బీహార్ వేదికగా కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
కరోనా సమయంలో కూలీలను, కార్మికులను కేంద్ర ప్రభుత్వం గోసపెట్టిందని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సమయంలో కూలీలను, కార్మికులను కేంద్ర ప్రభుత్వం గోసపెట్టిందని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. వారు స్వస్థలాలకు వెళ్తుంటే కనీసం రవాణా సౌకర్యం కల్పించలేకపోయిందని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం 150 రైళ్ళలో వలస కార్మికులను వారివారి స్వస్థలాలకు ఉచితంగా పంపించామని స్పష్టం చేశారు. బీహార్‌లోని పట్నాలో గురువారం గల్వాన్ లోయలో మరణించిన ఐదుగురు బీహార్ సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, సికింద్రాబాద్ టింబర్ డిపోలో ఇటీవల మరణించిన 12 మంది వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌తో కలిసి చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిలో బీహార్ కార్మికుల భాగస్వామ్యం ఎంతో ఉందన్నారు. తెలంగాణ వికాసం కోసం పాటుపడే బీహారీ కార్మికులకు రుణపడి ఉంటామని స్పష్టం చేశారు. వలస కార్మికుల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని వెల్లడించారు. దేశాన్ని, దేశ ప్రజలను కాపాడేందుకు సైనికులు సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నారని వారి కుటుంబాలకు ప్రతి భారతీయుడు అండగా నిలవాల్సిన బాధ్యత ఉందన్నారు. అమరవీరుల కుటుంబాలకు ఆర్థికసాయం చేయడం మన కనీస ధర్మం అన్నారు. దేశం కోసం అమరులైన జవాన్ల కోసం అండగా మేమున్నాం అని స్పష్టం చేశారు. అమరజవాన్ల త్యాగం వెలకట్టలేనిది తెలిపారు.
బీహార్ సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ గాల్వాన్‌లో భారతీయ జవాన్లు ధైర్య సాహసాలతో చైనాను తరికొట్టారన్నారు. అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ సహకారం అభినందనీయమన్నారు. అమరులకు కేంద్ర ప్రభుత్వం కూడా అండగా ఉండాలన్నారు. తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అనుక్షణం కేసీఆర్ పాటుపడుతున్నారన్నారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి తాగునీరందిస్తున్నారన్నారు. డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ గాల్వాన్ బాధిత కుటుంబాలకు రెండు రాష్ట్రాలు అండగా ఉంటాయన్నారు. ప్రతి రాష్ట్రం సుఖ దుఖాల్లో అండగా ఉండాలి పిలుపు నిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు, కార్మికులకు ఆర్థికసాయం అందించడం సమాఖ్య స్పూర్తికి నిదర్శనం అని పేర్కొన్నారు.
ఆర్థికసాయం అందజేసింది వీరి కుటుంబాలకే...
గల్వాన్ లో వీరమరణం పొందిన సైనికులు సునీల్ కుమార్, కుందన్ కుమార్, అమన్ కుమార్,చందన్ కుమార్, జయ్ కిషోర్ కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం, సికింద్రాబాద్ టింబర్ డిపోలో ఇటీవల మరణించిన సికిందర్ రామ్, దినేశ్ కుమార్,బిట్టూ కుమార్,దీపక్ రామ్,సత్యేంద్ర కుమార్, ఘటీ లాల్ రామ్, రాజేష్ కుమార్, అంకజ్ కుమార్ రామ్, ప్రేమ్ కుమార్, సింధు మహల్దార్, దామోదర్ మహల్దార్, రాజేష్ కుమార్ ల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు.