ఎన్నికల సమయంలో నిర్ణయం వెల్లడించే చాన్స్

జీవో నెంబరు 111 ను రద్దు చేస్తామని సీఎం కేసీఆర్ గతేడాది మార్చి 15వ తేదీన అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చారు.

Update: 2023-04-17 04:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : జీవో నెంబరు 111 ను రద్దు చేస్తామని సీఎం కేసీఆర్ గతేడాది మార్చి 15వ తేదీన అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చారు. 1996 నుంచి అమల్లో ఉన్న ఈ జీవో అవసరం ఇప్పుడు లేదంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. కేసీఆర్ ప్రకటనతో ఆయన చిత్రపటానికి అప్పట్లో అభిమానుల పాలాభిషేకాలు జరిగాయి. నిపుణుల కమిటీ నుంచి నివేదిక రాగానే దశల వారీగా ఎత్తివేస్తామని ప్రకటించడంతో ఏడు మండలాల్లోని 84 గ్రామాల్లో భూముల క్రయవిక్రయాలు ఐదారు నెలల పాటు ఊపందుకున్నాయి. భారీ స్థాయిలో భూముల రిజిస్ట్రేషన్లు జరిగి ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరింది. ఆ హామీ ఇచ్చి ఏడాది దాటిపోయింది. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి జీవో 111ను రద్దు చేస్తూ ఉత్తర్వులు రాలేదు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున అప్పటిదాకా నిర్ణయాన్ని కోల్డ్ స్టోరేజీలో పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు కనబడుతోంది.

సమైక్య రాష్ట్రంలో ఉనికిలోకి వచ్చిన ట్రిఫుల్ వన్ జీవో ప్రభావం శంషాబాద్, రాజేంద్రనగర్, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్ తదితర ఏడు మండలాల్లోని 84 గ్రామాలపై పడింది. జీవోను ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతోనే అక్కడి ప్రజల్లో సంతోషం వ్యక్తమైంది. ఏడాది గడిచినా ప్రభుత్వం ఉత్తర్వులు వెలువడకపోవడంతో సరికొత్త సందేహాలు నెలకొన్నాయి. ఇప్పట్లో రద్దు ఉత్తర్వులు రాకపోవచ్చని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎన్నికల వాతావరణం తారా స్థాయికి చేరుకునే ఐదారు నెలల్లో రాజకీయ లబ్ధి జరిగేలా నిర్ణయం తీసుకుంటారని వార్తలొస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా ఓటు బ్యాంకు పెరగడానికి దోహద పడాలనేది అధికార పార్టీ ఆలోచన. సరిగ్గా ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే సమయానికి ట్రిపుల్ వన్ జీవో రద్దు ఉత్తర్వులు జారీ కావచ్చని సమాచారం.

ఆ ఏడు మండలాలపై ఎఫెక్ట్..

ట్రిఫుల్ వన్ జీవో ప్రభావం ఏడు మండలాల ఓటు బ్యాంకుపై గణనీయంగా పడనుంది. అక్కడి ప్రజలు, రైతులు తమ ఆర్థిక అవసరాల కోసం భూములను అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నారని స్థానిక అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకుని ఉపశమనం కల్పించాలని చేవెళ్ళ ఎమ్మెల్యే కాలె యాదయ్య అసెంబ్లీలోనూ ప్రస్తావించారు. ఈ మండలాలన్నీ హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలే కావడంతో సిటీ స్థాయి అభివృద్ధిని ప్రజలు కోరుకుంటున్నారన్నది అధికార పార్టీ నేతల వాదన. భూముల ధరలు పెరిగితే ప్రజలకు ఆర్థికంగా రిలీఫ్ లభిస్తుందంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఎమ్మెల్యే లేవనెత్తిన అంశానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తూ.. “గతంలో ఉస్మాన్, హిమాయత్ సాగర్ చెరువుల ద్వారా నగరానికి త్రాగు నీరు అందేది. ఎండాకాలంలో మంచినీళ్లకు కొరత ఏర్పడినప్పుడు ఆ చెరువుల నుంచి వాడుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ నగరానికి ఈ రెండు చెరువుల నుంచి నీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. గోదావరి, కృష్ణా నదుల నుంచి తెచ్చుకుంటున్నాం. సుంకిశాల నుంచి మరో 40 టీఎంసీల కోసం పనులు కూడా మొదలుపెట్టాం. దీనికి తోడు గ్రావిటీ ద్వారానే మల్లన్నసాగర్ నుంచి కూడా నీరు వస్తుంది. రానున్న 100 ఏండ్ల వరకు కరువు సమస్యే ఉండదు” అన్నారు. ఈ చెరువులకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా నీరు కలుషితం కాకుండా ఉండాలంటే భారీ నిర్మాణాలపై నిషేధం ఉండాలని అప్పట్లో నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల మేరకు జీవో 111 ఉనికిలోకి వచ్చిందన్నారు.

ఎన్నికల ముందు చూద్దాం..!

ట్రిఫుల్ వన్ జీవోను వెంటనే రద్దు చేయాలని చేవేళ్ల, రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజక వర్గాల ప్రజలు లోకల్ లీడర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో భూముల విలువ పెరుగుతుందని 84 గ్రామాల ప్రజలు ఆశిస్తున్నారు. జీవో రద్దు ఎప్పుడంటూ జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డిని పదేపదే ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి పరిధిలో ఉందని, సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారంటూ ఆమె సర్దిచెబుతున్నారు. ఇప్పటికిప్పుడు జీవోను రద్దు చేస్తే పెద్దగా రాజకీయ ప్రయోజనం ఉండదన్నది అధికార పార్టీ భావన. ఎన్నికలు దగ్గరపడే సమయంలో రద్దుపై నిర్ణయం తీసుకుందామని ప్రగతిభవన్ వర్గాలు సంకేతాలిచ్చినట్టు సమాచారం. జీవో రద్దు ద్వారా చేవేళ్ల, రాజేంద్రనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో రాజకీయ ప్రయోజనం ఏ మేరకు ఉంటుందనే కోణంలో ఆరా తీస్తున్నట్టు తెలిసింది.

