KCR భారీ స్కెచ్.. జర్నలిస్టులకు ఎలక్షన్ గిఫ్ట్?

మరికొన్ని నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. వివిధ సెక్షన్ల ప్రజలను ఆకట్టుకోడానికి అధికార పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

Update: 2023-02-08 22:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మరికొన్ని నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. వివిధ సెక్షన్ల ప్రజలను ఆకట్టుకోడానికి అధికార పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా జర్నలిస్టులను ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నది. ఎన్నికల గిప్టుగా ఇండ్ల స్థలాల అంశాన్ని వాడుకోవడంపై దృష్టి సారించింది. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ మొదలు పలు జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు హడావుడి చేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ, మండల స్థాయి రిపోర్టర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో స్థలాల పంపిణీకి తేదీలు ఫిక్స్ అయ్యాయి. మరికొన్ని చోట్ల ఎమ్మెల్యేలు వారి సొంత డబ్బులతో స్థలాన్ని కొని లోకల్ రిపోర్టర్లకు ఇవ్వడానికి సైతం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరికొన్నిచోట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు జరుగుతున్నాయి.

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళకుండా అధికార పార్టీ వీలైన అన్ని మార్గాలను ఎంచుకున్నది. మీడియా సంస్థల సహకారం, యాజమాన్యాల మద్దతు సంగతి ఎలా ఉన్నా, విడివిడిగా జర్నలిస్టుల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత, అసంతృప్తికి బ్రేక్ వేయాలనుకుంటున్నది. ఆ ఆలోచనల కొనసాగింపుగానే జిల్లాల్లో, నియోజకవర్గాల్లో రిపోర్టర్లు, ఫొటోగ్రాఫర్లు, వీడియో కెమెరామెన్ తదితరులకు ఇండ్ల స్థలాలు ఇస్తామంటూ గులాబీ నేతల ప్రకటనలు చేస్తున్నారు. ఎలాగూ కొన్ని మీడియా సంస్థలు అధికార పార్టీ నేతల చెప్పుచేతల్లోనే ఉన్నాయి. వారే యాజమాన్యంగా ఉన్నారు. మరికొన్ని సంస్థలు అధికార పార్టీకి వీలైనంతగా భజన చేస్తున్నాయి. ఇంకొన్ని ప్యాకేజీల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

పోటాపోటీగా యూనియన్ల ప్రయత్నాలు..

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేమని అధికార పార్టీ నాయకులు అనేక సందర్భాల్లో గొప్పగా చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమంలో గతంలో ఎన్నటి కంటే బీఆర్ఎస్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే రూ.100 కోట్ల కార్పస్ ఫండ్‌ను కేటాయించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. కరోనా సమయంలో జర్నలిస్టుల్ని ఆదుకోడానికి కోట్లాది రూపాయలను ప్రభుత్వ సాయంగా అందించిన విషయాన్ని మీడియా అకాడమీ విస్తృతంగా ప్రచారం చేసుకున్నది.

అయితే, రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయం కీలకమైన అంశంగా మారింది. దాదాపు తొమ్మిదేండ్లు కావస్తున్నా అపరిష్కృతమైన అంశంగానే మిగిలిపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల నాటి రాజకీయ పరిస్థితి ఇప్పుడు లేకపోవడంతో రూలింగ్ పార్టీ అలర్టయ్యింది. డ్యామేజ్ కంట్రోల్‌పై ఫోకస్ పెట్టింది. ఇంతకాలం సుప్రీంకోర్టులో కేసు విచారణ పెండింగ్‌లో ఉన్నదనే సాకుతో పురోగతి లేకుండా ఉండిపోయింది.

సుప్రీంకోర్టు తీర్పుతో కదలిక..

