

Update: 2024-09-02 05:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తం అవుతోంది. పలు జిల్లాల్లో వాగులు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిస్థితి దైన్యంగా మారింది. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి కొద్దిసేపటి క్రితం కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకున్నారు. ఈ మేరకు ఆయన జిల్లాల్లో వరదల ప్రభావం, కొనసాగుతోన్న సహాయక చర్యలు, వరద ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన పనులపై అధికారులతో మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో మంత్రుల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ జితేందర్, తదితరులు పాల్గొన్నారు. మరికాసేపట్లోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం బయలుదేరనున్నారు. అనంతరం అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు.  

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఊహించనంత వర్షపాతం నమోదైంది. చెరువులు, వాగులు ఉధృతంగా పొంగిపొర్లడంతో ఆ వరదల్లో చిక్కుకుని ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రాత్రి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలను ఎప్పటికప్పుడు వివరాలు అడిగా తెలుసుకుంటున్నారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని అధికారులను ఆయన ఆదేశించారు. కుంభవృష్టితో పంటలు నీట మునగడంతో వాటిపై ఫోకస్ పెట్టాలంటూ వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆయా జిల్లాల నుంచి సమాచారం కోసం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి టోల్ ఫ్రీ నంబర్ 040 - 23454088 ఏర్పాటు చేయించారు. ఎవరికైనా అత్యవసర సాయం కావాలంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.


Similar News