అటకెక్కిన సీఎస్ కమిటీ రిపోర్టు

ట్రిపుల్ వన్ జీవో రద్దు తదనంతర పరిణామాలపైనా ముఖ్యమంత్రి అసెంబ్లీ ద్వారానే కొంత క్లారిటీ ఇచ్చారు. జీవోను రద్దు చేసిన తర్వాత గ్రామాల్లో సిటీ ప్లానింగ్ ఎలా ఉండాలి.. జంట జలాశయాలకు ముప్పు లేకుండా ఏం చర్యలు తీసుకోవాలి.. తదితర అంశాలపై ఆధ్యయనం చేసేందుకు అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పలు దఫాలు సమావేశమైంది. గ్రామాల్లో ఎన్ని ఫీట్ల రోడ్డు ఉండాలి.. గ్రీనరీతో కూడిన పార్కులు ఎక్కడ ఏర్పాటు చేయాలి.. తదితర అంశాలపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కానీ.. ఆ కమిటీ ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ వల్ల కొందరు బీఆర్ఎస్ లీడర్ల భూములకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. అందుకే ఆ రిపోర్టులోని సిఫారసులను ప్రభుత్వం పక్కన పెట్టినట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ 2018 ఎన్నికల మేనిఫెస్టోలో సైతం అధికారంలోకి రాగానే ఈ జీవోను ఎత్తివేస్తామని హామీ ఇచ్చింది.

పర్యావరణవేత్తల నుంచి వ్యతిరేకత

రియల్ ఎస్టేట్ లాబీ లబ్ధి కోసమే ప్రభుత్వం ట్రిపుల్ వన్ జీవోను రద్దు చేయాలని భావిస్తున్నట్లు పర్యావరణవేత్తలు విమర్శిస్తున్నారు. ఈ జీవో రద్దు సులభమేమీ కాదంటూ సుప్రీంకోర్టు 2000లో ఒక పరిశ్రమ విషయంలో చేసిన కామెంట్లను గుర్తు చేస్తున్నారు. ఈ రెండు చెరువులను సీఎం కేసీఆర్ చెబుతున్నట్లు నిజాం కాలంలో కేవలం మంచి నీటి అవసరాల కోసమే నిర్మించలేదని.. నగరాన్ని వరదల నుంచి కాపాడేందుకే నిర్మించారని చెబుతున్నారు. 1908లో వచ్చిన భారీ వరదల తర్వాత నగరంలోని పలు ప్రాంతాల్లో ముంపును నివారించే ప్లానింగ్ ఈ చెరువుల నిర్మాణం వెనుక ఉందని వివరించారు. ఈ రెండు రిజర్వాయర్లు మాయమైతే భవిష్యత్తులో నగరానికి వచ్చే వరదల విషయంలో ప్రత్యామ్నాయమే లేకుండా పోతుందన్నారు. ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనను ప్రముఖ పర్యావరణవేత్త లుబ్నా సర్వత్ కూడా తప్పుబట్టారు. అధికార పార్టీకి చెందిన వారికి లబ్ధి చేకూర్చేందుకే ట్రిపుల్ వన్ జీవోను రద్దు చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోందంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో (ఎన్జీటీ) గతంలో ఒక పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కేటీఆర్ శంకర్ పల్లి మండలంలో తన ఫామ్ హౌస్ ను ట్రిపుల్ వన్ జీవో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని ఆ పిటిషన్ లో ఆరోపించారు. ఈ పిటిషన్‌ను సవాల్ చేస్తూ మంత్రి కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

కేసీఆర్ నిర్ణయం పెను విపత్తు: వాటర్ మాన్ రాజేంద్రసింగ్

ట్రిపుల్ వన్ జీవో రద్దు చేస్తానన్న సీఎం కేసీఆర్ ప్రకటనపై వాటర్ మాన్ రాజేంద్రసింగ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎం నిర్ణయం హైదరాబాద్ నగరానికి పెను విపత్తుగా పరిణమిస్తుందంటూ నేరుగా కేసీఆర్ కే లేఖ రాశారు. ఈ చెరువులు తాగు నీటి అవసరాలను మాత్రమే కాక.. వాతావరణ సమతుల్యానికి, కాలుష్య నివారణకు కూడా దోహదపడతాయని వివరించారు. నిపుణుల కమిటీ నివేదిక రాగానే జీవోను ఎత్తివేస్తానని కేసీఆర్ ప్రకటిస్తున్నారంటే.. ఆ నివేదిక ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదన్నారు. ఆయన ఆలోచనకు అనుగుణంగానే కమిటీ నివేదిక ఉంటుందనే అనుమానాన్ని ఆ లేఖలో వ్యక్తం చేశారు. ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేయడమంటే సుప్రీంకోర్టు ఉత్తర్వులను మాత్రమేకాక.. రాజ్యాంగ నిబంధనలనూ ఉల్లంఘించడం అవుతుందన్నారు. కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆ లేఖలో స్పష్టం చేశారు. నిజంగా కేసీఆర్‌ ఈ 84 గ్రామాల ప్రజల అవసరాలే ముఖ్యమని భావిస్తే వారిని మరోచోటకు తరలించి ఈ ప్రాంతాన్ని పర్యావరణ పరిరక్షణ కోసం యథాతథంగా ఉంచాలని, అప్పుడు ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచిపోతారని సూచించారు.

Tags:    

Similar News