Seethakka: సావిత్రి బాయి పూలే జీవితాన్ని స్పూర్తిగా తీసుకోవాలి.. మంత్రి సీతక్క

సావిత్రి బాయి పూలే జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు.

Update: 2025-01-03 16:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సావిత్రి బాయి పూలే జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం ప్రజాభవన్ లో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రి బాయి పూలే చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం మొదటి విడతలో భాగంగా 25 సంచార చేపల విక్రయ వాహనాలను లబ్ది దారులకు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తో కలిసి మంత్రి సీతక్క అందజేశారు. సావిత్రి బాయి పూలే జయంతి కార్యక్రమంలో ప్రజాకవి జయరాజ్, కరీంనగర్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు రమేష్ పాల్గొని, సావిత్రిబాయి పూలే జయంతి ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేలా కృషి చేసిన మంత్రి సీతక్కకు ప్రజా సంఘాల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.....సావిత్రి భాయి ఫూలే జయంతి ని అధికారికంగా జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారన్నారు. కోట్లాదిమందికి విద్యను అందించిన సావిత్రిబాయి పూలేను అధికారికంగా టీచర్స్ డే గా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. గత కొన్నేళ్లుగా మహిళా టీచర్స్ డేను నిర్వహించాలని దళిత,బలహీన వర్గాల మహిళలు డిమాండ్ చేస్తూ వస్తున్నారన్నారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో పూలే వంటి నాయకులకు గుర్తింపునివ్వలేదన్నారు. గొప్ప కవులైన జయరాజ్ ను గుర్తించడంతో పాటు గద్దర్అన్నకు గుర్తింపునిచ్చింది సీఎం రేవంత్ రెడ్డి అని మంత్రి అన్నారు. సావిత్రి బాయి పూలే జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు,త్యాగం, వారి చరిత్ర మహిళలు ఎదిగేం దుకు, ఆ తల్లిని స్మరించుకోవడానికి మేం కోరగానే సీఎం జీవో ఇచ్చినందుకు మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మారుమూల పల్లెలు, దళితవాడలకు అక్షరాలను పరిచయం చేసిన గొప్ప వ్యక్తి సావిత్రి బాయి పూలే అన్నారు. మను ధర్మ కాలంలో మహిళలకు విద్యలేదని, అలాంటి సందర్భంలో ఆంక్షలు ఎదిరించి 50 పాఠశాలలను ప్రారంభించిన సావిత్రి బాయి పూలే సేవలను స్మరించుకోవాలన్నారు.

సామాన్య మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ లక్ష్యం.. మంత్రి సీతక్క

అనంతరం లబ్దిదారులకు సంచార చేపల విక్రయ వాహనాలను మంత్రి అందజేసి మాట్లాడుతూ... ఇప్పుడు వాహనాలు తీసుకునేవారందరూ మిగతా వారికి ఆదర్శంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ లక్ష్యం సామాన్య మహిళలను కోటీశ్వరులను చేయడమేనని తెలిపారు. మహిళలకు చదవు అవసరం లేదనే మూఢ నమ్మకాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామన్నారు. మహిళలు ఇంటికే పరిమితం కాదని సావిత్రి బాయి పూలే నిరూపించారన్నారు. ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతిగా ఉన్నారని, భార్యభర్తలు రోజంతా పనిచేసినా, సాయంత్రి భార్య మాత్రమే ఇంట్లో ఎందుకు పనిచేయాలి ఇద్దరూ పనిచేయాలన్నారు. మహిళా సంఘాలకు లోన్ భీమా పథకాన్ని అమలు చేస్తున్నామని, 17 రకాల వ్యాపారాలతో మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు.నాణ్యత, మంచి రుచితో ఆరోగ్యకరమైన చేపల వంటకాలను తయారు చేయాలన్నారు. మీ ఫిష్ ఫుడ్ కు మంచి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ కావాలన్నారు. 100శాతం సక్సెస్ రేటుతో అమ్మచేతి వంటకు మారుపేరుగా ఇందిరా మహిళా క్యాంటీన్ లు ఉండాలన్నారు. సంచార చేపల విక్రయ వాహనాలను ప్రారంభించిన మంత్రి సీతక్క మహిళా శక్తి వర్థిల్లాలి అంటూ స్వయంగా నినాదాలు ఇచ్చారు.

రూ. 10 లక్షల వాహనాలను రూ. 4 లక్షలకు అందిస్తున్నాం.. సెర్ఫ్ సీఈఓ, దివ్య దేవరాజన్

సంచార చేపల విక్రయ వాహనాల ప్రారంభంలో భాగంగా సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ.... ఈ దేశంలో మహిళలు చదువుకుటుంన్నారంటే దానికి కారణం సావిత్రి బాయి పూలేనని అన్నారు. వారి జయంతి సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలనే ఉద్దేశంతో మహిళలకు సంచార చేపల విక్రయ వాహనాలను అందిస్తుందని తెలిపారు. రూ. 10 లక్షల వాహనాన్ని ఆరు లక్షల సబ్సిడీతో కేవలం నాలుగు లక్షలకు అందిస్తున్నామని తెలిపారు.

సంచార చేపల విక్రయ వాహనం లబ్ధిదారు.. మల్లమ్మ, ములుగు జిల్లా

చదువురాని నేను ఇంత దూరం వస్తారని అనుకోలేదని, ములుగు దాటి బయటకు రావాలంటేనే నాకు భయం నాకు ధైర్యాన్ని ఇచ్చి అధికారులు ఇంత దూరం తీసుకొచ్చారు. చదువు రాని నాకు ప్రభుత్వం అండగా ఉండటం సంతోషంగా ఉంది. దూర ప్రాంతాలకు నెత్తిలో బుట్ట పెట్టుకుని చేపలు అమ్ముకుంటున్నాను. కొన్ని సార్లు నడవలేక రోడ్డు పక్కనే కూర్చొని అమ్ముకునేదాన్ని, కానీ ఇప్పుడు సంచార వాహనాల్లో చేపలు అమ్ముకునేందుకు ప్రభుత్వం సాయం చేసింది. ప్రభుత్వ తోడ్పాటుతో మాకు ఆదాయంతో పాటు ఆత్మగౌరవం పెరుగుతుంది

అభినవ సావిత్రి బాయి పూలే సీతక్క.. ప్రజా కవి జయరాజ్

10 ఏళ్లుగా సావిత్రి బాయి పూలేను గుర్తించలేదని ప్రజాకవి జయరాజ్ అన్నారు. మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని సాధించుకున్నందుకు మంత్రి సీతక్కకు రుణపడి ఉంటామని కవి జయరాజ్ తెలిపారు. నిన్నటి దాక సీతక్కను సమ్మక, సారక్క అనుకున్నాని, కానీ మరో అడుగు ముందుకు వేసి అభినవ సావిత్రి బాయి పూలే లా సీతక్క నిలిచారని జయరాజ్ తెలిపారు. అనంతరం ఎందరో జీవితాలు మారేందుకు స్ఫూర్తిగా నిలిచిన సావిత్రి బాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించేందుకు ఎంతగానో కృషి చేసిన మంత్రి సీతక్కను కవిజయరాజ్, వివిధ ప్రజా సంఘాలు శాలువాతో సత్కరించి సన్మానించారు.

Tags:    

Similar News