అధ్యయనం తర్వాతే క్యాస్ట్ సెన్సస్‌.. బిహార్ మోడల్‌లోనే గణన

బిహార్ తరహాలోనే కులగణన చేస్తున్నామని కాంగ్రెస్ చెప్తున్నది. ఆ రాష్ట్రంలో అధ్యయనం చేసిన తర్వాతనే క్యాస్ట్ సెన్సస్‌కు శ్రీకారం చుట్టామని, సమాజంలో బీసీల లెక్కలు తేల్చేందుకే సర్వే చేస్తున్నామని సర్కారు స్పష్టం చేస్తున్నది.

Update: 2024-11-11 02:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బిహార్ తరహాలోనే కులగణన చేస్తున్నామని కాంగ్రెస్ చెప్తున్నది. ఆ రాష్ట్రంలో అధ్యయనం చేసిన తర్వాతనే క్యాస్ట్ సెన్సస్‌కు శ్రీకారం చుట్టామని, సమాజంలో బీసీల లెక్కలు తేల్చేందుకే సర్వే చేస్తున్నామని సర్కారు స్పష్టం చేస్తున్నది. బీఆర్ఎస్ సృష్టిస్తున్న అపోహలు, అనుమానాలతో కొంత మంది పబ్లిక్ సర్వేపై ఆందోళన చెందుతున్నారని, బీసీల అభ్యున్నతికి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వం ప్రజలకు పిలుపునిచ్చింది. ఇతర రాష్ట్రాల్లో రాని సమస్యలను ఇక్కడే వస్తాయని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేయడం అవివేకమని కాంగ్రెస్ ఫైర్ అయింది. సర్వేను సక్సెస్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి లీడర్లతో పాటు కుల సంఘాల నేతలు భాగస్వామ్యం కావాలని టీపీసీసీ ఆదివారం సూచించింది. అన్ని జిల్లాల డీసీసీలు కుల సంఘాల నాయకులతో కోఆర్డినేట్ చేయాలని ఆదేశాలిచ్చింది. సర్వే‌లు చేస్తున్న టీమ్స్‌ను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పించాలని కోరింది. గ్రామ స్థాయి నేతల నుంచి స్టేట్ ప్రెసిడెంట్‌ వరకు కులగణన కార్యక్రమంలో పాల్గొనాలని టీపీసీసీ సూచించింది. బీసీలకు మేలు జరిగేలా ఈ ప్రోగ్రామ్‌ను సజావుగా నిర్వహించి, బీసీ లెక్కలు తేల్చితే, ఆయా వర్గాలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ వెల్లడించింది.

కులగణనపై సర్కారు ఫోకస్

కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పలు బీసీ సంఘాలతో పాటు కాంగ్రెస్‌లోని బీసీ నేతలు కూడా ప్రభుత్వాన్ని కోరారు. దీంతో సర్కారు కుల‌గణనపై సీరియస్‌గా ఉన్నది. దీనిలో భాగంగానే కులాల స్పష్టతను గుర్తించేందుకు ఈ నెల 6 నుంచి రాష్ట్రంలో సర్వేను చేపట్టారు. ఈ సమగ్ర సర్వేలో సర్వేలో దాదాపు 55 ప్రశ్నలు ఉన్నాయి. కుటుంబ పెద్ద, సభ్యుల వివరాల మొదలు ఆ కుటుంబాలకున్న ఇంటి స్వభావం, స్థలం, వాహనాలు, వృత్తి, పశువులు, స్థిర, చరాస్తులు, తాగునీటి కనెక్షన్, వంటగ్యాస్, ఇంటి కోసం తీసుకున్న లోన్ తదితరాలన్నీ సేకరిస్తున్నారు. అయితే, వ్యక్తిగత వివరాల గోప్యతకు భంగం కలుగుతుందని ప్రతిపక్షాలు, మిత్రపక్ష పార్టీలు ప్రభుత్వానికి వివరిస్తున్నాయి. కొన్ని ప్రశ్నలు సర్వే నుంచి తొలగించాలని బీఆర్ఎస్, సైబర్ క్రైమ్‌లు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అని సీపీఐ పార్టీలు సర్కారును వివరణ కోరాయి. సర్వే ప్రారంభమైన తొలి రెండు రోజుల్లో ప్రజల్లో కొంత కన్‌ప్యూజన్ నెలకొనడానికీ ఇవే ప్రధాన కారణాలు అని స్వయంగా ఎన్యూమరేటర్లు చెప్తున్నారు. దీంతోనే కుల సంఘాలను ఇన్వాల్వ్ చేయాలని పార్టీ అన్ని జిల్లాల డీసీసీలకు ఆదేశాలిచ్చింది.

