దమ్ముంటే మాస్క్ లేకుండా తిరుగు.. కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సవాల్

బీఆర్ఎస్ నేతలు దమ్ముంటే మూసీ నది వెంట మాస్కు లేకుండా నడవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు.

Update: 2024-10-23 16:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ నేతలు దమ్ముంటే మూసీ నది వెంట మాస్కు లేకుండా నడవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం(Vemula Veeresham) పేర్కొన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీలోని సీఎల్పీలో మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాకు బీఆర్ఎస్ శాపం అన్నారు. మూసీ పునరుజ్జీవనానికి అడ్డుపడటం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వల్ల మంచి రోజులు వచ్చాయని తమ ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారన్నారు. మూసీ మురికి వదిలించాలని, సీఎం ప్రయత్నిస్తుంటే, బీఆర్ఎస్ రాద్దాంతం చేయడం సరికాదన్నారు. సూర్యాపేటకు తాగు, సాగు నీరు మూసీ నుంచి వస్తున్నాయో? లేదో? మాజీ మంత్రి జగదీష్​రెడ్డి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదన్నారు. మూసీ కలుషిత నీటి వల్ల అనేక రకాల జబ్బులు వస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న దొంగ ఉద్యమాలను ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నదన్నారు.

మూసీ నిర్వాసితులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని వివరించారు. ఇప్పుడు ఆందోళనలు, అసత్య ప్రచారాలు చేస్తున్న కేటీఆర్(KTR), అసలు మూసీ నిర్వాసితులకు ఏం చేయాలనేది? సంపూర్ణమైన అభిప్రాయం తెలపాలని కోరారు. హైదరాబాద్ మురికికుప్పగా ఉండలనేది బీఆర్ఎస్ స్టాండా? అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టును అడ్డుకుంటే హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలల వ్యతిరేక పార్టీ గా బీఆర్ఎస్ మిగిలిపోతుందని స్పష్టం చేశారు. కాళేశ్వరం కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టిన బీఆర్ఎస్, మూసీ కోసం రూ. 20 వేల కోట్లు ఎందుకు పెట్టలేకపోయిందని ప్రశ్నాంచారు. లూటీ చేయడం, లాభ పడటం బీఆర్ఎస్ నైజం అన్నారు. కేటీఆర్ నల్లగొండకు వచ్చి బుక్కెడు మూసీ నీళ్లు తాగి చూపించాలన్నారు.

ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి(Anil Kumar Reddy) మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండకు ప్రధాన శత్రువు బీఆర్ఎస్ పార్టీ అని కొనియాడారు. ఒక్క ప్రాజెక్టును కూడా బీఆర్ఎస్ పూర్తి చేయలేదన్నారు. మూసీ ప్రక్షాళనపై కేటీఆర్ అపోహలు సృష్టిస్తున్నారన్నారు. అబద్దాలు చెప్పి, అయోమయం కల్పిస్తున్నారన్నారు. మూసీ ప్రక్షాళన కోసం గతంలో అన్ని పార్టీల నాయకులు పాదయాత్రలు, దీక్షలు చేశారన్నారు. మూసీ ప్రక్షాళనను తాము అడగకముందే సీఎం వరం ఇచ్చారన్నారు. మూసీ కలుషితం వలన ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ని ప్రజలు రోగాల భారిన పడుతున్నారన్నారు. క్యాన్సర్, పక్షవాతం, మహిళలకు గ్రర్భస్రావం వంటి సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. భువనగిరి నియోజకవర్గం పిలాయపల్లిలో మూసీ ఒడ్డున ఈనెల 26న భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు.

Tags:    

Similar News