వారి ఎత్తుగడలను తిప్పికొట్టాలి.. ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు
తెలంగాణ ప్రజలు కొరుకున్న విధంగానే నేడు అన్ని రంగాల్లోనూ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రజలు కొరుకున్న విధంగానే నేడు అన్ని రంగాల్లోనూ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. నేడు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం పొందారు. ఈ వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సమాజం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యం వైపు నడవాడానికి ఆనాటి ప్రజలు ఎంతో కృషి చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా ఆనాడు పోరాటంలో తమ ప్రాణాలర్పించిన మహనీయులను స్మరించుకున్నారు. ఈ మేరకు కొంత సమయం పాటు ప్రసంగం కొనసాగింది. అనంతరం 2001లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి తానే స్వయంగా సారథ్యం వహించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలందరిని ఒక్కటి చేసి చేసిన అవిశ్రాంత పోరాటానికి ఢిల్లీ ప్రభుత్వం దిగొచ్చిందన్నారు. నేడు తెంలగాణ దేశానికే దారిచూపే టార్చ్ బేరర్ గా నిలిచిందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇటీవల భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించనంత ఘనంగా15 రోజుల పాటు అద్భుతంగా జరుపుకున్నామని.. దానికి కొనసాగింపుగానే జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలనూ నిర్వహించుకుంటున్నామని తెలిపారు.
దేశంలోనూ, రాష్ట్రంలోనూ మతోన్మాద శక్తులు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మత విద్వేశాలను విడనాడి విశ్వశాంతిని సాధిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. తమ స్వార్థ రాజకీయాల కోసం సమాజంలో ముళ్లకంపలు నాటుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్వేషాలు రగిలిస్తూ, విష వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయని మండిపడ్డారు. మనుషుల మధ్య ఈ రకమైన విభజన ఏ విధంగానూ సమర్థనీయం కాదన్నారు. మతం చిచ్చు ఈ విధంగానే విజృంభిస్తే అది దేశం, రాష్ట్రం జీవికళనే కబళిస్తుందని కేసీఆర్ హెచ్చరించారు.
అంతే కాకుండా, జాతీయ సమైక్యతకు ప్రతీకగా జరుపుకునే సెప్టెంబర్ 17ను సైతం వక్రీకరించి, తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నారని కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోరాటంలో ఏ సంబంధం లేని ఈ అవకాశవాదులు నేడు తెలంగాణ చరిత్రను వక్రీకరించి రాజకీయాలు చేస్తు్న్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఇటువంటి రాజకీయవాదుల ఎత్తుగడలను తిప్పికొట్టాలని అన్నారు.
ప్రజలందరి అండదండలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన వ్యక్తిగా, అనునిత్యం తెలంగాణ ప్రజలలు ఆకాంక్షించే వ్యక్తిగా, ఈ నేలపై నెలకొన్న శాంతి, సౌభ్రాతృత్వాలను గుండెల నిండా శ్వాసించే వ్యక్తిగా ప్రతీ క్షణం ప్రజాశ్రేయస్సు కోసమే పరితపించే వ్యక్తిగా ఉంటానని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ' మీ అందరికీ వినమ్రంగా చేతులు మోడ్చి నమస్కరిస్తూ నేను కోరుకునేది ఒక్కటే.. ఎన్నటికీ ఈ నేల శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలే తప్ప, అశాంతి, అలజడులతో అట్టుడికి పోవద్దు. తిరిగి తెలంగాణ మరో కల్లోలంలోకి జారిపోవద్దు. తెలంగాణ ఈనాడు ఎంత వేగంగా పురోగమిస్తున్నదో అంతేవేగంతో రాబోయే రోజుల్లోనూ అప్రతిహతంగా అభివృద్ధి పథంలో దూసుకు పోవాలి. జాతినిర్మాణంలో ఉజ్వల పాత్రను నిర్వహించాలి. భారత జాతి జాగృతి కోసం, అభ్యున్నతి కోసం మనవంతు దోహదం చేద్దామని అందరినీ కోరుకుంటూ మరోమారు యావత్ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అంటూ కేసీఆర్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు
Also Read: మోడీకి కేసీఆర్ బర్త్‌డే విషెస్