దేశవ్యాప్తంగా క్యాస్ట్ సెన్సస్‌కు ఒత్తిడి..?

రాష్ట్రంలో కులగణనను సజావుగా నిర్వహిస్తే దేశంలో ఆటోమేటిక్‌గా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని కాంగ్రెస్ భావిస్తున్నది. తెలంగాణ‌లో జరిగినట్లే తమకూ క్యాస్ట్ సెన్సస్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలు డిమాండ్ చేసే పరిస్థితి వస్తుందని ఆశిస్తోంది. దీంతో తెలంగాణలో సంపూర్ణంగా, సమర్థవంతంగా కులగణనను నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా తెలంగాణలో జరుగుతున్న కులగణన సర్వేను ఎప్పటికప్పుడు మనిటరింగ్ చేస్తున్నారు. కులగణన సర్వే ప్రారంభానికి ముందు హైదరాబాద్‌కు వచ్చిన రాహుల్, ఇక్కడే ఎక్స్‌పర్ట్స్‌తో భేటీ అయ్యారు. అభిప్రాయాలను నివేదిక రూపంలో సేకరించారు. కులగణన సర్వే ప్రారంభమయ్యాక ఏకంగా మోడీకి సవాల్ చేస్తూ రాహుల్ తెలంగాణ సర్వేపై ఎక్స్‌లో పోస్టు చేశారు. కుల గణనపై కాంగ్రెస్ సీరియస్ ప్రయత్నాలు చేస్తుందనడానికి ఇవి నిదర్శనంగా చెప్పొచ్చు.

ఇతర రాష్ట్రాల్లో ఇలా..

కర్ణాటక, బిహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కులగణన ప్రక్రియ పూర్తయింది. దీంతో అక్కడి అనుసరించిన ఫిజికల్, డిజిటల్ పద్ధతులను సర్కారు ఎంపిక చేసుకున్నది. కర్ణాటకలో స్టేట్ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో 2015 ఏప్రిల్ 11 నుంచి మే 30 వరకు 50 రోజుల్లో సర్వే చేశారు. 1.35 కోట్ల కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు. 1.33 లక్షల మంది ఎన్యూమరేటర్లు, 22,190 మంది సూపర్‌వైజర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2024 ఫిబ్రవరి 29న ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించగా మొత్తం ఫిజికల్ పద్ధతిలో నిర్వహించిన ఈ ప్రక్రియకు రూ.162 కోట్లు ఖర్చయినట్లు లెక్కించారు. బిహార్‌లో‌ 45 రోజుల్లో 2.77 కోట్ల ఫ్యామిలీల వివరాలను తీసుకున్నారు. 2.34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, 40 వేల మంది సూపర్‌‌వైజర్లు కలిసి ఫిజికల్, డిజిటల్ పద్ధతిలో పూర్తి చేశారు. ఇందుకోసం రూ.410 కోట్ల ఖర్చు అయింది. 2023 అక్టోబరు 2న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కేవలం పది రోజుల్లో ఈ ఏడాది జనవరి 19 నుంచి 28 తేదీల మధ్యలో 1.67 కోట్ల కుటుంబాల వివరాలను తీసుకున్నారు. గ్రామ వాలంటీర్లు, కార్యదర్శుల ద్వారా డిజిటల్ పద్ధతిలో సేకరించారు. కానీ ప్రభుత్వానికి ఇంకా రిపోర్టు ఇవ్వలేదు.


Similar News