ఆ రాష్ట్ర సీఎంతో కేసీఆర్ భేటీ లేనట్లేనా?
సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ చర్చనీయాంశంగా మారింది. గత ఐదు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన ఆయన అక్కడ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు, జాతీయ స్థాయి నేతలతో భేటీ అయినట్లు, అధికారికంగా ఎవరితోనూ సమావేశం అయినట్లు ఎక్కడ సమాచారం రావడం లేదు.
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ చర్చనీయాంశంగా మారింది. గత ఐదు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన ఆయన అక్కడ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు, జాతీయ స్థాయి నేతలతో భేటీ అయినట్లు, అధికారికంగా ఎవరితోనూ సమావేశం అయినట్లు ఎక్కడ సమాచారం రావడం లేదు. దీంతో కేసీఆర్ ఢిల్లీ టూర్ పై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారంటూ బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. అయినా కేసీఆర్ మాత్రం ఢిల్లీలోనే మకాం వేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే మరో అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉంటే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ హైదరాబాద్ కు చేరుకున్నారు. సోమవారం జరగనున్న ఒడిశా ఇన్వెస్టర్స్ మీట్ లో పాల్గొనేందుకు నవీన్ పట్నాయక్ ఆదివారం నగరానికి చేరుకున్నారు. ఆదివారం నగరానికి చేరుకున్న ఆయన మంగళవారం వరకు ఇక్కడే ఉండనున్నారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో రాణించాలని ఆశపడుతున్న కేసీఆర్ హైదరాబాద్ కు వచ్చిన నవీన్ పట్నాయక్ తో కలిసి చర్చలు జరిపే అవకాశాలు ఉన్నా ఆయన ఢిల్లీలోనే ఉండిపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
గతంలో ఒడిశాకు వెళ్లి కలిసిన కేసీఆర్:
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుతూ తీర్మానం చేసిన కేసీఆర్ పార్టీ పేరు మార్చక ముందు నుండే జాతీయ రాజకీయాల్లో ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2018లోనే నవీన్ పట్నాయక్ ను కేసీఆర్ కలిశారు. ఆయన్ను కలిసేందుకు కేసీఆర్ భువనేశ్వర్ వెళ్లారు. జాతీయ రాజకీయాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. అలాంటిది ఇప్పుడు తెలంగాణకు నవీన్ పట్నాయక్ వచ్చినా కేసీఆర్ అందుబాటులో లేకపోవడం ఆసక్తిగా మారింది. వీలును బట్టి సోమవారం కేసీఆర్, నవీన్ పట్నాయక్ తో మర్యాదపూర్వకంగా కలుసుకునే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. అంటే కేసీఆర్ సోమవారం రాష్ట్రానికి తిరిగి వస్తే ఇది జరుగుతుంది లేదా తన ప్రణాళిక ప్రకారం మంగళవారం నవీన్ పట్నాయక్ ముంబైకి వెళ్లిపోతారని తెలుస్తోంది.
అంతుపట్టని కేసీఆర్ వైఖరి:
సీఎం ఢిల్లీ టూర్ అంతుపట్టడం లేదనే టాక్ రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో హాజరయ్యే నిమిత్తం గత మంగళవారం యూపీకి వెళ్లిన కేసీఆర్ అదే రోజు అక్కడి నుండి నేరుగా ఢిల్లీకి వెళ్లారు. అప్పటి నుండి హస్తినాలోనే ఉన్నారు. తొలుత ఢిల్లీలో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయం, నిర్మాణ దశలో ఉన్న కార్యాలయం పనులను పరిశీలించిన ఆయన ఆ తర్వాత ఎవరెవరితో భేటీ అవుతున్నారనేది ఎవరికీ తెలియడం లేదు. ఓ వైపు మునుగోడు ఉప ఎన్నిక ఫీవర్ ఫీక్స్ కు చేరుకుంటున్న తరుణంలో ఆయన ఢిల్లీలో ఏం చేస్తున్నారనేది సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష నేతల్లో చర్చ జరుగుతోంది. అయితే జాతీయ రాజకీయాలే లక్ష్యంగా ఢిల్లీలో మకాం వేశారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే నవీన్ పట్నాయక్ హైదరాబాద్ కు వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ సైతం అందుబాటులో ఉండి ఆయనతో జాతీయ రాజకీయాలపై చర్చిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. ఈ అవకాశాని కేసీఆర్ వదులుకుంటారా లేక రేపటి వరకు అవకాశం ఉన్న నేపథ్యంలో నవీన్ పట్నాయక్ తో కేసీఆర్ భేటీ ఉంటుందా లేదా అనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి