బిగ్ న్యూస్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత మాజీ ఆడిటర్.. నిందితుడిగా పేరును చేర్చి సీబీఐ!
ఢిల్లీ మద్యం కుంభకోణంలో గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ నిందితుడిగా చేర్చింది. గతంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వ్యక్తిగత ఆడిటర్‌గా వ్యవహరించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణంలో గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ నిందితుడిగా చేర్చింది. గతంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వ్యక్తిగత ఆడిటర్‌గా వ్యవహరించారు. ఈ కేసులో ఇంతకాలం ఒక సాక్షిగా మాత్రమే హాజరయ్యారు. సీబీఐ అధికారులు జారీచేసిన నోటీసుల్లో భాగంగా ఇప్పటికే 15 సార్లు ఢిల్లీలో జరిగిన ఎంక్వయిరీకి అటెండ్ అయ్యారు. విచారణకు పూర్తిగా సహకరించినట్లు సీబీఐ కూడా ధ్రువీకరించింది.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఫిబ్రవరి 26న అరెస్టు చేసిన తర్వాత 58వ రోజైన ఏప్రిల్ 25న రౌస్ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌లో గోరంట్ల బుచ్చిబాబు పేరును చేర్చింది. స్కామ్‌లో బుచ్చిబాబు ప్రమేయం ఉన్నట్లు పేర్కొన్నది. ఇతనిపై ఐపీసీలోని 120-బీ, 201, 420 సెక్షన్ల కింద అబియోగాలను మోపింది. ఈ సప్లిమెంటరీ చార్జిషీట్‌పై మే 12న స్పెషల్ కోర్టు విచారణ జరపనున్నది.
లిక్కర్ స్కామ్‌లో ఒక ప్రొఫెషనల్ ఆడిటర్‌గా మాత్రమే గోరంట్ల బుచ్చిబాబుకు సంబంధం ఉన్నదంటూ గతంలో సీబీఐ వ్యాఖ్యానించింది. లిక్కర్ బిజినెస్‌లో ఎలాంటి పెట్టుబడులు లేవని, లైసెన్సుకు కూడా దరఖాస్తు చేసుకోలేదని, ఎలాంటి వ్యాపార ప్రయోజనాలను ఆశించలేదని కూడా పేర్కొన్నది. గత నెల 6న రౌజ్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో జడ్జి ఎంకే నాగ్‌పాల్ ముందు జరిగిన బుచ్చిబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీబీఐ పై వ్యాఖ్యలు చేసింది.
ప్రధాన నిందితుడైన మనీష్ సిసోడియాను, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించిన తర్వాతి పరిస్థితుల్లో సప్లిమెంటరీ చార్జిషీట్‌లో బుచ్చిబాబును కూడా నిందితుడిగా చేర్చడం గమనార్హం. లిక్కర్ పాలసీలో మార్పులు చేర్పులపై సౌత్ గ్రూపు తరఫున ఆడిటర్ హోదాలో పలు సమావేశాలకు హాజరైనట్లు వ్యాఖ్యానించింది.
సౌత్ గ్రూపులో కవిత సభ్యురాలంటూ ఇంతకాలం సీబీఐ, ఈడీ ఆరోపించాయి. ఇప్పుడు పరోక్షంగా ఆమెకు ప్రమేయం ఉన్నదని, ఆమె తరఫున ప్రతినిధిగానే చర్చలకు హాజరయ్యారని సీబీఐ ఈ సప్లిమెంటరీ చార్జిషీట్ ద్వారా ధ్రువీకరించినట్లయింది. గతేడాది ఆగస్టు 17న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయగా తొలి చార్జిషీట్‌ను నవంబరు 25న కోర్టులో దాఖలు చేసింది.
ఆ తర్వాత డిసెంబరు 11న హైదరాబాద్‌లో సీబీఐ అధికారులు ఆమె నివాసంలో ఒక సాక్షిగా విచారించారు. ఇంతకాలం బుచ్చిబాబును సైతం సాక్షిగానే విచారించిన సీబీఐ ఇప్పుడు నిందితుడిగా పేర్కొనడంతో కవిత విషయంలో ఇకపైన ఎలాంటి వైఖరి ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరోసారి ఆమెను విచారణకు సీబీఐ పిలుస్తుందా అనే చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు ఆరోపణలపై ఆమెను ఈడీ అధికారులు మూడుసార్లు విచారించారు.
ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీలో ఆర్థిక అంశాలపై సౌత్ గ్రూపునకు చెందిన లిక్కర్ లాబీకి సూచనలు, సలహాలు ఇవ్వడానికి చార్టర్డ్ అకౌంటెంట్ హోదాలో హాజరైనట్లు సీబీఐ పేర్కొన్నది. ఆ గ్రూపులోని ఎమ్మెల్సీ కవిత, అరబిందో ఫార్మా ఫుల్‌టైమ్ డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి తరఫున ప్రతినిధిగా వ్యవహరించినట్లు బుచ్చిబాబు బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ఇచ్చిన రిప్లైలో సీబీఐ పేర్కొన్నది.
బుచ్చిబాబు మొబైల్ ఫోన్‌లోని చాటింగ్‌లలో ఎక్కడా అతనివ్యక్తిగత ప్రయోజనం లేదా వ్యాపార భాగస్వామ్యానికి సంబంధించిన అంశాలు లేవని ఆయన తరపు న్యాయవాదులు వాదనల సందర్భంగా స్పెషల్ జడ్జీకి వివరించారు. ఒక ప్రొఫెషనల్ చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఢిల్లీలోని లిక్కర్ బిజినెస్‌లో లాభాలకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలను సౌత్ గ్రూపులోని వ్యాపారులకు వివరించినట్లు సీబీఐ పేర్కొన్నది.
తాజాగా సీబీఐ దాఖలు చేసిన స్పెషల్ సప్లిమెంటరీ చార్జిషీట్‌లో ప్రధానంగా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బ్రిడ్‌కో కంపెనీ అధినేత అమన్‌దీప్ ధల్, అర్జున్‌పాండేలకు సంబంధించిన అభియోగాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే వీరు ముగ్గురూ సీబీఐ ఎఫ్ఐఆర్‌లో నిందితులుగా ఉన్నారు. వీరికి తోడుగా గోరంట్ల బుచ్చిబాబును సైతం నిందితుడిగా చేర్చింది. ఈ కేసులో 11వ అక్యూజ్డ్ గా పేర్కొన్నది. తొలి ఎఫ్ఐఆర్‌లో 11వ నిందితుడిగా ఉన్న దినేష్ అరోరా అప్రూవర్‌గా మారారు. దీంతో ఆ స్థానంలో గోరంట్ల బుచ్చిబాబును నిందితుడిగా పేర్కొన్నది. ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌గా ప్రొఫెషనల్ హోదాలో సౌత్ గ్రూపులోని కవిత, శరత్‌చంద్రారెడ్డి ప్రతినిధిగా హాజరైనట్లు సీబీఐ పేర్కొన్నందున వారిద్దరి విషయంలో ఇకపైన దర్యాప్తు ఎలా జరగనుందన్నది కీలకంగా మారింది.
ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీలో లిక్కర్ వ్యాపారులకు లాభాలు, ప్రయోజనాలు కలిగించేలా నిబంధనలను మార్చడంలో ఆ రాష్ట్ర ఎక్సయిజ్ మంత్రిగా మనీష్ సిసోడియా కీలక పాత్ర పోషించారని సీబీఐతొ పాటు ఈడీ కూడా ఆరోపిస్తున్నది. ఈడీ తరపున స్పెషల్ కోర్టుకు హాజరైన న్యాయవాది జోహైబ్ హొస్సేనీ ఈ నెల 12న జరిగిన వాదనల సందర్భంగా కుట్రపూరితంగానే ఎక్సయిజ్ పాలసీలో మార్పులు జరిగాయని వివరించారు.
ఈ కారణంగా లిక్కర్ వ్యాపారులకు లాభం జరిగిందని, వారి నుంచి కిక్ బ్యాక్ రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ముడుపులు అందాయని, ప్రభుత్వ ఖజానాకు రూ. 2,873 కోట్ల మేర నష్టం వాటిల్లిందని వివరించారు. సిసోడియా తరఫున విజయ్ నాయర్, దినేష్ అరోరా తదితరులు సౌత్ గ్రూపునకు చెందిన కవిత, శరత్‌చంద్రారెడ్డితో మీటింగులు, ఫోన్ సంభాషణలు జరిగినట్లు పలువురి స్టేట్‌మెంట్ల ఆధారంగా ఈడీ తన చార్జిషీట్‌లు, రిమాండ్ రిపోర్టుల్లో పేర్కొన్నది.
వీటన్నింటి నేపథ్యంలో సీబీఐ ఇప్పుడు తన దర్యాప్తును ఏ దిశగా జరుపుతుందనే చర్చలు మొదలయ్యాయి. ఏక కాలంలో సీబీఐ, ఈడీలు దర్యాప్తు చేస్తున్నందున సౌత్ గ్రూపు సభ్యులపై ఎలా వ్యవహరిస్తుందనేది కీలకంగా మారింది.