బిగ్ న్యూస్: అక్టోబర్‌లోనే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్..? KCR వ్యాఖ్యలతో రాష్ట్రంలో కొత్త చర్చ..!

అక్టోబరులోనే అసెంబ్లీ ఎన్నికలు రావచ్చంటూ పార్టీ జనరల్ బాడీ మీటింగులో అధినేత కేసీఆర్ చేసిన కామెంట్ ఇప్పుడు నేతల మధ్య చర్చనీయాంశంగా మారింది.

Update: 2023-04-28 00:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అక్టోబరులోనే అసెంబ్లీ ఎన్నికలు రావచ్చంటూ పార్టీ జనరల్ బాడీ మీటింగులో అధినేత కేసీఆర్ చేసిన కామెంట్ ఇప్పుడు నేతల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఎలక్షన్స్ నిజంగా అక్టోబరులోనే వస్తాయా?.. డిసెంబరు-జనవరి నెలల్లో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న సమయంలో కమిషన్ తెలంగాణ ఎలక్షన్స్‌ను విడిగా నిర్వహిస్తుందా? కేంద్ర ఎన్నికల సంఘం అందుకు సిద్ధపడుతుందా?.. కేసీఆర్ ముందుగా పసిగట్టి ఈ వ్యాఖ్యలు చేశారా?.. లేక శ్రేణుల్ని అప్రమత్తం చేయడం కోసం ప్రస్తావించారా?.. ఇవీ ఇప్పుడు పార్టీ నేతల మధ్య జరుగుతున్న చర్చలు. ఒకవైపు షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్తూనే ‘ఇంకో నాలుగైదు నెలలు మాత్రమే ఉన్నది.. అప్పటికల్లా అన్నీ పూర్తిచేసుకోండి..’ అంటూ కేసీఆర్ చేసిన కామెంట్ల వెనక మర్మమేంటనే గుసగుసలు మొదలయ్యాయి.

షెడ్యూలు ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జనవరి 15వ తేదీకల్లా పూర్తికావాల్సి ఉన్నది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జనవరి మొదటి, రెండవ వారాల్లోనే జరగాల్సి ఉన్నది. వీటికంటే రెండు వారాల ముందు (డిసెంబరు 16) మిజోరాం ఎన్నికలు కంప్లీట్ కావాలి.

ఒకేసారి దాదాపు నాలుగు రాష్ట్రాల ఎన్నికలను డిసెంబరులో నిర్వహించనున్న సమయంలో తెలంగాణకు విడిగా అక్టోబరులోనే షెడ్యూలు ఖరారు చేస్తుందా అనే సందేహం నెలకొన్నది. జనవరిలో జరగాల్సిన ఎన్నికలు అక్టోబరులోనే వస్తాయంటూ కేసీఆర్ ఏ ఉద్దేశంతో ఈ కామెంట్ చేశారనేది నేతలను తికమక పెడుతున్నది.

కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్యేలందరినీ అప్రమత్తం చేయడం కోసమే ఈ వ్యాఖ్యలు చేశారా?.. లేక ముందస్తుగా నిర్వహించేలా అసెంబ్లీ రద్దుకు సాహసిస్తారా అనే ఊహాగానాలూ సొంత పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. ముందస్తుగా అసెంబ్లీని రద్దు చేయకపోతే ఎలక్షన్ కమిషన్ అక్టోబరులోనే నిర్వహించాల్సిన అవసరం ఉండకపోవచ్చని, కేసీఆర్ వ్యాఖ్యల వెనక ఉన్న మర్మమేంటనేది ఆసక్తికరంగా మారింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి డిసెంబరులో నిర్వహించడానికి ఎక్కువ ఆస్కారమున్నది. తెలంగాణ కోసం విడిగా నిర్వహించాలనుకుంటే దానికి రాజ్యాంగపరమైన చిక్కులు ఉంటే తప్ప సాధ్యం కాదన్నది పార్టీలోని సీనియర్ నేతల అభిప్రాయం.

మరోవైపు నాలుగైదు నెలల సమయమే ఉన్నందున ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లో ఉండాలని, పెండింగ్ పనులను అప్పటికల్లా పూర్తి చేసుకోవాలని కూడా కేసీఆర్ సూచించారు. షెడ్యూలు ప్రకారం డిసెంబరులో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే దాదాపుగా అక్టోబరు రెండో వారం తర్వాత షెడ్యూలు వేడి మొదలవుతుందని, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందని హింట్ ఇచ్చారు. ఒకసారి షెడ్యూలు విడుదలైతే అన్ని అభివృద్ధి పనులకూ బ్రేక్ పడుతుంది.

దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే హుషారై ఏమేం పనులు కావాలో సీరియస్‌గా ప్రయత్నించాలని ఎమ్మెల్యేలను, స్థానిక పార్టీ నేతలను అలర్ట్ చేశారు. కోడ్ చిక్కులతో ఇబ్బంది పడకుండా ‘నాలుగైదు’ నెలల్లోనే ప్లాన్ ప్రకారం ఫీల్డ్ మీద పనులను కంప్లీట్ చేసుకోవాలని సూచనలు చేశారు. పార్టీని సంస్థాగతంగా ఎన్నికలవైపు తీసుకెళ్తున్న కేసీఆర్ అక్టోబరులో పూర్తి స్థాయిలో రంగంలోకి దిగనున్నట్లు సన్నిహితుల సమాచారం.

వరంగల్ సభతో ఎన్నికల శంఖారావం

వరంగల్ పట్టణంలో అక్టోబరు 10న భారీ స్థాయి బహిరంగ సభ ఉంటుందని మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. సుమారు పది లక్షల మందిని ఈ సభకు తరలించాలని సరిహద్దు జిల్లాల నేతలకు సూచించారు. పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చిన అక్టోబరు 5 లాంఛనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయినందున దానికి ప్రతీకగా భారీ స్థాయిలో పబ్లిక్ మీటింగ్ నిర్వహించాలని ఆయన భావిస్తున్నారు.

ఈ సభ కేవలం పార్టీ ఆవిర్భావానికి గుర్తుగా మాత్రమే కాక ఎన్నికల శంఖారావంగా కూడా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకే దీనికి ‘శంఖారావం’ అని పేరు పెట్టే అవకాశముందని పార్టీల నేతల భావన. ఈ సభతోనే కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని, పలు సెగ్మెంట్లలో సుడిగాలి పర్యటనలు చేస్తారని ఉదహరించారు. 

Read more:

35 మంది ఎమ్మెల్యేల పనితీరుపై KCR అసంతృప్తి.. వేటు పడేనా?

Tags:    

Similar News

టైగర్స్ @ 42..