Bandi Sanjay: మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి.. లారీ కింద పడ్డ యువతిని...
తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ మానవత్వాన్ని చాటుకున్నారు.
దిశ, వెబ్డెస్క్/హుజురాబాద్ రూరల్: తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ మానవత్వాన్ని చాటుకున్నారు. లారీ కింద ఇరుక్కుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువతిని తన వంతు ప్రయత్నం చేసి కాపాడారు. హుజురాబాద్ నియోజకవర్గం సింగాపూరం సమీపంలో ఓ యువతి రోడ్డు ప్రమాదానికి గురై లారీ కింద ఇరుక్కుపోయింది. అదే సమయంలో ములుగు పర్యటనకు వెళ్తున్న బండి సంజయ్.. ఈ ప్రమాదాన్ని గుర్తించి హుటాహుటిన తన వాహనాన్ని ఆపించి ఆ యువతిని కాపాడడానికి సిద్ధమయ్యారు. అటువైపు వెళుతున్న లారీలను ఆపి జాకీలు, కత్తెర తెప్పించి స్థానికుల సహాయంతో ఆమెను రక్షించారు. లారీ టైర్ కింద ఆమె డ్రెస్, జుట్టు ఇరుక్కోవడంతో వాటిని కత్తిరించి యువతిని బయటకు తీశారు స్థానికులు. అనంతరం గాయాలపాలైన యువతిని కరీంనగర్లోని లైఫ్ లైన్ ప్రైవేట్ ఆసుపత్రికి పంపి.. చికిత్సకు అయ్యే ఖర్చును తానే చెల్లిస్తానని ఆసుపత్రి వైద్యులకు చెప్పారు. కాగా.. లారీ కింద ఇరుకున్న మానకొండూర్ మండలం ఖెల్లడ గ్రామానికి చెందిన యువతిని దివ్య శ్రీగా గుర్తించారు.