అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు.. ఆరోజే బీజేపీలోకి ముఖ్యనేతల చేరికలు!

తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష బీజేపీకి మధ్య పొలిటికల్ ఫైట్ తారాస్థాయికి చేరుకుంటున్నది.

Update: 2023-02-24 23:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష బీజేపీకి మధ్య పొలిటికల్ ఫైట్ తారాస్థాయికి చేరుకుంటున్నది. ఇప్పటికే ఇరుపార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ జాతీయ నాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ హాట్ టాపిక్‌గా మారుతున్నది. ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్రంలో పర్యటించిన షా మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు. వచ్చే నెల 12న ఆయన తెలంగాణకు రాబోతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అధికారిక కార్యక్రమంలో భాగంగా పార్లమెంటరీ ప్రవాస్ యోజన ప్రొగ్రాంలో పాల్గొంటారని, తర్వాత ఇతర పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. వచ్చే నెలలో పార్టీ పరంగా పలు కీలక కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో అమిత్ షా టూర్‌పై ఉత్కంఠ పెరిగింది.

రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అమిత్ షా పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇటీవల బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేసింది. దీనికి మంచి స్పందనే వస్తుంది. మార్చి 12న నియోజకవర్గాల్లోని పార్టీ నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో అమలుచేసే వ్యూహాల గురించి చర్చిస్తారని సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పదవీ కాలం మార్చి 11తో ముగియనుంది. అయితే సంజయ్ ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్తామని ఇప్పటికే పార్టీ ఇన్‌చార్జి తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పదవీ కాలం రెన్యువల్ టైమ్‌కు అమిత్ షా టూర్ ఉంటుందన్న ప్రచారం పార్టీ శ్రేణులకు జోష్ తెప్పిస్తున్నది.

పార్టీలోకి ముఖ్యనేతల చేరికలు!

అమిత్ షా సమక్షంలో బీజేపీలోకి చేరికలు ఉంటాయని తెలుస్తున్నది. గత కొంత కాలంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అమిత్ షా టూర్ సందర్భంగా పొంగులేటి బీజేపీ కండువా కప్పుకోబోతున్నారనే ప్రచారం సైతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నది. ఇప్పటికే టీఆర్ఎస్ తో దాదాపుగా తెగదెంపులు చేసుకున్న పొంగులేటి అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

Tags:    

Similar News