CM KCR స్పీచ్‌లో తగ్గిన జోష్.. పార్టీ శ్రేణుల్లో నిరాశ!

ఈ మధ్య సీఎం కేసీఆర్ స్పీచ్‌లో దూకుడు తగ్గిందా? ఆయన మాటల్లో ఫైర్ కనపించడం లేదా? జోష్ లేకుండా సప్పగా ఉంటున్నాయా? ఆయన మాటలకు చప్పట్ల జోరు తగ్గిందా?

Update: 2022-12-08 01:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ మధ్య సీఎం కేసీఆర్ స్పీచ్‌లో దూకుడు తగ్గిందా? ఆయన మాటల్లో ఫైర్ కనపించడం లేదా? జోష్ లేకుండా సప్పగా ఉంటున్నాయా? ఆయన మాటలకు చప్పట్ల జోరు తగ్గిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం పార్టీ వర్గాల నుంచి వస్తుంది. ఏమైందో ఏమోగాని కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడే తీరు గతంలో కన్నా భిన్నంగా మాత్రం ఉంటున్నాయని అంటున్నారు. ఆయన పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడుతున్నారంటే ప్రజల్లో ఒక రకమైన ఆసక్తి, ఉత్కంఠ ఉండేది. ఆయన ప్రసంగంలో వాడే పదాలు, చెప్పే చలోక్తులు, విసిరే పంచ్‌లు, వినిపించే సెటైర్లలతో బహిరంగ సభకు వచ్చిన జనంలో మంచి ఊపు తెప్పిస్తుంటారు. పబ్లిక్ మీటింగ్ పూర్తయ్యే వరకు టీవీ ముందు వేలాది మంది కళ్లప్పగించి చూస్తుంటారు. ఇక యూట్యూబ్‌లో ఆయన స్పీచ్ వస్తున్నంత సేపు వ్యూయర్స్ సెల్ ఫోన్ వదలిపెట్టారు. ఇంత క్రేజ్ ఉన్న సీఎం కేసీఆర్ స్పీచ్‌లో కొన్ని రోజులుగా ఏదో వెలితి మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందనే టాక్ ఉంది.

పార్టీ శ్రేణుల్లో నిరాశ

మొన్న పాలమూరు, నిన్న జగిత్యాల బహిరంగ సభల్లో కేసీఆర్ స్పీచ్‌లో జోష్ లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. కొన్ని రోజులుగా జరుగుతోన్న రాజకీయ పరిణామాలపై సీరియస్ కౌంటర్ ఉంటుందని పార్టీ లీడర్లు ఆశించారు. కేంద్రంతో తాడో పేడో అనే తీరుగా స్పీచ్ ఉంటుందని భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈడీ, ఐటీ సోదాలు, సీబీఐ విచారణను ఆయన కనీసం ప్రస్తావించలేదు. పాత విషయాలనే మరోసారి చెప్పారు. మునుగోడు బై ఎలక్షన్ సమయంలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడిన తీరును, ప్రస్తుతం బహిరంగ సభల్లోని ప్రసంగాల మధ్య చాలా వ్యత్యాసం ఉందని అభిప్రాయపడుతున్నారు. అంతకు ముందు పీఎం నరేంద్ర మోడీ,హోం మంత్రి అమిత్‌షాలపై వ్యక్తిగతంగా విమర్శలు చేసిన కేసీఆర్ ఇప్పుడు ఆ విషయాలను కనీసం ప్రస్తావించడం లేదు. దీంతో ఏమై ఉంటుందని పార్టీ లీడర్ల మధ్య చర్చ కొనసాగుతున్నది.

స్ట్రాటజీలో భాగమా?

కొన్ని రోజులుగా బీజేపీతో జరుగుతున్న రాజకీయ యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే టాక్ ఉంది. అందుకే ఆయన తన ప్రసంగంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తోన్న విధానాలపై మాత్రమే విమర్శలు చేశారు. కాని వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లలేదు. కేంద్ర బీజేపీ లీడర్లు త్వరలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు జైలుకు వెళ్తారని పదే పదే చేస్తోన్న విమర్శలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఘాటుగా స్పందించిన దాఖలాలు ఉన్నాయి. పీఎం మోడీ,హోం మంత్రి అమిత్ షాపై వ్యక్తిగత విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలపై విరుచుకపడ్డన రోజులు ఉన్నాయి. ఈడీ, బోడీ అంటూ విమర్శలు చేశారు. నన్ను ముట్టుకునే దమ్ము ఉందా? ముట్టుకుంటే మసైపోతారు అని హెచ్చరించారు. కానీ కేసీఆర్ ప్రస్తుతం ఎలాంటి కవ్వింపు మాటల జోలికి వెళ్లకుండా చాలా స్ట్రాటజీతో మాట్లాడారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకవైపు మంత్రులు, మరోవైపు కూతురు సమస్య

కేంద్ర దర్యాప్తు సంస్థలు కొన్ని రోజులుగా మంత్రుల వ్యాపార సంస్థలపై సోదాలు నిర్వహిస్తున్నాయి. నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని ఆదేశిస్తున్నాయి. దీంతో పార్టీ నేతల్లో ఒకరకమైన తెలియని ఆందోళన, భయం నెలకొంది. మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై ఈడీ సోదాలు నిర్వహిస్తే, మరో మంత్రి మల్లారెడ్డికి చెందిన విద్యా సంస్థలపై ఐటీ సోదాలు నిర్వహించింది. మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్ర నకిలీ సీబీఐ ఆఫీసర్ శ్రీనివాస్‌తో ఉన్న సంబంధాలను తెలుసుకునేందుకు సీబీఐ ఢిల్లీకి పిలిచి విచారించింది. క్యాసినో కేసులో ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ ఎపిసోడ్ కొనసాగుతుండగానే మరోవైపు ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ కేసులో సాక్షిగా విచారించేందుకు రెడీ అయింది. ఈ నెల 11న హైదరాబాద్‌లోని కవిత ఇంటికి సీబీఐ ఆఫీసర్లు వచ్చి లిక్కర్ కేసులోని నిందితులతో ఉన్న పరిచయాలను ఆరా తీయనుంది.

Also Read....

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: చంచల్‌గూడ జైలు నుంచి నిందితులు విడుదల

Tags:    

Similar News