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ రిటైర్ కావడానికి ఒక రోజు ముందు తీర్పు రావడంతో ఇకపైన సాకులకు వీలు లేకుండా పోయింది. ఒకవైపు జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీ, మరోవైపు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల సంఘం, ఇంకోవైపు అసలు సిసలైన యూనియన్ తమదేనంటున్న ఐజేయూ అనుబంధ యూనియన్ మంత్రి కేటీఆర్‌తో వేర్వేరుగా సంప్రదింపులు జరిపాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. మీడియా సమావేశం మొదలు డైరీ ఆవిష్కరణ వరకు అన్ని సందర్భాల్లోనూ పాత్రికేయులు ఇండ్ల స్థలాల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఏ సొసైటీలో సభ్యత్వం లేని జర్నలిస్టులు ఇంటి స్థలం లేదా ఇల్లు ఎప్పుడు సాకారమవుతుందా.. అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

కేసీఆర్ నుంచి కేటీఆర్ పరిధిలోకి షిఫ్ట్..

ప్రభుత్వం ఇచ్చినప్పుడు తీసుకోవడమే తప్ప జర్నలిస్టులు హక్కుగా సాధించుకోలేని వాతావరణం తొమ్మిదేళ్ళుగా కొనసాగుతున్నది. దయాదాక్షిణ్యాలతో మాత్రమే సాధ్యమవుతుందనే పరిస్థితుల్ని రూలింగ్ పార్టీ సృష్టించింది. సీఎంను, మంత్రులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా మాత్రమే పరిష్కారం లభిస్తుందనే వాతావరణం నెలకొన్నది. ఇందుకు కొన్ని మీడియా సంస్థలు, యూనియన్లు జీ హుజూర్.. దాసోహం.. అనేలా తయారయ్యాయి. మరికొన్ని భజన చేయడం ద్వారా సాకారం చేసుకోవచ్చనే భావనలో ఉన్నాయి. ఫస్టు టర్ములో నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ డీల్ చేసిన ఈ అంశం సెకండ్ టర్ములో మాత్రం కేటీఆర్ పరిధిలోకి వెళ్ళిపోయింది. పాత్రికేయులతో చిట్‌చాట్ సందర్భంగా కేసీఆర్ ద్వారా త్వరలోనే సొల్యూషన్ వస్తుందనే మెసేజ్‌ను పాస్ చేశారు.

ఏకాభిప్రాయం దిశగా ప్రయత్నాలు..

తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజునే కేటీఆర్‌ను కలిసి ఇండ్ల స్థలాల అంశాన్ని ఒక సొసైటీ, మరో యూనియన్ ప్రతినిధులు చర్చించడంతో గతంలో ఎన్నడూ లేనంత ఆసక్తికరమైనదిగా మారింది. యూనియన్ల, సొసైటీలతో సంబంధం లేకుండా పాత్రికేయులందరికీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నదని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఒక యూనియన్ లేదా సొసైటీకి ఇచ్చి మిగిలినవారికి అన్యాయం జరిగితే అది మంచి కంటే చెడు ఎక్కువ జరగడానికి దారితీస్తుందని వారికి కేటీఆర్ అర్థం అయ్యేలా వివరించారు. ఉద్యమంలో జర్నలిస్టులు యాక్టివ్‌గా పాల్గొన్నారని, కొందరికి ఇచ్చి మరికొందరిని నిరాశపర్చడం సమంజసం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇలాంటి తలనొప్పిని తెచ్చుకోవాలని కోరుకోవడం లేదని సూటిగానే కామెంట్ చేశారు.

'అంతా చర్చించాం.. లైన్ క్లియర్ అయింది.. ఇక పట్టాలు అందుకోవడమే తరువాయి.. రిజిస్ట్రేషన్ జరగడమే మిగిలింది..' ఇలా క్లెయిమ్ చేసుకోడానికి కేటీఆర్‌తో మాట్లాడిన ఫొటోలను షేర్ చేయాలనుకున్నారు కొద్దిమంది ప్రతినిధులు. కానీ ఇది నెగెటివ్ మెసేజ్ వెళ్తుందన్న ఉద్దేశంతో కేటీఆర్ అందుకు అవకాశం ఇవ్వలేదు. యూనియన్లు, సొసైటీలతో సంబంధం లేకుండా ఏకాభిప్రాయాన్ని సాధించి, కామన్ బెనిపిషియరీ లిస్టును తయారుచేసి రావాలంటూ కేటీఆర్ సూచించారు.

