BRS పొలిట్‌‌‌బ్యూరో.. రాష్ట్రం నుంచి వీరికే అవకాశం?

బీఆర్ఎస్ పార్టీకి పొలిట్ బ్యూరో‌పై పార్టీ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు.

Update: 2022-12-16 00:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీకి పొలిట్ బ్యూరో‌పై పార్టీ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు. మొదటగా పొలిట్ బ్యూరో కమిటీ వేసిన తర్వాత పార్టీ కార్యవర్గంతో పాటు అనుబంధ సంఘాలను నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ లక్కీ నెంబర్ 6 కావడంతో.. ఆ ఆరు వచ్చేలా కమిటీ కూర్పు చేపట్టనున్నట్లు తెలిసింది. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో చేరికలపైన ఫోకస్ పెట్టారు. పార్టీ కార్యాలయాలను ప్రారంభించేందుకు కసరత్తును కేసీఆర్ ప్రారంభించారు.

ఢిల్లీ కేంద్రంగా కేసీఆర్ రాజకీయాలు స్టార్ట్ చేశారు. పార్టీ విస్తరణ, కార్యచరణపై దృష్టిసారించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చేరికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. కలిసి వచ్చే వారెవరు.. మద్దతు ఇచ్చేదెవరు అనే వివరాలను సేకరిస్తున్నారు. ప్రాంతీయపార్టీ నేతలు బీఆర్ఎస్‌లో తమ పార్టీని విలీనం చేసేందుకు సిద్ధంగా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో సైతం పరిశీలిస్తున్నారు. విలీనం చేసేవారికి అన్ని విధాలా అండగా ఉంటామనే భరోసా ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఏ రాష్ట్రంలో ఏ రైతుసంఘం పటిష్టంగా ఉంది.. ఎవరు నాయకత్వం వహిస్తున్నారనే డేటాను సైతం సేకరిస్తున్నారు. రైతు నాయకులతో పాటు ఆయా రాష్ట్రాల్లో స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న వారిని, యూత్ నాయకులను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు విశ్వాసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే మొదటగా పార్టీ పొలిట్ బ్యూరోను నియమించాలని కేసీఆర్ భావిస్తున్నారు. కేసీఆర్ లక్కీ నెంబర్ 6 కావడంతో ఆ ఆరు కలిసే విధంగా 33 మందితో కమిటీ వేయనున్నట్లు సమాచారం. ఆ కమిటీలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారితో తెలంగాణకు చెందిన వారికి సైతం అవకాశం కల్పించనున్నారు. యాక్టీవ్‌గా పనిచేసే కీలకనేతలకు తొలుత అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. అంతేగాకుండా విశ్రాంత జడ్జీలు, ఏఐఎస్, ఐపీఎస్‌లకు సైతం పార్టీ కమిటీల్లో చోటు దక్కనుంది. ఇప్పటికే పలువురితో కేసీఆర్ సంప్రదింపులు జరిపినట్లు పార్టీ నేతలు తెలిపారు.

రాష్ట్రం నుంచి వీరే..?

రాజకీయ అనుభవం, వాక్ ఛాతుర్యం ఉన్న నేతలను పొలిట్ బ్యూరోలో సభ్యులుగా అవకాశం కల్పించే అవకాశం ఉంది. అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో సైతం కులప్రాతిపదికన కలిసివచ్చే అవకాశం ఉంటే వారికి సైతం చోటు దక్కనుంది. అదే విధంగా ప్రజలను మాటలతో ఆకట్టుకునేవారెవరనీ ఇప్పటికే కేసీఆర్ ఆరా తీసినట్లు సమాచారం. ప్రస్తుతం యాక్టీవ్‌గా పనిచేస్తున్న ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్‌ రవిందర్ సింగ్, సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ చోటు దక్కనున్నట్లు విశ్వసనీయ సమాచారం. పొలిట్ బ్యూరో సభ్యులందరికీ ఒక్కో రాష్ట్రానికి తాత్కాలికంగా ఇన్ చార్జులుగా నియమించడంతో పాటు బీఆర్ఎస్ అనుబంధ కమిటీల కూర్పు బాధ్యతలను సైతం అప్పగించే అవకాశం ఉంది.

అన్ని రాష్ట్రాల్లో కార్యాలయాలు...

పార్లమెంట్ ఎన్నికలకు గడువు ఏడాదిన్నర మాత్రమే ఉండటంతో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ విస్తృతం చేయడంపైనే ఫోకస్ పెట్టారు. అన్ని రాష్ట్రాల్లో నెలరోజుల్లోగా బీఆర్ఎస్ కార్యాలయాలను ప్రారంభించాలని భావిస్తున్నారు. అందుకోసం ఆయా రాష్ట్రాల్లోని రైతుసంఘం నేతల సాయం తీసుకోనున్నట్లు సమాచారం. ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభించి అక్కడే ఉన్న కేసీఆర్‌ను ఉత్తరాది నుంచి రైతుసంఘాల నేతలు, ప్రముఖులు వచ్చి కలుస్తున్నారు. తాముసైతం కలిసి వస్తామని కేసీఆర్‌తో మాట్లాడినట్లు తెలిసింది. అయితే అందులో కీలక నేతలను గుర్తించి పార్టీ ఆఫీసులకు ఇన్ చార్జులుగా నియమించనున్నట్లు సమాచారం.

Also Read....

కీలక సమయంలో TPCC Chief Revanth Reddy ఉక్కిరిబిక్కిరి! 

Tags:    

Similar News