కౌన్ బనేగా టీ-టీడీపీ ప్రెసిడెంట్..? చంద్రబాబు నిర్ణయంపై తెలంగాణ పాలిటిక్స్‌లో తీవ్ర ఉత్కంఠ

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి కోసం ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. రానున్న రోజుల్లో పార్టీకి మంచిరోజులు వస్తాయని

Update: 2024-06-24 02:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి కోసం ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. రానున్న రోజుల్లో పార్టీకి మంచిరోజులు వస్తాయని భావిస్తూ పదవి కోసం ఫైరవీలు స్టార్ట్ చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశీస్సుల కోసం మంతనాలు స్టార్ట్ చేశారు. పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్నవారికి అవకాశం ఇవ్వాలని అధినేత భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొంతమంది పేర్లు తెరమీదకు రాగా, ఇతర పార్టీల నుంచి సైకిల్ ఎక్కుతున్నారని వారికే టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఇంకా క్లారిటీ రాలేదు.

చిగురిస్తున్న ఆశలు

ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణలోని టీడీపీ నేతల్లో ఆశలు చిగురించాయి. గతేడాది అక్టోబర్‌లో అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేయడంతో నాటి నుంచి ఎవరిని నియమించలేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పార్టీ వీక్ అయినప్పటికీ అంటిపెట్టుకొని కొంతమంది నేతలు ఉన్నారు. భవిష్యత్‌లోనైనా పదవులు రాకపోతాయా అని ఎదురుచూస్తున్నారు. ఏపీలో పార్టీ గెలుపుతో తెలంగాణలో పార్టీకి మంచిరోజులు అని ఆశిస్తున్నారు. బాబు దృష్టిలో పడాలని, ఆయన ఆశిస్సులతో తెలంగాణ బాధ్యతలు తెచ్చుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కొంతమంది అధినేతను నేరుగా కలుస్తుండగా, మరికొందరు లోకేశ్, ఇంకొందరు బాలకృష్ణతో సంప్రదింపులు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

నాలుగైదు రోజుల్లో బాబు భేటీ

తెలంగాణ టీడీపీ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు భేటీ కానున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని పార్టీ ముఖ్య నేతలకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే రాష్ట్ర కమిటీలో కొంతమంది నేతలు పదవుల్లో ఉండగా, కొన్ని ఖాళీలు ఏర్పడ్డాయి. అయితే పూర్తి రాష్ట్ర కమిటీని వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే యాక్టివ్‌గా పనిచేస్తున్న నేతల వివరాలను సైతం సేకరించినట్లు తెలిసింది. స్థానిక సంస్థల నాటికి కమిటీలు పూర్తి చేసి బరిలో నిలిచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

మొదటి నుంచి పనిచేస్తున్నవారికి ప్రాధాన్యం

పార్టీ మారకుండా టీడీపీని అంటిపెట్టుకొని ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ప్రజాసమస్యలపై గళం వినిపించిన నేతలకు బాధ్యతలు అప్పగిస్తేనే న్యాయం చేసినట్లు అవుతుందని భావిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే పార్టీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న సామా భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు, పార్టీ మహిళా అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి పేర్లను ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. 1982 నుంచి టీడీపీలో సామా భూపాల్ రెడ్డి పనిచేస్తున్నారు. టీడీపీ నుంచి ఉప్పరపల్లి సర్పంచ్‌గా విజయం సాధించారు. అదే విధంగా రాజేంద్రనగర్ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పనిశారు. చేవెళ్ల ఎమ్మెల్యేగా 2004లో పోటీచేసి ఓడిపోయారు.

ఆ తర్వాత పార్టీ శిక్షణ కార్యక్రమాలకు ఇన్‌చార్జిగా పనిచేశారు. ప్రస్తుతం పార్టీ వైస్ ప్రెసిడెంట్‌గా, చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉన్నారు. కాట్రగడ్డ ప్రసూన తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో పని చేశారు. తెలంగాణ ఉద్యమాల ప్రత్యేక రాష్ట్ర డేటాకు మద్దతు తెలుపుతూ ఆమె తెలంగాణ సెటిలర్లు ఫోరమ్ స్థాపించారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పని చేస్తున్నారు. 34 కార్మిక సంఘాలకు గౌరవ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. బక్కని నర్సింహులు షాద్‌నగర్ ఎమ్మెల్యేగా 1994లో విజయం సాధించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా, పార్టీకి వివిధ హోదాల్లో పనిచేశారు. వీరితో పాటు అరవింద్ కుమార్ గౌడ్, నన్నూరి నర్సిరెడ్డి, పద్మావతి, ఆనంద్‌తో పాటు పలువురు అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు.

అధినేత ఆశీస్సులు ఎవరికి..?

మరోవైపు ఇతర పార్టీలో ఉన్న కీలక నేతలు.. గతంలో టీడీపీలో పనిచేసి చేసిన వారు తిరిగి సొంతగూటికి వస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నవారు చేరుతున్నారనే విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మల్లారెడ్డికి టికెట్ ఇస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినా అధిష్టానం నుంచి క్లారిటీ రాలేదు. సైకిల్ పార్టీలో పనిచేస్తున్న నేతలు మాత్రం పార్టీని అంటిపెట్టుకున్నవారికే అధినేత చంద్రబాబు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం అని అభిప్రాయపడుతున్నారు. అయితే అధినేత ఆశీస్సులు ఎవరికి ఉంటాయనేది మాత్రం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తుంది.


Similar News