రంగంలోకి మీడియా అకాడమీ చైర్మన్..

చివరకు మీడియా అకాడమీ చైర్మన్‌గా ఉన్న అధికార పార్టీ అనుకూల వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ నాయకులైన అల్లం నారాయణ రంగంలోకి దిగారు. సీనియర్ ఎడిటర్ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలోని మరో యూనియన్‌తో ఏకాభిప్రాయం సాధించడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. నిన్ననే మీడియా సంస్థల ఎడిటర్లు, సీనియర్లతో సమావేశమై ఈ విషయాన్ని చర్చించారు.

గతంలోనే పలుచోట్ల భూముల గుర్తింపు..

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను ఇవ్వడానికి 2016లోనే బుద్వేల్, పేట్‌బషీరాబాద్ లాంటి చోట్ల ప్రభుత్వం భూముల్ని కేటాయిస్తామని చెప్పింది. వాటిని చూసుకుని ఏది కావాలో ఖరారు చేసుకోవాలని సీఎం సూచించారు. యూనియన్ ప్రతినిధులు కొందరు అక్కడికి వెళ్ళి చూసుకుని వచ్చారు. చేతికి రావడమే తరువాయి అనేంతగా జర్నలిస్టుల్లో ఆశలు పెరిగాయి. వేతనాలు పెరక్కపోయినా, పని వాతావరణం సానుకూలంగా లేకపోయినా అనేక మంది తాము పనిచేస్తున్న సంస్థల్లోనే కదలకుండా ఉండిపోయారు. చివరకు ఆ స్థలాలూ ఐటీ సంస్థలకు వెళ్ళిపోయాయి.

భూమి గుండ్రంగా ఉన్నట్లు తొమ్మిదేళ్ళ తర్వాత మళ్ళీ ఇది మొదటికి వచ్చింది. ప్రభుత్వానికి ఇది కొరకరాని కొయ్యగా మారింది. ఇంతకూ సర్కారు మదిలో ఏమున్నది? ఇండ్ల స్థలాలు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉన్నదా? అందని ద్రాక్షగా ఊరించాలనుకుంటున్నదా? ఎన్నికల సమయంలో ఆశలు మరోమారు రేకెత్తించి ప్రసన్నం జర్నలిస్టులను చేసుకోవాలనుకుంటున్నదా.. ఇదీ జర్నలిస్టుల మధ్య జరుగుతున్న చర్చ.

తొమ్మిదేళ్ళ నిరీక్షణ తర్వాత కొద్దిమందిలో అసహనం కట్టలు తెంచుకుని 'ప్రభుత్వం చలిమంటలు కాచుకోవాలనుకుంటున్నది అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ అసంతృప్తిని గుర్తించినందునే ఎన్నికల వరకూ దీన్ని హాట్ టాపిక్‌గా కంటిన్యూ చేయాలని అధికార పార్టీ భావిస్తున్నది.

టాక్ ఆఫ్ ద ఫోర్త్ ఎస్టేట్..

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయంలో ఇంతకాలం సుప్రీంకోర్టులో కేసును అధికార పార్టీ పావుగా వాడుకున్నది. తొమ్మిదేళ్ళుగా ఊరిస్తూనే ఉన్నది. అయితే, జర్నలిస్టుల్లో దినదినం పెరుగుతున్న అసంతృప్తిని, వ్యతిరేకతను గ్రహించింది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జరగబోయే నష్టాన్ని అంచనా వేసింది. బ్రేక్ వేయాలని భావించింది. కేటీఆర్ చొరవ తీసుకుని వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. జర్నలిస్టులకు నిజంగానే ఇండ్ల స్థలాలను ఇస్తారా లేక ఇంతకాలం నాన్చినట్లుగా ఇకపైన కూడా అదే ధోరణిని కంటిన్యూ చేస్తారా అనేది 'టాక్ ఆఫ్ ద ఫోర్త్ ఎస్టేట్'గా తయారైంది.

ఇవి కూడా చదవండి : ఎవరా నలుగురు.. IAS వర్గాల్లో గుబులు రేపుతోన్న బండి సంజయ్ ఢిల్లీ టూర్..!

Tags:    

Similar News