తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే పవర్: చల్లా వంశీచంద్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో రాష్ట్రంలో మరిన్ని చేరికలు ఉంటాయని సీడబ్ల్యూసీ మెంబరు చల్లా వంశీచంద్ రెడ్డి పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో రాష్ట్రంలో మరిన్ని చేరికలు ఉంటాయని సీడబ్ల్యూసీ మెంబరు చల్లా వంశీచంద్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పవర్‌లోకి వస్తుందన్నారు. కసిరెడ్డితో కలసి ముందుకు పోతున్నామన్నారు. బీఆర్ఎస్ చేస్తున్న అవినీతిపై పోరాటం ఆగదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా పరిషద్ వైస్ చైర్మన్ ఠాకూర్ బాలాజీ సింగ్‌లు త్వరలో పార్టీలో చేరనున్నారన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. అధిష్టానం నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ముందుకు సాగుతామన్నారు. రానున్న రోజుల్లో జరుగనున్న ఎన్నికల్లో కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చెయ్యాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.